రాజకీయ ఒత్తిళ్లతో కేసుల నుంచి మినహాయింపు


హైదరాబాద్, 15 డిసెంబర్ 2012:

రాష్ట్రంలో, కేంద్రంలోనూ1995-2004 మధ్య ప్రభుత్వాలను  నిలబెట్టిన ఘనత తనదేనని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ ఒత్తిళ్లు తెచ్చి కుంభకోణాల నుంచి బయట పడ్డారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జి.శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు మద్దతిస్తూ పలు కేసుల్లో చట్టానికి దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారని ఎమ్మెల్యే విమర్శించారు.

     తొమ్మిదేళ్ల ఏళ్ల పాలనలో చంద్రబాబు బినామీ పేర్లతో కూడబెట్టుకున్నఆస్తులను 2002లో తెహల్క బయటపెట్టిందని, అలాగే స్టాంపుల కుంభకోణంతోపాటు అనేక స్కాంలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. వాటి వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ఈ కేసుల నుంచి బయట పడేందుకే ఎన్డీయే ప్రభుత్వంలో ఉంటూ మంత్రి పదవులు తీసుకోలేదని ఎమ్మెల్యే విమర్శించారు.

     కేంద్రంలో తానే చక్రం తిప్పానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రానికి ఉపయోగ పడే పనులు చేయకపోగా కేసులు లేకుండా మాత్రం చేసుకున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి సంబంధించిన ఒక్క ప్రాజెక్టుకు కూడా కేంద్రం నుంచి క్లియరెన్స్ తీసుకురాలేదన్నారు. రాజకీయాలను పావుగా వాడుకుని కేసుల నుంచి బయటపడినా, ఏదో ఒక రోజు చట్టం ముందు దొరికిపోతారని అన్నారు.  

     ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో జరిగిన ఓటింగ్‌లో ముగ్గురు టీడీపీ సభ్యులు గైర్హాజరులో కూడా చంద్రబాబు ఒత్తిళ్లు ఉన్నాయని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. తన సంస్థలో పెట్టుబడుల కోసం లోపాయికారి ఒప్పందాలు చేసుకున్న తర్వాతే టీడీపీ ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనలేదన్నారు. సీబీఐ మాజీ డైరెక్టర్ యు.ఎస్.మిశ్రా ఇటీవల చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు తెరచాటు రాజకీయాలను బట్టబయలు చేశాయన్నారు. ఎస్పీ నాయకురాలు మాయావతి, బీఎస్పీ నేత ములాయంసింగ్ యాదవ్ విషయంలోనూ చంద్రబాబు పాత్ర ఉందన్నారు.

తెలంగాణపై కాంగ్రెస్ స్పష్టత ఇవ్వాలి

     తెలంగాణ అంశంపై అఖిలపక్షం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం దానికంటే ముందే పార్టీ అభిప్రాయాన్నిప్రకటించాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 28వ తేదీన జరిగనున్న అఖిలపక్షంలో తాము స్పష్టమైన ప్రకటన చేస్తామని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు బదులిచ్చారు. రాష్ట్రంలో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా లేదని విమర్శించారు. దేశంలో ఎప్పుడూ లేనివిధంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయకుండా ఈ ప్రభుత్వం పారిపోయిందన్నారు.

వ్యక్తిత్వం ముందు కూటములు పని చేయవు

     వచ్చే ఎన్నికల్లో ఏయే పార్టీలు కూటములుగా ఏర్పడినా వ్యక్తిత్వం ముందు దిగదుడుపేనని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడిన శ్రీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై ప్రజల్లో నమ్మకం ఉందన్నారు. ఏ పార్టీలు కూటములుగా ఏర్పడినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ప్రాంతాలకు అతీతంగా పార్టీ దూసుకుపోతోందన్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల పాదయాత్రకు వస్తోన్న జన సమూహమే అందుకు నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీగా ఎదుగుతుందని శ్రీకాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
     
     .

Back to Top