'పిల్లదెబ్బ'కు దిమ్మ'దిరుగుతున్న' బాబు

హైదరాబాద్, 3 అక్టోబర్‌ 2012:  'పిల్ల కాంగ్రెస్'‌ అంటూ వ్యాఖ్యానించిన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ‌ నిప్పులు చెరిగింది. 'పిల్లదెబ్బ'కే కదా మొన్నటి ఉప ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు దిమ్మదిరిగిపోయిందని ఎద్దేవా చేసింది. పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ బుధవారం సాయంత్రం వైయస్‌ఆర్‌ సిపి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అవాకులు చెవాకులు మాట్లాడుతున్న చంద్రబాబును తూర్పారపట్టారు. 'వస్తున్నా.. మీ కోసం' పాదయాత్ర ప్రారంభం సందర్భంగా చంద్రబాబు నాయుడు మంగళవారంనాడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 'చిన్న కాంగ్రెస్‌ పార్టీ' అంటూ వ్యాఖ్యానించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో గ్యాస్‌ సిలిండర్‌ను దాదాపు వెయ్యి రూపాయలకు పైనే పెట్టి కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడబోతోందని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. సబ్సిడీ మీద ఇచ్చే ఆరు సిలిండర్లు దాటితే అంతర్జాతీయ ఆయిల్‌ కంపెనీలకు సంబంధించిన నిబంధనల ప్రకారం రేటు ఉంటుందని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. కాని కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో తొమ్మిది సిలిండర్లను సరఫరా చేయాలని సోనియా గాంధీ స్పష్టంగా చెప్పినప్పటికీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఆరు సిలిండర్లే ఇస్తామని చెప్పడం అత్యంత దారుణం అని అన్నారు. ఆరు సిలిండర్లు దాటితే వెయ్యి రూపాయలకు పైనే పెట్టి కొనుక్కోవాల్సిన దుస్థితి మన రాష్ట్ర ప్రజలకు ఎదురవబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్‌ సిలిండర్‌ అంటే పేద, మధ్య తరగతి, ఉన్నత వర్గాలు అందరూ తప్పనిసరిగా వినియోగించే అవసరం అన్నారు. ప్రధానంగా పేద, మధ్య తరగని ప్రజలకు ఇచ్చే సబ్సిడీ అంటే వారి వంటింటికి ఇచ్చే వరంలా భావిస్తున్నారని, ఈ అధిక భారం పేద, మధ్య తరగతి వర్గాలకు భరించలేని పరిస్థితి ఉందని పద్మ అన్నారు.

మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐదేళ్ళ పాటు సిలిండర్‌ ధర పెంచనేలేదన్నారు. మధ్యలో కేంద్రం 50 రూపాయలు పెంచినప్పుడు సబ్సిడీ రూపంగా అందజేసిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు నిత్యం గుర్తు చేసుకుంటున్నారని పద్మ పేర్కొన్నారు. ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించిన విషయాన్ని గుర్తు చేశారు. మధ్యలో 25 రూపాయలు కేంద్రం తగ్గించినప్పుడు ఇక్కడ కూడా తగ్గించాలని నానా యాగీ చేసిన టిడిపి ఇప్పుడు వెయ్యి రూపాయలకు చేరిపోయినా సీరియస్‌గా మాట్లాడకుండా, ఆందోళన చేయకుండా ప్రధాన ప్రతిపక్షం పారిపోవడం దురదృష్టకరం అని అన్నారు.

విద్యార్థులకు ఫీజులు పెంచిన తరువాత రీయింబర్సుమెంటు పథకాన్ని కేవలం 474 మందికి మాత్రమే వర్తించింది. పది వేల మందికి మేలు చేకూర్చాల్సిన ఈ పథకాన్ని కొద్ది మందికి మాత్రమే అమలు చేయడాన్ని తప్పు పట్టారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసి ఈ పథకం కుటుంబానికి ఒక్కరికు అమలు చేయాలని చూస్తోందని దుయ్యబట్టారు. ఫీజు పథకాన్ని అటక ఎక్కించేందుకు ఈ ప్రభుత్వం దారులు వెతుకుతోందని ఆరోపించారు. వైయస్‌‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, జగన్మోహన్‌రెడ్డి, విజయమ్మ దీక్షలు చేసిన ఆందోళనే ఈ పథకం కోసం అని గుర్తు చేశారు. నేటి కిరణ్‌కుమార్‌ రెడ్డి పరిపాలన నాటి చంద్రబాబు పాలనకు నకలుగా కొనసాగుతోందని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలను, సబ్సిడీలను రద్దుచేయాలన్న చంద్రబాబు దుర్బుద్ధే కాంగ్రెస్‌ పాలనలోనూ కనిపిస్తోందని ఆరోపించారు. ఇది పేదల పాలిట శాపం అన్నారు.

సంక్షేమానికి మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కొత్త అర్థాన్ని చెప్పారు. పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలను మార్చడానికి ఆయన అమలు చేసిన పథకాలు బాటలు వేశాయన్నారు. ప్రజల జీవితాలను దొంగదెబ్బ తీయాలని చూస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీయకుండా, ప్రశ్నించాల్సిన వేదికల మీద మాట్లాడకుండా చంద్రబాబు ఆందోళన చేయకుండా ఇంత తీవ్రమైన సమస్యలను పట్టించుకోకుండా ప్రజల మధ్యకు వెళుతున్నారు. రాజకీయ నాయకులు నిరంతరం ప్రజల మధ్య ఉండాలని తాము కోరుకుంటామన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి జనంలోనే తిరిగిన విషయాన్ని గుర్తుచేశారు.

చంద్రబాబు నాయుడు ప్రజల మధ్యకు వెళ్ళి 'పి‌ల్ల కాంగ్రెస్' అంటున్నారు. కొమ్మ రెమ్మ అంటున్నారు. తల్లీ పిల్ల అని, పిల్ల కాంగ్రెస్‌ అని జగన్మోహన్‌రెడ్డిని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ పిల్ల కొట్టిన దెబ్బకే మొన్నటి ఉప ఎన్నికల్లో మైండ్‌ బ్లాక్‌ అయి 18 స్థానాల్లో పరాజయం పాలయ్యారు. ఎంపీ స్థానంలో ఎక్కడ ఉన్నారో గల్లంతయ్యారు. సగానికి సగం పైగా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయారని ఎద్దేవా చేశారు. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వారి సమస్యల గురించే ఆలోచించాలని, ఆరా తీయాలని అన్నారు. అలా కాకుండా రాజకీయాలు మాట్లాడకూడదని ఆయనకు సలహాలు ఇస్తున్న సినీ దర్శకులు చెప్పలేదా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ పార్టీతో నిస్సిగ్గుగా జత కలిసినా ఒక్క సీటు కూడా ఎందుకు గెలుచుకోలేకపోయారంటూ చంద్రబాబును పద్మ నిలదీశారు. కాంగ్రెస్‌ - టిడిపిలు ఒక్కటైనా పిల్ల పార్టీకే ఎక్కువ ఓట్లు ప్రజలు ఎందుకు వేశారో లెక్కలు చూసుకోలేదా అని ప్రశ్నించారు. కేవలం జగన్‌ను చులకన చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే చంద్రబాబు జనంలోకి వెళ్ళినట్లున్నదన్నారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే ఎవరు ఎవరితో జత కలిశారో తేటతెల్లం అవుతుందని పద్మ సవాల్‌ చేశారు. అప్పుడు ముఖం చాటేసిన చంద్రబాబు ఇప్పుడు వైయస్‌ఆర్‌ సిపి కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కయిందంటూ మాట్లాడడం సరికాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టనంటే పెట్టనని చంద్రబాబు బాహాటంగానే ప్రకటించిన విషయాన్ని వాసిరెడ్డి పద్మ ప్రస్తావించారు. చంద్రబాబు మాటలే ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో ప్రజలు అర్థం చేసుకోవడానికి అన్నారు.

ఒక్క రోజు 8 కిలోమీటర్లు నడవగానే పిక్కలు పట్టేశాయని, రాత్రంతా నిద్ర లేదని చంద్రబాబు అనడాన్ని వాసిరెడ్డి పద్మ ఎత్తి చూపారు. ఇప్పుడే ఏమయిందని, ముందుంది మరింత కష్టకాలం అన్నారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడెవడైనా కష్టాలకు ఎదురు నిలవాలన్నది చంద్రబాబుకు ఇప్పటికైనా తెలిసివస్తుందన్నారు. అన్ని కష్ట నష్టాలను ఎదుర్కొని నిలబడుతున్న నూతనతరం నాయకుడు జగన్మోహన్‌రెడ్డిని చంద్రబాబు 
విమర్శించడాన్ని ఆమె ఖండించారు. రోజుకు 20 కిలోమీటర్లు నడవడాన్ని కూడా 'త్యాగం' అని అభివర్ణించుకుంటున్న చంద్రబాబు తీరును పద్మ ఎద్దేవా చేశారు. ప్రజల పట్ల ప్రేమ ఉంటే ఎలాంటి కష్టాలైనా దూదిపింజల్లా ఎగిరిపోతాయన్నారు. తొమ్మిదేళ్ళ పాలనలో మీరేం చేశారని చెప్పుకునేందుకు ప్రజల్లోకి చంద్రబాబు వెళుతున్నారని ప్రశ్నించారు. తన పాలనలో మీరేం చేసిందీ చెప్పేందుకు ప్రజల్లోకి వెళుతున్నారా అని పద్మ అన్నారు. జనం మధ్యకు వెళ్ళి మొసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబు అంటే ఎవ్వరికీ నమ్మకం లేదన్నారు.

'దణ్ణం ఎవరు పెట్టినా అది దేవుడికే చేరుతుంద'న్నట్లు పాదయాత్ర ఎవరు చేసినా దివంగత వైయస్‌ రాజశేఖరరెడ్డే గుర్తుకు వస్తారన్నారు. మీ కోసం పాదయాత్ర చేస్తున్నాను కనుక నా మీద సానుభూతి చూపండి అన్న విధంగా చంద్రబాబు యాత్ర ఉందని పద్మ ఎద్దేవా చేశారు. అసలు మీకోసం నేనొస్తున్నా అనేదే ఓ పొగరుబోతు ధోరణి అని ఆమె వ్యాఖ్యానించారు. ఉచిత విద్యుత్‌ ఇస్తానన్న హామీతోనే వైయస్‌ పాదయాత్ర ప్రారంభించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. డేవిడ్‌ అనే చిన్న గొర్రెల కాపరి వడిసెలతో కొట్టిన రాయి దెబ్బకు తల పగిలిన గోలియద్‌ రాక్షసుడి కథను పద్మ ఉటంకించారు. అలాంటి దెబ్బే చంద్రబాబుకు ఉప ఎన్నికల్లో తగిలిన విషయాన్ని గుర్తు చేశారు.

మీకోసం నేనొస్తున్నా, మీకోసం నేను చచ్చిపోతున్నా ఏమిటీ మాటలు అన్నారు. మీ వారసత్వ సమస్యను పరిష్కరించుకోవడానికో, కుటుంబ సమస్యను పరిష్కరించుకోవడానికో పాదయాత్రను ఉపయోగించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. పాదయాత్ర పవిత్రతను గుర్తుంచుకోవాలని ఆమె చంద్రబాబుకు సూచించారు.
Back to Top