'నారా'సురుడు చంద్రబాబు: జనక్‌ ప్రసాద్‌

‌హైదరాబాద్, 10 ఏప్రిల్‌ 2013: మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి గురించి కానీ, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని విమర్శిస్తూ మాట్లాడితే సహించేది లేదని పార్టీ అధికార ప్రతినిధి బి. జనక్‌ ప్రసాద్‌ హెచ్చరించారు. వస్తున్నా మీ కోసం పాదయాత్రలో చంద్రబాబు రెండు మూడు రోజులుగా అవాంఛనీయమైన వ్యాఖ్యలు చేస్తుండడంపై ఆయన నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్‌, మహానేత డాక్టర్‌ వైయస్‌ఆర్‌ విగ్రహాలు, ఫొటోల విషయంలో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయం అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. అధికారం కోసం సోదరుడిని హతమార్చి, తండ్రిని జైలులో పెట్టిన ఔరంగజేబు కన్నా చంద్రబాబు నీచుడని జనక్‌ ప్రసాద్‌ విమర్శించారు. ప్రజలను వేధించిన నరకాసురుడిలా చంద్రబాబు తన తొమ్మిదేళ్ళ పాలనలో 'నారాసురుడు'లా పీడించారని ఆయన ఆరోపించారు. మహానేత వైయస్‌ఆర్‌ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని, స్వచ్ఛందంగా ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారని జనక్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు.

'ఎన్టీఆర్‌లో నైతిక విలువలు శూన్యం' అంటూ ఇండియా టు డే పత్రిక ఇంటర్వ్యూలో చెప్పిన చంద్రబాబుకు ఇప్పుడు ఆయన మహానుభావుడు, యుగపురుషుడిలా ఎలా మారారని జనక్‌ ప్రసాద్‌ నిలదీశారు. ఎన్టీఆర్‌ను 1995లో పదవీ చ్యుతుడిని చేయడమే కాకుండా వైశ్రాయ్‌ హొటల్‌ వద్ద చెప్పులు వేయించి అవమానించిన దశమగ్రహం చంద్రబాబు అని దుమ్మెత్తిపోశారు. టిడిపి సభ్యత్వ నమోదు పుస్తకాలపైన ఎన్టీఆర్‌ బొమ్మలు తొలగించిన ఘనుడు చంద్రబాబే అన్నారు. పదవీ వ్యామోహంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని నిప్పులు చెరిగారు.

వచ్చే ఎన్నికలు జరిగే ఒక్క రోజు తనను గుర్తుపెట్టుకోవాలంటూ ప్రజలకు చంద్రబాబు చేసిన విజ్ఞప్తిపైన జనక్‌ ప్రసాద్‌ స్పందిస్తూ... తెలిసి తెలిసీ పులి నోట్లో ఎవరైనా తల పెడతారా? అని వ్యాఖ్యానించారు. అన్ని ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు ఓడించారన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా టిడిపిని ఓడించి చంద్రబాబు చెప్పినట్లే ఆ పార్టీ జెండా పీకేయడం ఖాయమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఆయన ఏమి సేవలు చేశారో చెప్పుకునే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు.

మహానేత వైయస్‌లా 108 సేవలు, ఆరోగ్యశ్రీ తెచ్చానని గాని, ఫీజు రీయింబర్సుమెంట్‌ చేశానని గానీ, డ్యామ్‌లు కట్టానని గానీ చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని ఆయన ఎద్దేవా చేశారు. విద్యార్థుల చేత మొక్కలు పీకించిన ఘనుడన్నారు. పేదలు ఆస్పత్రికి వెళితే యూజర్‌ చార్జీలు వసూలు చేసిన వైనాన్ని గుర్తుచేశారు. వ్యవసాయ విద్యుత్‌ మోటార్లకు చైనా మీటర్లు బిగించడమే కాక బిల్లులు కట్టలేకపోయిన రైతులను శిక్షించేందుకు ప్రత్యేక పోలీసుస్టేషన్లు, కోర్టులు పెట్టారని అన్నారు.

ప్రతిరోజూ శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ఎందుకు విమర్శిస్తున్నారని చంద్రబాబును జనక్‌ ప్రసాద్‌ నిలదీశారు. ప్రజల కోసం శ్రీ జగన్‌ జలదీక్ష, ఫీజుపోరు లాంటి ఎన్నో దీక్షలు, పోరాటాలు చేశారని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు కొడుకు లోకేష్‌ చీకటి చరిత్ర గురించి చెప్పాలంటే మహిళలు చీపుర్లతో కొడతారన్నారు. ఎల్లో పత్రికలు, చంద్రబాబు మాటలు వినడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరన్నారు. తమకు ఎవరు మేలు చేస్తారో వారినే గెలిపిస్తారన్నారు. అలాంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. బాబు మాట్లాడే అవాకులు, చెవాకులతో ప్రజలు అసహ్యంచుకోవడం, ద్వేషించడం తథ్యమని హెచ్చరించారు.
Back to Top