సన్నాసులు సవాళ్ళు విసరడమేంటి?

హైదరాబాద్, 24 నవంబర్ 2013:

దొంగసారా అమ్మి, కల్తీసారా తయారు చేసిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ లాంటి సన్నాసులు కూడా సవాళ్ళు విసరడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నిప్పులు చెరిగారు. సోనియా గాంధీతో శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి కుమ్మక్కయ్యారని రమేష్ ఆరోపించడంపై తీవ్రంగా ప్రతిస్పందించారు. డబ్బులిచ్చి రాజ్యసభ పదవి కొనుక్కున్న సీఎం రమేశ్‌కు శ్రీ జగన్‌ను విమర్శించే స్థాయి లేదన్నారు. రమేశ్‌కు రాజకీయం ఎక్కడ ఉంది? సన్యాసం చేసేదేముందని ఎద్దేవా చేశారు.  పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో భూమన కరుణాకరరెడ్డి మాట్లాడారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి సోనియా గాంధీ వద్దకు వెళితే రాష్ట్ర విభజన ఆగిపోతుందని, అలా ఆగకపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తానన్న రమేశ్‌ వ్యాఖ్యలను భూమన తూర్పారపట్టారు. సోనియాతో కుమ్మక్కైనందువల్లే శ్రీ జగన్‌కు రాష్ట్రపతి పదేపదే అపాయింట్‌మెంట్‌లు ఇస్తున్నారని రమేశ్‌ వ్యాఖ్యానించడంపై భూమన ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రమేశ్‌ సారా సన్యాసి లేదా వట్టి సన్నాసి అని దుయ్యబట్టారు.

చిత్తూరు తాగునీటి పథకంలో భారీ కుంభకోణం :
చిత్తూరు జిల్లా తాగునీటి పథకంలో భారీ ఎత్తున కుంభకోణానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెరతీశారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. కండలేరు రిజర్వాయర్‌ నుంచి సోమశిల ద్వారా 6.1 టీఎంసీల నీటిని తరలించే పథకానికి అంచనాలు భారీగా పెంచేశారని విమర్శించారు. రూ. 2,500 కోట్లతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టు వ్యయం అంచనాను రూ. 5,300 కోట్లకు పెంచి చూపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందులో రూ. 600 కోట్లు దోచుకోవడానికి సీఎం వ్యూహరచన చేశారని ఆరోపించారు. చిత్తూరు సమగ్ర తాగునీటి పథకంపై సిట్టింగ్‌ జడ్జి చేత విచారణ జరిపిస్తే.. వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భూమన అన్నారు. ముఖ్యమంత్రి అవినీతి ఎంతో తేటతెల్లం అవుతుందన్నారు.

గాలేరు - నగిరి, హంద్రీ - నీవా పథకాలకు చక్కని వ్యూహంతో ఏర్పాటు చేసి, చిత్తూరు జిల్లాలో దాదాపు 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 45 లక్షల మందికి తాగునీరు అందించాలన్న బృహత్తరమైన ఆలోచన దివంగత సీఎం, మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి చేశారని భూమన గుర్తుచేశారు. చిత్తూరు జిల్లాకే చెందని సీఎం కిరణ్‌ ఆ రెండు పథకాలకూ శాశ్వత సమాధి కట్టారని నిప్పులు చెరిగారు. చిత్తూరు జిల్లాకు తాగునీటి అందిస్తున్నట్లుగా మార్కులు పొందేందుకు.. మంచినీటి పథకం ద్వారా భారీ స్థాయిలో జేబులు నింపుకోవడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. తన తమ్ముడు సంతోష్‌రెడ్డి దళారిగా ఈ ప్రాజెక్టు వ్యవహారాన్ని నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. నెల్లూరుకు చెందిన కాంట్రాక్టర్‌ సుధీర్‌రెడ్డిని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు సీఎం ఎత్తు వేశారని అన్నారు.

ఒక్కొక్క ఉపాధ్యాయుని బదిలీ చేయడానికి లక్ష రూపాయల చొప్పున సాక్షాత్తూ సీఎం కార్యాలయమే తీసుకునే కక్కుర్తి జరుగుతోందని దుయ్యబట్టారు. సీఎం కార్యాలయం అవినీతిలో ఎంతగా దిగజారిపోయిందో ఈ ఉదంతమే ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. ఉన్నంతకాలం దండుకుందామనే ధోరణిలో సీఎం కిరణ్‌ వ్యవహరిస్తున్నారన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్న చందంగా మూడు నెలల్లో ఊడిపోయే పదవిని అడ్డుపెట్టుకుని వీలైనంత ఎక్కువ దండుకోవాలనే కార్యక్రమంలో ఆయన తలమునకలైపోయి ఉన్నారని విమర్శించారు. దందాలు చేసుకోవడానికే కిరణ్‌ సమైక్య ముసుగు వేసుకున్నారని ఆరోపించారు.

Back to Top