మరో చిరంజీవి కానున్న చంద్రబాబు

హైదరాబాద్, 17 ఫిబ్రవరి 2013: చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసినట్లే చంద్రబాబు నాయుడు కూడా టిడిపిని 2014 లోగా నిస్సిగ్గుగా కలిపేస్తారని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రోజా జోస్యం చెప్పారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పుకునే చంద్రబాబు ఒక్క రోజున కూడా వారి సమస్యలను ప్రస్తావించలేదని విమర్శించారు. వైయస్‌ఆర్‌సిపి అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న విశేష ఆదరణను చూసి సహించలేకపోతున్న టిడిపి నాయకులు తీరును రోజా తీవ్రంగా తిప్పికొట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం రోజా మీడియా సమావేశంలో చంద్రబాబు, టిడిపి నాయకుల తీరును ఉతికి ఆరేశారు.

చంద్రబాబుది పనిష్మెంట్‌ యాత్ర : 
చంద్రబాబు ఎంతసేపూ ఎన్టీఆర్‌ బొమ్మను చూపించో లేక మహానేత వైయస్‌ పథకాలను తీసుకువస్తానని చెప్పి తనకు అధికారం ఇవ్వాలని ప్రాధేయపడుతున్నారని ఆమె విమర్శించారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే గతంలో తాను అందించిన పరిపాలననే తీసుకువస్తానని చెప్పి ఓట్లు అడగాలని రోజా సవాల్‌ చేశారు. నిజానికి చంద్రబాబు చేస్తున్నది పాదయాత్ర కాదని, 'పనిష్మెంట్‌ యాత్ర' అని ఆమె అభివర్ణించారు. చంద్రబాబు తొమ్మిదేళ్ళ పాలనలో తమను పెట్టిన బాధలకు రాష్ట్ర ప్రజలు విధించిన శిక్షే ఆయన పాదయాత్ర అని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు నాయుడికి ఎదురుగా కనిపిస్తున్నది శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అని, ఆయన స్థాపించిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని మొగ్గలోనే తుంచేయాలని కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కయి, కుట్రలు చేశారని రోజా దుయ్యబట్టారు. శ్రీ జగన్‌ను జైలు నుంచి బయటికి రాకుండా చేసి అక్కడి నుంచే శిక్ష వేయించేయాలన్నంత ఆతృతతో కాంగ్రెస్‌, టిడిపిలు కృషిచేస్తున్నాయన్నారు. అయితే, వారి ఆటలు సాగవని, శ్రీ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల ఆదరణతో త్వరలోనే సిఎం అవుతారని ధీమా వ్యక్తంచేశారు.

టిడిపి దిగజారుడు వ్యాఖ్యలు : 
శ్రీ వైయస్‌ జగన్‌, శ్రీమతి విజయమ్మ, శ్రీమతి షర్మిలను కించపరిచేందుకు ఎంతకైనా చంద్రబాబు దిగజారిపోతున్నారని రోజా నిప్పులు చెరిగారు. అన్న‌శ్రీ జగన్‌ను కుట్ర చేసి జైలులో నిర్బంధిస్తే... అన్న తరఫున నేనున్నానంటూ శ్రీమతి షర్మిల ఆయన తరఫున మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారని రోజా చెప్పారు. ఒక మహిళ పాదయాత్ర చేయడమంటే ఎంత కష్టమో టిడిపి నాయకులు, చంద్రబాబుకు తెలియకపోవచ్చు కాని ప్రజలందరికీ తెలుసన్నారు. శ్రీమతి షర్మిల పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండడంతో తట్టుకోలేక చంద్రబాబునాయుడు తమ పార్టీ మహిళతో అసందర్భ వ్యాఖ్యలు చేయించారని రోజా తప్పు పట్టారు. శ్రీమతి షర్మిల పాదయాత్రను 'ర్యాంప్‌వాక్‌'తో పోల్చడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. శ్రీ జగన్‌ను గజదొంగ అని, వారి మేనమామను 420 అని విమర్శించడం అంటే పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్న సామెతలా ఉందన్నారు.

పాదయాత్రలో చంద్రబాబు ఇస్తున్న కపట హామీలను రోజా అపహాస్యం చేశారు. అధికారం ఇస్తే తాను ఉచిత విద్యుత్‌ ఇస్తానంటూ చంద్రబాబు చెబుతున్నారని, అయితే, అది నువ్వు ఇచ్చేదేంటయ్యా! దాన్ని మహానేత వైయస్‌ ఎప్పుడో ఇచ్చేశారు కదా అన్నారు. రుణ మాఫీ చేస్తానంటూ బాబు చెబుతున్నారని కానీ ఆ సౌకర్యాన్నీ మహానేత అమలు చేశారన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని తాను మరింత మెరుగ్గా చేస్తానని చంద్రబాబు చెబుతున్నారని, అయితే ఆ పథకం రూపకర్త కూడా మహానేత డాక్టర్‌ వైయస్‌ అని రోజా గుర్తు చేశారు. బియ్యం పథకాన్ని వైయస్‌ఆర్‌ మాదిరిగా తీసుకువస్తానని చెబుతున్నారని, అయితే తన హయాంలో కిలో రెండు రూపాయల బియ్యాన్ని రూ.5.25 చేసిన విషయాన్ని రోజా ప్రస్తావించారు.

కిరణ్‌ పాలనలో అన్ని ధరలూ పెరిగాయి : 
కిరణ్‌ కుమార్‌రెడ్డి పాలనలో పెట్రోలు, డీజిల్‌ ధరలు ఇప్పటికి 20 సార్లకు పైగా పెరిగాయని రోజా ఆరోపించారు. గ్యాస్‌ ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయని అన్నారు. గతంలో ఏనాడూ లేని విధంగా గ్యాస్‌ సరఫరాకు ఆధార్‌తో లింకు పెట్టడమేమిటని రోజా నిలదీశారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రజల మధ్య పైపైకి తిట్టిపోస్తున్నట్లు నటిస్తూ చంద్రబాబు పరోక్షంగా దానితోనే అంటకాగుతున్నారని రోజా దుయ్యబట్టారు. సినీ నటుడు, నిర్మాత మురళీమోహన్‌కు హైదరాబాద్‌లోని అత్యంత విలువైన భూములను కారు చౌకగా చంద్రబాబు ధారాదత్తం చేసిన వైనాన్ని ఆమె ప్రస్తావించారు.

టిడిపి దిగజారుడు విధానాల కారణంగానే ఇంతకు ముందు 26 సార్లు జరిగిన ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదని రోజా ఎద్దేవా చేశారు. అలాంటి నీచ సంస్కృతి కారణంగానే చంద్రబాబు తన సొంత జిల్లాలో ఎమ్మెల్సీసి గెలిపించుకోలేకపోయారని ఆమె వ్యాఖ్యానించారు. సంతలో పశువులను కొన్న మాదిరిగా శ్రీ జగన్‌ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనేస్తున్నారంటున్న చంద్రబాబు వ్యాఖ్యలపై రోజా కస్సుమన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు వైశ్రాయ్‌ హొటల్లో పెట్టిన ఎమ్మెల్యేలను ఆయన ఎన్ని కోట్లకు కొన్నారో, ఆ సొమ్ములు ఎక్కడి నుంచి తెచ్చారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. బ్లాక్‌మనీని వైట్‌ మార్చుకోవడం కోసం తన వాటాకు వచ్చిన కొద్దిపాటి భూమిని కన్న తండ్రికే అమ్మినట్లు చూపిన ఘనుడు చంద్రబాబు నాయుడని నిప్పులు చెరిగారు. చిత్తూరు జిల్లాలో ఎంత పంటలు పండుతాయి? ఆ వచ్చిన పంటతో చంద్రబాబు తల్లి అమ్మణ్ణమ్మ హైదరాబాద్‌లో భూములు కొన్నరన్న చంద్రబాబు చాణక్యం ఎవరికి తెలియనిది అని రోజా వ్యాఖ్యానించారు.

తప్పించుకునే చాణక్యం చంద్రబాబుది : 
శ్రీ జగన్‌పై అవినీతి ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు నాయుడు తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరగకుండా కోర్టుల నుంచి ముందుగానే స్టే తెచ్చుకున్నారని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు రోజా బదులిచ్చారు. తన మీద వచ్చిన ఆరోపణలను చాకచక్యంగా తప్పించుకోవడం బాగా తెలిసిన చాణక్యం ఆయనది అన్నారు. టిడిపి స్క్రిప్టును బిజెపి నాయకుడు ఎన్‌విఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ప్రెస్‌మీట్‌ చదివి వినిపించారని మరో ప్రశ్నకు సమాధానం చెప్పారు. శ్రీమతి షర్మిల పాదయాత్రకు వస్తున్న జనాదరణను చూసి తట్టుకోలేక ఆమె భర్త అనిల్‌ను వివాదాల్లోకి లాగుతున్నారని బదులిచ్చారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఇలా అన్ని మతాల వారినీ మహానేత వైయస్‌ సమానంగా చూశారని ఒక విలేకరి ప్రశ్నకు రోజా బదులిచ్చారు.
Back to Top