మంత్రి ఆనంపై క్రిమినల్‌ చర్యలు

హైదరాబాద్, 28 ఏప్రిల్‌ 2013: రాజ్యాంగ నియమాలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిప్పులు చెరిగింది. ద్రోహబుద్ధితో శ్రీ జగన్‌ పట్ల, మహానేత వైయస్‌ కుటుంబంలోని శ్రీమతి వైయస్‌ విజయమ్మ, శ్రీమతి షర్మిలకు పరువు నష్టం కలిగేలా మీడియాలో వ్యాఖ్యలు చేసినందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ క్రమంలో నోటీసులు పంపిస్తున్నట్లు పేర్కొంది. పార్టీ అధికార ప్రతినిధి, ఉపాధ్యక్షుడు శివకుమార్‌ ఆదివారం మధ్యాహ్నం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మహానేత వైయస్‌ కుటుంబం పట్ల అనుచితమైన, నేరపూరిత వ్యాఖ్యలు చేసిన ఆనం బేషరతుగా క్షమాపణ చెప్పాలని జనక్‌ప్రసాద్‌, శివకుమార్‌ డిమాండ్‌ చేశారు.

వైయస్‌ కాలు మొక్కి మంత్రి అయిన ఆనం బండారం అందరికీ తెలుసని జనక్‌ ప్రసాద్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు, పార్టీ శ్రీ జగన్‌, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ అని అన్నారు.‌ అలాంటి నాయకుడిపై నేర ప్రవృత్తి గల వ్యాఖ్యలు చేసిన ఆనంపై తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆనం నారాయణరెడ్డికి నోటీసులు పంపిస్తున్నట్లు తెలిపారు. ద్రోహబుద్ధితో వ్యాఖ్యలు చేసిన ఆనం తీరును ఖండించారు. ‌నేరపూరిత వ్యాఖ్యలు చేసిన ఆనంను కేబినెట్‌ నుంచి తొలగించాలని సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డిని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

ఎలాంటి తప్పూ చేయని శ్రీ జగన్‌ను కుట్ర చేసి జైలులో పెట్టారని జనక్‌ ప్రసాద్‌ ఆరోపించారు. కోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో నేర నిరూపణ జరిగినట్టుగా మంత్రి ఆనం వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. కోర్టును ప్రభావితం చేయాలని ఆనం అలాంటి వ్యాఖ్యలు చేశారా? అని నిలదీశారు. మహానేత వైయస్‌ చెబితే జిఓలపై సంతకాలు చేశామని ఆయన చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. మంత్రుల చర్య చట్ట విరుద్ధం అన్నారు. వివాదాస్పద ఆ జిఓలతో శ్రీ జగన్‌కు సంబంధం ఏమిటని జనక్‌ ప్రసాద్ ప్రశ్నించారు. ఎవరిని తృప్తిపరచడానికి ఆనం ఆ వ్యాఖ్యలు చేశారని నిలదీశారు. ప్రమాణ స్వీకారాన్ని ఉల్లంఘించిన ఆనంను పదవి నుంచి గవర్నర్‌ బర్తరఫ్‌ చేయాలని కోరారు.

ఎన్నో పార్టీలు మారిన ఆనం రామనారాయణరెడ్డి చివరికి మహానేత వైయస్‌ కాళ్ళు పట్టుకుని కాంగ్రెస్‌లో చేరి మంత్రి అయ్యారని జనక్‌ప్రసాద్‌‌ ఎద్దేవా చేశారు. చంచల్‌గూడ జైలును వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంగా వాడుకుంటున్నారంటూ ఆరోపించడానికి ఆనంకు సిగ్గుండాలన్నారు. జైలు మాన్యువల్‌ ప్రకారమే శ్రీ జగన్‌ ములాఖత్‌లు జరుగుతున్నాయని జైలు అధికారి చేసిన ప్రకటన వాస్తవమా? లేక ఆనం వ్యాఖ్యలు నిజమా అని ప్రశ్నించారు. ఆనం ఆరోపణలు వాస్తవమైతే జైలు అధికారిని సస్పెండ్‌ చేసే దమ్ముందా? అని సవాల్‌ చేశారు.
 
మహానేత వైయస్‌ మరణించాక సిఎం క్యాంపు కార్యాలయం వద్ద శ్రీ జగన్‌ సిఎం కావాలంటూ ప్రతిపాదించిన వ్యక్తి ఆనం రామనారాయణరెడ్డి అని శివకుమార్‌ గుర్తుచేశారు. ఆనం మాట్లాడే తీరు చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు. వైయస్‌ కుటుంబం పట్ల ఆనం చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోందన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై ఆనం బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. లేకపోతే జరగబోయే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top