కేంద్రం కనుసన్నల్లోనే సిబిఐ

హైదరాబాద్, 30 ఏప్రిల్‌ 2013: కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే సిబిఐ పనిచేస్తోందని తాము చెప్పిందే నిజమైందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. సిబిఐని ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు తమ వాదనకు బలం చేకూర్చాయన్నారు. సిబిఐ ఇలాగే వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికి ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. బొగ్గు స్కాం విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సిబిఐ గురించి చేసిన వ్యాఖ్యల ద్వారా ఈ విషయం రుజువైందని అంబటి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ చేతిలో కీలుబొమ్మలా మారిన సిబిఐ ఆ పార్టీ ప్రత్యర్థులను పీడించేలా వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. ‌తనను కాపాడుకోవడానికి ఒక రాజకీయ ఆయుధంలా సిబిఐని కాంగ్రెస్‌ పార్టీ ఉపయోగించుకుంటున్నదని అంబటి ఆరోపించారు. సిబిఐకి స్వతంత్ర ప్రతిపత్తి అవసరం అని అనేక సందర్భాల్లో తాము చెప్పామన్నారు. అదే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కూడా వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు సిబిఐ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు.

కోల్‌స్కాంపై ఇటీవల సుప్రీం విచారణలో వెలువడిన నిజాలు చూస్తుంటే ప్రభుత్వం, సిబిఐ ఇంతలా దిగజారిపోవాలా అన్న బాధ కలుగుతోందన్నారు.  కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో సిబిఐ పనిచేస్తోందని, కేంద్ర ప్రభుత్వం ఏది చెబితే అది చేసే కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నదని అనేక సందర్భాల్లో తమతో పాటు దేశ వ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు వివరంగా వివరించినట్లు చెప్పారు. కాంగ్రెస్‌ మిత్రులైతే ఒక విధంగా, దాని రాజకీయ శత్రువులైతే మరో విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

భారతదేశంలో రాష్ట్రపతి, సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత వ్యవస్థలు వ్యవస్థలున్నాయని అంబటి అన్నారు. అలాగే ప్రజలు ఎన్నుకున్న ప్రధాని, ప్రధాని కార్యాలం కూడా ఆ కోవకే చెందుతాయని భావిస్తున్నామన్నారు. అలాంటి ప్రధాని కార్యాలయం అత్యున్నత న్యాయస్థానానికి వక్రీకరించిన సమాచారం అందించడంలో నిమగ్నమై ఉన్నదని ఆరోపించారు. భారత ప్రజాస్వామ్యంలో ఇంతకన్నా సిగ్గుపడాల్సిన విషయం మరొకటి లేదన్నారు. ఇలా జరుగుతున్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పక్షాల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. మార్చి 12న స్టేటస్‌ రిపోర్టు సమర్పించినప్పుడు దాన్ని ఎవ్వరితోనూ పంచుకోలేదంటూ సుప్రీంకోర్టులో చేసిన వాదనల్లో అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చెప్పారన్నారు. అయితే, మొన్న 26వ తేదీన సిబిఐ డైరెక్టర్‌ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేస్తూ ఈ రిపోర్టును కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్వనీకుమార్‌తోనూ, ప్రధాని కార్యాలయంలోని ఇద్దరు కొందరు అధికారులతో కూడా పంచుకున్న తరువాతే సుప్రీంకోర్టులో దాఖలు చేశామని చెప్పారన్నారు. దీనితో ప్రపంచం అంతా నివ్వెరపోయిందన్నారు.

ఈ నేపథ్యంలో సిబిఐకి స్వతంత్ర ప్రతిపత్తి అవసరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని అంబటి ప్రస్తావించారు.  నమ్మకాన్ని వమ్ము చేసేలా సిబిఐ వ్యవహరించిందని కూడా ఆక్షేపించిందన్నారు. సర్వోన్నత న్యాయస్థానమే ఇలా వ్యాఖ్యానించిన తరువాత ఇక సిబిఐ విచారణను నమ్మాల్సిన అవసరం ఉందా? అని అంబటి ప్రశ్నించారు. శ్రీ జగన్‌ మీద సిబిఐ చేస్తున్న దర్యాప్తు కూడా ఏ విధంగా జరుగుతున్నదో ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. సిబిఐ దర్యాప్తు కాకుండా.. శ్రీ జగన్‌ మీద, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మీద దౌర్జన్యం చేస్తోందని అనేకసార్లు తాము విన్నవించామన్నారు. ఈ విషయమై ప్రధాని, రాష్ట్రపతికి కూడా ఉత్తరాలు రాశామన్నారు. కాంగ్రెస్‌ పార్టీని వ్యతిరేకించి శ్రీ జగన్మోహన్‌రెడ్డి బయటికి వచ్చారు కాబట్టి అన్యాయంగా, అక్రమంగా కక్షపూరితంగా కత్తికట్టి పది నెలలుగా జైలులో నిర్బంధించిందని అంబటి నిప్పులు చెరిగారు. శ్రీ జగన్‌ బయటికి వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న కుంటిసాకు చెప్పి ఇంతకాలం నెట్టుకుంటూ వచ్చారని, ఇంకెంతకాలం ఇలా చేస్తారని ప్రశ్నించారు. సిబిఐ దర్యాప్తు మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని అన్నారు.

చట్టం పరిధిలో సిబిఐ వ్యవహరించడంలేదని అంబటి వ్యాఖ్యానించారు. ముక్కలు ముక్కల చార్జీషీట్లను సిబిఐ దాఖలు చేస్తోందా? కాంగ్రెస్‌, టిడిపిలు ఆదేశిస్తే చేస్తున్నారు అనే మాట నిజం కాదా అని ఆయన నిలదీశారు.‌ శ్రీ జగన్‌కు ఎప్పుడు బెయిల్‌ రావాలో కూడా సిబిఐ నిర్దేశిస్తోందని విమర్శించారు. 2014 లోపు శ్రీ జగన్‌ను బయటికి రానివ్వకుండా చేసి కాంగ్రెస్‌, టిడిపిలకు లబ్ధి చేకూర్చేలా చేస్తోందని ఆరోపించారు. సిబిఐ చేస్తున్న ఇలాంటి చట్టవ్యతిరేకమైన, అన్యాయమైన, అధర్మమైన కార్యక్రమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిన సమయం త్వరోలేనే వస్తుందని అంబటి అన్నారు.
నేరస్థులను శిక్షించే విధంగా మాత్రమే సిబిఐ దర్యాప్తు ఉండాలి తప్ప రాజకీయ ప్రత్యర్థులను కక్ష కట్టి శిక్షించడానికి ప్రయత్నిస్తే.. ప్రజలు, న్యాయస్థానాలు కూడా సహించవని సిబిఐ గ్రహించాలని అంబటి హెచ్చరించారు. సోదాలు జరిపించడం, ఆపివేయడం, చార్జిషీట్లు వేయమనడం, ఆపివేయడం, ముక్కలుగా వేయమనడం, టైం తీసుకోమనడం ఇవన్నీ ప్రధాని కార్యాలయమే నిర్దేశించే పరిస్థితుల్లో సిబిఐ దర్యాప్తుపై విశ్వాసం పోతోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి సిబిఐ ‌ఆయుధంలా వ్యవహరించడం సరికాదన్నారు.

తాజా వీడియోలు

Back to Top