కాంగ్రెస్ ప్రభుత్వంతో రోజుకో కొత్త సమస్య

హైదరాబాద్, 25 సెప్టెంబర్‌ 2012: కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతి రోజూ ఓ సరికొత్త ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకొని ఇబ్బందుల పాలు చేస్తున్నదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిప్పులు చెరిగింది. ప్రభుత్వం అనాలోచిన నిర్ణయాల కారణంగా ప్రతిరోజూ పోరాటం చేయాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.  పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్‌ చేసింది. నిరుపేదలు, సామాన్యులపై ఆర్థికంగా మోయలేని భారాన్ని వేస్తూ పెంచిన చార్జీలను రద్దు చేయాలంటూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారంనాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ధర్నాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పెంచిన ఆర్టీసీ చార్జీలు ఉపసంహరించాలంటూ బుధవారం నిర్వహించే ధర్నాల్లో పార్టీ శ్రేణులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పద్మ పిలుపునిచ్చారు.

డీజిల్‌ ధర పెరిగిన నెపంతో రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలు, సామాన్యులపై చార్జీల రూపంలో మోయలేని భారాన్ని వేసిందని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనాలోచిన నిర్ణయాల కారణంగా ప్రజలు ఎంతగా బాధలు పడుతున్నారో అనే విషయాన్ని కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం పరిగణన తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన డీజిల్‌ ధరల కారణంగా ఆర్టీసీపై రూ. 350 కోట్ల భారం పడుతుంటే దాన్ని బూచిగా చూపించి రాష్ట్ర ప్రజలపై రూ.900 కోట్ల భారాన్ని వేసిందని దుయ్యబట్టారు. అర్ధరాత్రి పూట దొంగచాటుగా నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర ప్రజలను ఈ ప్రభుత్వం ఆందోళన పాలు చేస్తున్నదని పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. వంట గ్యాస్‌ సిలిండర్‌పై సబ్సిడీ ఇస్తామన్న హామీ ఇచ్చేందుకే కిరణ్‌కుమార్‌ రెడ్డి వెనకడుగు వేస్తున్నారని ఎద్దేవా చేశారు.

డీజిల్‌ ధరల పెంపు నిర్ణయం కేంద్రానిదే అయినా, పెరిగిన భారాన్ని నిరుపేదలు, సామాన్యులపై పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. ప్రజల గురించి ఆలోచించకుండా, అసలు వారు మోయగలరా లేదా అన్నది పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పెంచేసిన బస్సు చార్జీలను తక్షణమే రద్దు చేయాలని తమ పార్టీ డిమాండ్‌ చేస్తోందని పద్మ తెలిపారు.

విద్యుత్‌ చార్జీల సర్దుబాటు పేరుతో మన రాష్ట్ర ప్రజలపై రూ. 10 వేల కోట్ల భారాన్ని కిరణ్‌ ప్రభుత్వం వేసిందని వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. ప్రభుత్వం చేతగాని విధాన నిర్ణయాల కారణంగా ఇక్కట్లు పడుతున్న ప్రజల గురించి కాంగ్రెస్‌ నాయకులు ఆలోచన చేయడం లేదా అని ఆమె నిలదీశారు. రాష్ట్ర ప్రజలపై ఏ విధంగానూ నయా పైసా భారాన్ని మోపబోమని జననేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీని ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని పద్మ నిప్పులు చెరిగారు. వైయస్‌ హామీలను నిలబెట్టేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదా అని నిలదీశారు.

తాజా వీడియోలు

Back to Top