కాంగ్రెస్‌ ప్రభుత్వంపై చంద్రబాబు పెత్తనం!

హైదరాబాద్, మే 21:

ఇద్దరు మంత్రుల చేత రాజీనామా చేయించడం వెనుక మతలబు ఏమిటో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి బయట పెట్టాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీఈసీ సభ్యురాలు భూమా శోభా నాగిరెడ్డి డిమాండ్‌ చేశారు. దివంగత మహానేత హయాంలో కేబినెట్‌ విడుదల చేసిన ఆ 26 జిఓలు నిబంధనలకు అనుగుణంగా విడుదలయ్యాయా? లేక వ్యతిరేకంగానా అనేది సిఎం కిరణ్‌ వివరణ ఇవ్వాలని ఆమె కోరారు. ధర్మాన ప్రసాదరావు రాజీనామా ఇచ్చిన తరువాత మీడియాతో మాట్లాడుతూ.. జిఓలన్నీ కేబినెట్‌ సమష్టి నిర్ణయంతో విడుదల చేసినట్లు స్పష్టంగా చెప్పారని ఆమె అన్నారు. రెండు లక్షల రూపాయలకు పైబడిన ఏ అంశమైనా కేబినెట్‌ సమష్టి నిర్ణయంతోనే విడుదలవుతాయి కానీ సిఎం స్వతంత్రించి వ్యవహరించడానికి వీలులేదని కూడా ఆయన స్పష్టం చేశారన్నారు.

కాంగ్రెస్‌, టిడిపి కుమ్మక్కు రాజకీయాల్లో భాగంగా మంత్రులను బలి చేశారని శోభా నాగిరెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో కూర్చుని చంద్రబాబు నాయుడు కళంకిత మంత్రులు రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేయడం మొదలుపెట్టిన వెంటనే ఆగమేఘాల మీద కదిలి మంత్రుల చేత రాజీనామా చేయించారన్నారు. చంద్రబాబు డిమాండ్లకు అనుగుణంగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం నడుచుకుంటోందన్నారు. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని మార్చాలని చంద్రబాబు చెబితే ఒక గంటలో అది చేసేలా కాంగ్రెస్‌ పార్టీ దిగజారిపోయిందని దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడి హవా నడుస్తోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మద్దతుతోనే ఈ మైనార్టీ కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగుతోందని ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో శోభా నాగిరెడ్డి మాట్లాడారు.

ధర్మాన ప్రసాదరావు మీద సిబిఐ ఆరు నెలల క్రితం చార్జిషీట్‌ వేసిందని, నాలుగు నెలల క్రితం తన పదవికి ఆయన రాజీనామా చేశారని శోభా నాగిరెడ్డి తెలిపారు. అప్పటి నుంచీ ఆయన సచివాలయానికి రావడం లేదన్నారు. ఆ రోజున ఆ జిఓలు కేబినెట్‌ సమష్టి నిర్ణయాలని చెప్పి ఆయన రాజీనామాను ఆమోదించలేదని, ఇప్పుడు హడావుడిగా ఎందుకు రాజీనామా చేయించారో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద, సిఎం కిరణ్‌రెడ్డి పైన ఉందన్నారు. చంద్రబాబు దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం పాము తన పిల్లలను తానే తినే చందంగా సొంత పార్టీ వారినే బలిపెడుతోందన్నారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిపై కక్ష సాధించేందుకు సొంత పార్టీలోని మంత్రులను కూడా కాంగ్రెస్‌ పార్టీ బలిచేయడానికి వెనుకాడడం లేదన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోట్లాది రూపాయల విలువైన 850 ఎకరాలను ఐఎంజికి లక్షలకే కట్టబెట్టేసిన చంద్రబాబు తీరును శోభా నాగిరెడ్డి ప్రస్తావించారు. ఆపద్ధర్మ సిఎంగా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం లేకపోయినా చంద్రబాబు కోట్లాది రూపాయల విలువైన భూములను ఎలా అప్పనంగా కట్టబెట్టారని నిలదీశారు. లక్ష రూపాయలు కూడా ఆదాయపు పన్ను కట్టలేని ఐఎంజి దరఖాస్తు చేసిన మరుసటి రోజే కేబినెట్‌ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకున్న వైనాన్ని వేలెత్తి చూపారు.

స్వలాభం కోసం చిత్తూరు డెయిరీని మూయించిన ఘనుడు చంద్రబాబు అన్నారు. తాను చేసిన తప్పిదాలు, అక్రమాలపై విచారణకు సిద్ధం కాకపోతే ప్రజలు ఈసారి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఇవ్వబోరని ఆమె హెచ్చరించారు. పలు అక్రమాలకు పాల్పడిన చంద్రబాబు నాయుడు తనను తాను అన్నా హజారేతో పోల్చుకోవడం హాస్యాస్పదం అన్నారు.

లక్ష కోట్ల అవినీతి జరిగిందని చంద్రబాబు అంటే.. సిబిఐ నుంచి ఈడీ వరకూ అదే మాట చెప్పడాన్ని శోభా నాగిరెడ్డి తప్పుపట్టారు. శ్రీ జగన్‌ బెయిల్‌ విచారణకు వస్తుంటే ఈడీ  కేసు పెట్టాలని చంద్రబాబు చెబితే కేసు పెడతారన్నారు. ఆస్తులు అటాచ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తే వెంటనే అదీ చేస్తారని ఆరోపించారు. మంత్రులు రాజీనామాలు చేయాలంటే రాజీనామాలు చేయిస్తున్నారని ఆరోపించారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో సమర్ధులైన నాయకులు లేరంటూ టిడిపి నాయకుడు పయ్యావుల కేశవ్‌ చేసిన వ్యాఖ్యలను శోభా నాగిరెడ్డి తిప్పికొట్టారు. సమర్ధుడైన చంద్రబాబు నాయుడు ఒక వైపున పాదయాత్ర చేస్తుంటే మరో పక్కన అనేక మంది టిడిపి ఎమ్మెల్యేలు ఎందుకు బయటికి వచ్చి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరారని ప్రశ్నించారు. వాస్తవాలు మాట్లాడాలి కాని అబద్ధాలు ప్రచారం చేయవద్దని టిడిపి నాయకులకు శోభా నాగిరెడ్డి హితవు చెప్పారు.

అసమర్ధ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఎవరు అవిశ్వాసం పెట్టినా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మద్దతు ఇస్తుందని, లేదా తమ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వమని తాము ముందే చెప్పామని ఒక విలేకరి ప్రశ్నకు శోభా నాగిరెడ్డి సమాధానం చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని కత్తులు, గొడ్డళ్ళతో నరికేయండి అని పిలుపునిచ్చిన చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం సమయంలో అసెంబ్లీకి ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Back to Top