ఇష్టానుసారం కరెంటు చార్జీల భారం

హైదరాబాద్

3 నవంబర్ 2012 : మూడేళ్ల నుండి రాష్ట్రప్రభుత్వం ప్రజల మీద ఇష్టానుసారం సర్దుబాటు చార్జీల పేరుతో విద్యుత్‌ చార్జీల భారం మోపుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. 2012-13 తొలి త్రైమాసికానికే రూ.1740.20 కోట్ల మేరకు సర్దుబాటు భారం వేయడాన్ని తీవ్రంగా నిరసించింది. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఈ పెంపును వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. రెగ్యులేటరీ కమిషన్‌కు కోరలు లేకపోవడం మాట అటుంచి కనీసం చిగుళ్లు కూడా లేని దౌర్భాగ్య పరిస్థితి ఉందని అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. శనివారం వైయస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ప్రతి మూడు నెలలకొకసారి కిరణ్ ప్రభుత్వం విద్యుత్తు సర్దుబాటు పేరుతో విద్యుత్తు చార్జీలు వడ్డిస్తోందని విమర్శించారు. ప్రజలు గంగలో పోయినా సరే ఖజానా నిండితే చాలునని ప్రభుత్వం జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.
గతంలో రాజశేఖర్ రెడ్డిగారున్నప్పుడు ఆరేళ్లలో ఒక్క రూపాయి కూడా కరెంటు చార్జీలు పెంచలేదు. మరో ఐదేళ్లూ పెంచబోమని చెప్పారు. కానీ రోశయ్య వచ్చాక వెయ్యి కోట్లు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రతి మూడునెలల కొకసారి సర్దుబాటు‌ చార్జీలు పెంచారు. అంతే కాదు. బేసిక్ ప్రైస్‌లోనూ రూ. 4500 కోట్లు పెంచారు. 2008-09లో రూ.1649 కోట్లు సర్గుబాటు చార్జీలు పెంచారు. 2009-10లో రూ. 1481 కోట్లు సర్దుబాటు చార్జీల పేరుతో పెంచారు. అదృష్టవశాత్తు హై కోర్టు స్టే ఇవ్వడం వల్ల పాత చార్జీలు మన మీద పడలేదు. కానీ 2010-11కి రూ. 3957 కోట్లు, 2011-12 కి రూ.2068, 2012-13 మొదటి మూడునెలలకే రూ. 1740 కోట్లు భారం వేశారంటే ఇది బాధ్యత కలిగిన ప్రభుత్వమేనా?" అని జనక్ ప్రసాద్ ప్రశ్నించారు.
అద్దెకి ఉండేవాళ్లకి ఈ సర్దుబాటు చార్జీల వడ్డింపు పెద్ద ఇబ్బందిగా పరిణమించిందని ఆయన అన్నారు. వైయస్ఆర్ సీపీ తరఫున విద్యుత్ నియంత్రణ కమిషన్‌ను కలిసి ప్రభుత్వం చెప్పినట్లు డూడూ బసవన్నలా తలూపకుండా స్వతంత్ర నిర్ణయం తీసుకోవాలంటూ కోరామని ఆయన చెప్పారు. అయితే సదరు కమిషన్ కోరలు కాదు కదా, కనీసం చిగుళ్లు కూడా లేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉందని ఆయన ఎద్దేవా చేశారు. మహానేత రాజశేఖర్ రెడ్డి ఖజానాని పక్కన బెట్టి హృదయంతో ఆలోచించేవారని ఆయన గుర్తు చేశారు.ప్రభుత్వం ఇలా అన్యాయంగా చార్జీలు వడ్డిస్తున్నా ప్రధానప్రతిపక్షనాయకుడికి అవిశ్వాస తీర్మానం పెట్టాలనిపించడం లేదని ఆయన విమర్శించారు. లేదా జవాబుదారీ లేని ఈ ప్రభుత్వంపై తమకు పూర్తి 'విశ్వాసం' ఉందనైనా బహిరంగంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

'అవిశ్వాసం' పెట్టవేం?
"అయ్యా, చంద్రబాబునాయుడూ, ఇప్పటికైనా నీకు ఆలోచన రాలేదా? ఈ ప్రభుత్వం చేతగాని, దద్దమ్మ ప్రభుత్వమంటున్నావు, కానీ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదు. అవిశ్వాస తీర్మానం పెట్టకుండా మాటలు చెపితే ప్రజలు నమ్మరు. నీకు విశ్వసనీయత లేదు. అదే జగన్మోహన్ రెడ్డి ఏ మాట చెపితే ఆ మాట నిలుపుకునే నాయకుడని జనం నమ్ముతున్నారు" అని జనక్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఏవో రెండు మూడు చానెళ్లు, పత్రికలను అడ్డం పెట్టుకుని ఎన్నాళ్లు గడుపుతారని ఆయన ప్రశ్నించారు. 2004లో ఆ పత్రికలు వ్యతిరేకించినా కూడా వైయస్ విజయం సాధించారని ఆయన గుర్తు చేశారు. 2009లో గ్రాండ్ అలయెన్స్ పెట్టుకున్నా గెలవలేదని ఆయన అన్నారు. దీనిని బట్టే మీ విశ్వసనీయత వెల్లడి అవుతోందని ఆయన వ్యాఖ్యానిం చారు. రాష్ట్రంలో కరెంటు లేక 1.6 లక్షల పరిశ్రమలు మూతబడ్డాయనీ, లక్షలాది మంది కార్మికులు వీధిన పడ్డారనీ, వ్యవసాయం కూడా దెబ్బతిన్నదనీ అయినప్పటికీ గ్యాస్ కేటాయింపులలో కిరణ్ ప్రభుత్వం పెద్ద మోసానికి పాల్పడిందని జనక్ ప్రసాద్ ఆరోపించారు. లగడపాటి రాజగోపాల్‌ ల్యాంకో కంపెనీకి ఉన్న మర్చంట్ పవర్ ప్లాంట్, ఆర్డినరీ పవర్ ప్లాంట్‌లలో మర్చంట్ పవర్ ప్లాంట్‌కు కేంద్రం ద్వారా గ్యాస్ కేటాయింపులు చేశారని ఆయన విమర్శించారు. దీని వల్ల యూనిట్‌కు రూ. 5.40 చెల్లించవలసి వస్తోందన్నారు. అదే ఆర్డినరీ పవర్ ప్లాంటుకు గ్యాస్ కేటాయించివుంటే యూనిట్‌కు రూ.2.80 కే విద్యుత్తు లభించేదని ఆయన అన్నారు. అదే జరిగివుంటే ఇప్పుడు సర్దుబాటు చార్జీలు పెంచవలసిన అగత్యమే ఉండేది కాదని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర విద్యుత్తు శాఖ జాయింట్ సెక్రటరీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంధన సరఫరా ఒప్పందాలపై లేఖ రాసిప్పుడు కూడా అబద్ధాలు చెప్పి, మోసానికి పాల్పడ్డారని జనక్ ప్రసాద్ విమర్శించారు. జెన్‌ కోకు రూ.6800 కోట్లు బకాయి పడితే ప్రభుత్వం చెల్లించడం లేదని, కోల్ పర్చేజ్ పాలసీ కూడా లోపభూయిష్ఠంగా ఉందని ఆయన ఆక్షేపించారు. రూ. 3500 లకే టన్ను బొగ్గును సరఫరా చేయడానికి ఎన్నోసంస్థలు సిద్ధంగా ఉన్నా కూడా రూ. 5400 లు చెల్లించి కొనుగోలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. గ్లోబల్ టెండర్లు పిలిస్తే పరిస్థితి మారుతుందని ఆయన అన్నారు. విద్యుత్తు ఉత్పత్తి చేసే సంస్థలు ఏ రోజూ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ముందుకు వచ్చిన పాపాన పోలేదని ఆయన విమర్శించారు. కానీ కేవలం విద్యుత్తును అమ్ముకుని సొమ్ము చేసుకునే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తమకు నిర్వహణ వ్యయం పెరిగిపోయిందంటున్నాయనీ, ఇలా కేవలం డిస్కమ్‌లు చెప్పిన మాటలు విని సర్దుబాటు చార్జీలు పెంచడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ డిస్కమ్‌లు కేవలం ఏజంట్లు మాత్రమేనని ఆయన అన్నారు.చిత్తశుద్ధితో రెగ్యులేటరీ కమిషన్ ముందు వివిధ వర్గాలు చెప్పిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సర్దుబాటు చార్జీలను పెంచడం మానుకోవాలని జనక్ ప్రసాద్ డిమాండ్ చేశారు.
తుపాను వానలకు రాష్ట్రంలో రెండులక్షల ఎకరాలలో పంటలు నాశనమైతే ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన నిరసించారు. జగనన్న నాయకత్వంలో ప్రజావిశ్వాసం పొందిన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ప్రజల కష్టాలు తీరతాయని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలూ ఇబ్బంది పడుతున్న ఈ ప్రభుత్వానికి గాని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి గాని చీమ కుట్టినట్లైనా లేదని ఆయన దుయ్యబట్టారు. ప్రస్తుతం ఉప ఎన్నికలు నిర్వహించవలసిన 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిపితే ప్రజాపక్షం ఎవరిదో మరోసారి తేలిపోతుందని జనక్ ప్రసాద్ అన్నారు.

Back to Top