హైదరాబాద్, 11 అక్టోబర్ 2012: మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి నిర్వహించిన పాదయాత్రను తలపించేలా ఆయన కుమార్తె, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల 'మరో ప్రజా ప్రస్థానం' పేరిట పాదయాత్ర చేయనున్నారు. కడపజిల్లాలోని ఇడుపులపాయ నుంచి ఈ నెల 18న ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకూ కొనసాగుతుంది. మొత్తం 3 వేల కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగుతుందని పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రకటించారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని తమ నివాసంలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. మరో ప్రజాప్రస్థానానికి సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నాటి సువర్ణయుగం త్వరలోనే వస్తుందని, ఆయన మాదిరిగానే ప్రజలకు భరోసా కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ఈ పాదయాత్ర చేపడుతున్నట్టు విజయమ్మ స్పష్టం చేశారు. పాదయాత్ర చేసేందుకు రాజశేఖరరెడ్డి కూతురుగా, జగన్మోహన్‌రెడ్డి చెల్లెలుగా షర్మిల ముందుకు వచ్చినట్లు ఆమె వివరించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా షర్మిల నల్లబ్యాడ్జీ ధరించి పాదయాత్ర చేస్తారని చెప్పారు. విద్యుత్, సాగునీరు, నిత్యావసర వస్తువుల ధరలు తదితర అంశాలపై మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రతి రోజూ ఉదయాన్నే సమీక్షించేవారని విజయమ్మ తెలిపారు.
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఎందుకు నిర్వహిస్తున్నదో విజయమ్మ వివరించారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు బాసటగా నిలవాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి, పార్టీ నాయకుల అభిప్రాయం మేరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని విజయమ్మ తెలిపారు. ప్రభుత్వం తీరు కారణంగా రాష్ట్రంలోని ఏ వర్గం ప్రజలూ సంతోషంగా లేరని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం, రైతన్నల సమస్యలపైన, విద్యుత్ సరఫరా లేక మూతపడుతున్న పరిశ్రమల యజమానుల కష్టాల గురించి, పరిశ్రమలు మూతపడి ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్న లక్షలాది కార్మికుల్లో ధైర్యాన్ని నింపేందుకు పాదయాత్ర చేపడుతున్నట్లు వివరించారు. ఇల్లు, పెన్షన్, విద్యుత్, సాగునీటి సౌకర్యం ఇలా దేన్నీ ఈ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేకుండా చేసిందని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఖజానా ఎలా నింపుకోవాలా అనే కిరణ్ ప్రభుత్వం దృష్టిపెడుతోందని దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిందని, ఆపదలో ఉండి 108కు ఫోన్ చేస్తే సిబ్బంది డీజిల్ లేదని చెబుతున్నారని, 104 సేవలు కొండెక్కిపోయాయని ఆమె నిప్పులు చెరిగారు.
మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన వడ్డీ లేని రుణాలు అందజేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేకుండాపోందని విజయమ్మ విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా లేక రాష్ట్రంలోని వందలాది పరిశ్రమలు మూతపడుతున్నాయని, ఆ కారణంగా పరిశ్రమల్లో పనిచేసే లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని విజయమ్మ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఇబ్బందులు పడుతున్న ప్రజలు తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయంలో పడిపోయారన్నారు.
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై జగన్మోహన్‌రెడ్డిని అక్రమంగా జైలులో పెట్టినందున షర్మిల పాదయాత్ర చేయడానికి ముందుకు వచ్చారని ఆమె అన్నారు. ప్రజల పక్షంగా పనిచేసే తమ పార్టీ ప్రజల్లోకి వెళ్ళి వారి కష్ట నష్టాలను తెలుసుకోవడం తమ బాధ్యతగా భావించామన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజల మధ్య ఉండాలని జగన్ చెప్పారని, బెయిల్‌పై విడుదలయ్యాక ఆయన పాదయాత్రను కొనసాగిస్తారని చెప్పారు. అప్పటి వరకు షర్మిల పాదయాత్రను నిర్వహిస్తారన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో విశ్వసనీయత ఉందని చెప్పారు. తెలంగాణ జిల్లాల్లో కూడా మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
నిజానికి బెయిల్ వస్తే ఈ పాదయాత్రను జగన్ బాబు చేయాలనుకున్నారని, దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా సిద్ధమైందని విజయమ్మ పేర్కొన్నారు. కాని, ఆయనను అక్రమంగా జైలులో పెట్టిన కారణంగా ప్రజల మధ్యకు వచ్చే వీలు లేకపోతున్నదని అన్నారు. అందుకే పార్టీ నిరంతరం ప్రజల మధ్యే ఉండాలన్న జగన్ బాబు నిర్ణయం మేరకు ఈ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. పాదయాత్రను తానే చేయాలని అనుకున్నామని, అయితే, తనకు ఆర్థరైటిస్ సమస్య ఉన్నందున పార్టీ నాయకులు, జగన్‌బాబు వారించారని చెప్పారు. ఈ రోజు ఉదయం జైలుకు వెళ్ళి జగన్‌తో దీనిపై చర్చించామనీ, తన తరఫున పాదయాత్ర చేయాలని ఆయన కోరారని వివరించారు. ఆ సమయంలో షర్మిల అక్కడే ఉన్నారనీ, తాను పాదయాత్ర చేస్తాననీ ముందుకొచ్చారనీ, జగన్ అందుకు అంగీకరించారనీ విజయమ్మ తెలిపారు. ఈ పాదయాత్ర మధ్య మధ్యలో తాను, జగన్మోహన్‌రెడ్డి సతీమణి భారతి కూడా కలుస్తామని పేర్కొన్నారు. ఈ లోగా జగన్ బయటికి వస్తారని, పాదయాత్రను ఆయన కొనసాగిస్తారని చెప్పారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం జగన్ బాబు హైదరాబాద్‌లో, ఒంగోలులో దీక్షలు చేశారని, తాను కూడా ఏలూరు, హైదరాబాద్‌లో ఫీజు దీక్ష చేసిన విషయాన్ని విజయమ్మ గుర్తు చేశారు. అయితే, ఎన్ని ఆందోళనలు చేసినా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అన్నారు. రైతులకు రెండు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయలేని దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాల ఊసే లేదని, ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, 104 సర్వీస్ ఉద్యోగాలు కల్పించలేకపోయిందని మీడియా సమావేశంలో వెల్లడించారు. వైయస్ హయాంలో ఒక్క రూపాయి కూడా ధర పెంచకుండా నిరంతరం 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా అని సాధారణ ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, పన్నులు, సర్ ఛార్జీల పేరుతో ప్రజలను ప్రభుత్వం ఇబ్బందుల్లోకి తోసిందని విజయమ్మ అన్నారు. వైయస్ పథకాలను కొనసాగించాలని అంటూనే కాంగ్రెస్ నాయకులు మహానేతపై ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజశేఖరరెడ్డి పాదయాత్ర, జగన్‌బాబు ఓదార్పుయాత్రను అనుకరించడం తప్ప చంద్రబాబు పాదయాత్రతో ఒరిగేదేమీ లేదని ఆమె అన్నారు. తమ పార్టీ చిన్నపార్టీ అని, ప్రభుత్వాన్ని ఎదురించే శక్తి తమకు లేదని, అందుకే ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం ఉన్నా ఏమీ చేయలేకపోతున్నామని, ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వంతో కుమ్మక్కైందన్నారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ స్పందించడంలేదని విజయమ్మ విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వంపై ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టడంలేదని సూటిగా ప్రశ్నించారు. జగన్‌బాబు సుప్రీంకోర్టులో బెయిల్ వస్తుందనుకుంటున్న తరుణంలో అంతకు ఒక రోజు ముందే టిడిపి ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, ప్రధానిని కలిసి లేఖ ఇచ్చారని, వారు చిదంబరాన్ని కలవగానే విచారణ లేకుండానే ఈడీ నోటీసులు జారీ చేసిందన్నారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్‌తో కుమ్మక్కైందనడానికి ఇంతకంటే రుజువు అక్కర్లేదన్నారు.
ప్రజా సమస్యలు తెలుసుకోవడానికంటూ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పుడు పాదయాత్ర ప్రారంభించారనీ, కానీ ప్రజా సమస్యలను తాము ఎప్పుడో తెలుసుకున్నామనీ విజయమ్మ తెలిపారు. రకరకాల సమస్యలతో కునారిల్లిపోతున్న ప్రజానీకానికి భరోసా కల్పించదలిచామన్నారు. జగన్‌ను జైలుకు పంపించినప్పటి నుంచి అన్ని విషయాల్లోనూ కాంగ్రెస్, టిడిపి కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. తొమ్మిదేళ్ళ పరిపాలనలో చంద్రబాబు ఏ ఒక్క పథకాన్నైనా అమలు చేశారా అని విజయమ్మ నిలదీశారు. ఎంతసేపూ మహానేత వైయస్‌ను, జననేత జగన్‌ను తిట్టడానికే చంద్రబాబు తన సమయాన్ని కేటాయించారని దుయ్యబట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా అనేక ఇబ్బందులు పడుతుంటే వ్యక్తిగతంలో ఏ కొందరి కోసమో ఓదార్పు యాత్రను కొనసాగించడం కంటే అందరికీ భరోసా ఇచ్చి, ధైర్యాన్ని నింపాలని ఇప్పుడు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేయాలని పార్టీ నిర్ణయించినట్లు విజయమ్మ చెప్పారు. అయితే, ఓదార్పు యాత్ర రద్దు కాదని, దానిని జగన్మోహన్‌రెడ్డి కొనసాగిస్తారని మీడియా ప్రతినిధి ప్రశ్నకు విజయమ్మ బదులిచ్చారు. ఒక వైపున చంద్రబాబు పాదయాత్ర చేస్తుండగా మీ పార్టీ తరఫున పాదయాత్ర ఎందుకు చేయాలనుకున్నారని మరో విలేకరి ప్రశ్నకు ఆమె బదులిస్తూ, తమకు విశ్వసనీయత ఉందని, ప్రజాసమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి ఉందని, మహానేత వైయస్ వారసులుగా ఆయన స్ఫూర్తితో ముందుకు వెళతామని చెప్పారు. వైయస్ రక్తాన్ని ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారని అన్నారు.

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం అనంతరం నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో విజయమ్మతో పాటు పార్టీ నాయకులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కొణతాల రామకృష్ణ, బాజిరెడ్డి గోవర్దన్, వై.వి. సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, జి. గురునాథరెడ్డి, అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, కొల్లి నిర్మల కుమారి పాల్గొన్నారు.