చంద్రబాబు స్పష్టత లేని లెక్చర్లు!

హైదరాబాద్, 11 డిసెంబర్ 2013:

రాజ్యాంగంలోని ఆర్టికల్-3 సవరణ కోసం వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి చేస్తున్న పోరాటం సఫలీకృతమైందని పార్టీ ‌రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ అన్నారు. పార్లమెంట్లో అన్ని జాతీయ పార్టీలు ఇదే అంశాన్ని పరిశీలిస్తున్నాయని ఆయన బుధవార‌ం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పేర్ని నానితో కలిసి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పట్ల కేంద్ర‌ ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గమైన చర్యలపై జాతీయ స్థాయిలో చర్చ జరిగే పరిస్థితులు తీసుకురావడంలో శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సఫలీకృతులయ్యారని కొణతాల చెప్పారు. శ్రీ జగన్ కృషి వల్లే నేడు మెజారిటీ పార్టీలు విభజనను వ్యతిరేకిస్తున్నాయన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల మద్దతును శ్రీ జగన్ కూడగట్టగలిగారని తెలిపారు. విభజనపై స్పష్టత లేని చంద్రబాబు నాయుడు రోజుకో లెక్చర్ ఇస్తున్నారని కొణతాల ఎద్దేవా చేశారు. బాబు ప్రె‌స్ మీట్లకే పరిమితం అయ్యారు కానీ, విభజన ప్రక్రియను ఆపే ప్రయత్నం చేయటం లేదని ఆయన విమర్శించారు.

విభజన డ్రాఫ్టు బిల్లు మీద అసలు ఓటింగ్‌ జరిగితేనే కదా సీఎం కిరణ్‌ అయినా, మరెవ్వరైనా ఓడించేది అన్నారు. అసెంబ్లీలో విభజన బిల్లును ఓడిస్తామంటూ కిరణ్‌ చెబుతున్న మాటలపై కొణతాల పై విధంగా స్పందించారు. జరగని కబుర్లు చెప్పేకంటే.. సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు. అప్పుడైనా అన్ని ప్రాంతాల ప్రజలకూ కొంతయినా మేలు జరుగుతుందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచీ డిమాండ్‌ చేస్తున్నదన్నారు. పార్టీలకు అతీతంగా సమైక్యాంధ్ర కోసం అందరం రాజీనామాలు చేసి ఉద్యమిస్తే... మీ నాయకత్వంలో పోరాటం చేసేందుకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని చంద్రబాబుకు, సీఎం కిరణ్‌కు చెప్పినా స్పందన లేదని కొణతాల విమర్శించారు.

విభజనకు సహకరిస్తున్న అజ్ఞాతపుత్రుడు, సీఎం :
సోనియా గాంధీకి అజ్ఞాత పుత్రుడుగా మారిన చంద్రబాబు రాష్ట్ర విభజనకు అన్నిరకాలుగా సహకరిస్తున్నారని కొణతాల దుయ్యబట్టారు. రోజూ ప్రెస్‌మీట్ పెట్టి ‘రెండు‌ కోతులు- పిల్లి పంచాయితీ’ ‘కొబ్బరిచిప్పలు’ ‘ఇద్దరు కొడుకులు’ అంటూ ఏవేవో మాట్లాడుతున్న చంద్రబాబు 75 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్లు విభజనను ఆపమని ఒక్క మాటచెప్పట్లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని విభజించాలంటూ కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసిన బాబు సమైక్యంగా ఉంచమని ఒక్క లేఖ కూడా రాయట్లేదన్నారు. విభజనను త్వరితగతిన పూర్తిచేయడం కోసం కాంగ్రెస్‌కు అడుగడుగు నా సహకరిస్తున్నారన్నారు.

మరోవైపు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వారానికి ఒక ప్రెస్‌మీట్ పెట్టి దొంగ ఏడుపులు తప్పితే విభజనను అడ్డుకోవడానికి చేసిందేంటని ప్రశ్నించారు. ఇప్పటికీ అసెంబ్లీలో ఓటింగ్ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. విభజనకు దోహదపడి తర్వాత కొత్త పార్టీ‌ పెడితే చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమని కిరణ్‌ను హెచ్చరించారు. రాష్ట్ర విభజనకు సహకరిస్తూనే రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటే.. ప్రజల ముందు ద్రోహులుగా మిగలాల్సి ఉంటుందని కాంగ్రెస్‌ నాయకులను కొణతాల హెచ్చరించారు. ఇప్పటికైనా అందరూ కలిసి వస్తే రాజకీయ సంక్షోభాన్ని సృష్టించవచ్చని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అ‌ధ్యక్షురాలు సోనియా
గాంధీకి కిరణ్ దాసోహమై రాష్ట్రంలో సమైక్య నాటకాలు ఆడుతున్నారని కొణతాల
వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న
రోజునే కిరణ్‌ తన పదవికి రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది
కాదన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్‌ ఇవ్వాలని 2011లో
ప్రతిపాదన వస్తే.. దానిని అడ్డుకున్నది సీఎం కిరణ్‌ కాదా అనేది ప్రజలకు
సమాధానం చెప్పాలన్నారు.

సమాఖ్య వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే విభజన ప్రక్రియను నిలుపుదల చేయాల్సిన ఆవశ్యకతను శ్రీ‌ వైయస్ జగన్ అన్ని పార్టీలకు వివరించారని చెప్పారు. భవిష్యత్తులోనూ కేంద్రంలో అధికారంలోకి వచ్చే వారు రాష్ట్రాలను విభజిస్తూ, రాష్ట్ర నాయకత్వాలను బలహీనపరుస్తారని, తద్వారా దేశం అభద్రతలోకి వెళ్లే ప్రమాదముందని తెలియజేశారన్నా రు. ఆర్టికల్-3ను సవరించి పార్లమెంటు, అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీ ఉంటే విభజన ప్రక్రియ చేసేలా రాజ్యాంగ సవరణ చేయాలని, దీనిపై అన్ని పార్టీ‌లనూ సమాయత్తపరిచి ఒక జాతీయ అంశంగా ప్రాధాన్యం సంతరించుకునేలా చేయడంలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి విజయవంతం అయ్యారని కొణతాల తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top