చంద్రబాబు ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేరాలి

హైదరాబాద్ :

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఫోబియా పట్టుకుందని, అందుకే ఆయనపై అర్థం పర్థంలేని విమర్శలు చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ సీజీసీ సభ్యుడు, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు ఆరోపించారు. ప్రజల అభీష్టానికి అనుగుణంగా సమైక్యం కోసం ముందుకు రావాలని తమ నాయకుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అన్ని రాజకీయ పార్టీలకు పిలుపు ఇస్తే... చంద్రబాబు దాన్ని సరిగా అర్థం చేసుకోకుండా తన బాధ్యతను మరిచిపోయి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు మతిపోయి పిచ్చి పడితే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేరాలని సూచించారు. అంతే కానీ శ్రీ జగన్‌పై అనవసర విమర్శలు చేయరాదని హితవు పలికారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో జూపూడి మాట్లాడారు.

మెజారిటీ ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే... సీమాంధ్రలో రాజధాని నిర్మాణం కోసం నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పిన చంద్రబాబు కాంట్రాక్టర్లను పెంచిపోషించే వ్యక్తిగా వ్యవహరించారని జూపూడి ధ్వజమెత్తారు. ప్రజల పట్ల తనకు ఉన్న బాధ్యతను గుర్తెరిగిన వ్యక్తిగా శ్రీ జగన్ జైల్లో ఉండి కూడా సమైక్యం కోసం ఏడు రోజులు నిరాహార‌ దీక్ష చేశారని, బయటకు వచ్చాక కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు నిజాయితీగా కృషి చేస్తున్నారని వివరించారు.

ఈ నెల 16 నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న ఇతర పార్టీల మద్దతు కూడా కూడగట్టేందుకు శ్రీ జగన్మోహన్‌రెడ్డి పర్యటన చేయనున్నారని చెప్పారు. చంద్రబాబు రాజకీయ నాయకుడి రూపంలో ఉన్న నేరస్తుడని జూపూడి నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడుకు ప్రజలు రాజకీయంగా యావజ్జీవ శిక్ష విధించారని ఆయన వ్యాఖ్యానించారు. రెండుసార్లు ప్రజలు తిరస్కరించినా తనకు మళ్లీ అధికారం కావాలని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు ఆయనను అధికారానికి దూరంగా ఉంచడం వల్ల ఆయన రాజకీయంగా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నిజస్వరూపం దేశం మొత్తానికీ తెలిసిపోయిందని, అందుకే ఆయన దీక్షను ఢిల్లీలో ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. సమైక్యాంధ్ర గురించి మాట్లాడే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. ఇంత మంది ప్రజలు వ్యతిరేకిస్తున్న విభజన నిర్ణయాన్ని చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించరు? అని జూపూడి ప్రశ్నించారు.

‌శ్రీ జగన్ వల్లనే రాష్ట్ర విభజన జరిగిందని లోక్‌సత్తా అధినేత జయప్రకా‌శ్ నారాయ‌ణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మేధావిగా అందరికీ నీతులు చెప్పే జేపీ, చంద్రబాబు ఏది చెబితే దానికి తబలా వాయిస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలను జేపీ ఎందుకు ప్రశ్నించడంలేద‌ని అడిగారు. రాష్ట్ర విభజనపై నిజాయతీ ఉంటే చంద్రబాబు, జేపీలు అసెంబ్లీని సమావేశపరచమని ఎందుకు అడగరన్నారు.

Back to Top