అబద్ధాల టిడిపికి గుణపాఠం తథ్యం

హైదరాబాద్, 24 ఏప్రిల్‌ 2013: చెప్పిన అబద్ధాన్నే పదే పదే చెబుతూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్న టిడిపికి గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హెచ్చరించింది. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడవద్దని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవద్దని హితవు పలికింది. అవాస్తవాలు చెప్పడం టిడిపి నిలిపివేయాలని డిమాండ్‌ చేసింది. తాను చెప్పే అబద్ధాలను ప్రజలు వినకపోయినా తన ధోరణి తనదే అన్నట్లుగానే అది ప్రవర్తిస్తుందా? అని ప్రశ్నించింది. మహానేత వైయస్‌ కుటుంబంపై గోబెల్సు ప్రచారం మానుకోవాలని విజ్ఙప్తి చేసింది. టిడిపిని ఇప్పటికే ప్రజలు పక్కన పెట్టేశారని వ్యాఖ్యానించింది. రక్షణ స్టీల్సుతో తనకు గాని, తన భర్త బ్రదర్‌ అనిల్‌కు గాని సంబంధం ఉందని నిరూపించాలని శ్రీమతి షర్మిల చేసిన సవాల్‌కు సమాధానం చెప్పలేక టిడిపి పారిపోతోందని దుయ్యబట్టింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు బుధవారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టిడిపి తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు.

రక్షణ స్టీల్సు కార్యాలయం, బ్రదర్‌ అనిల్‌కుమార్‌ చెందిన మిరకిల్‌ ఫార్ములేషన్సు సంస్థ సోమాజిగూడలోని ఆదిత్య ఎలైట్‌ భవనంలో 202, 203 ఫ్లాట్లలో ఉండేవని జూపూడి తెలిపారు. ఆ రెండూ ఒకే చిరునామాలో ఉన్నాయి గనుక రక్షణ స్టీల్సు బ్రదర్‌ అనిల్‌ కుమార్‌దే అంటూ టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మంగళవారం ఆరోపణలు చేయడాన్ని జూపూడి తప్పుపట్టారు. మిరకిల్ ‌సంస్థ అసలు చిరునామాకు సంబంధించిన పత్రాలను మీడియాకు విడుదల చేసి, పరిశీలించుకోమని జూపూడి సవాల్ విసిరారు. రవ్వంత రేవంత్‌రెడ్డి పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండా, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడడం తగదని ఆయన హితవు పలికారు.‌ మహానేత వైయస్‌ మరణించిన తరువాత మిరకిల్‌ సంస్థను ఐడిఎ మల్లాపూర్‌కు మార్చిన విషయం చంద్రబాబుకు తెలుసని, ఆ విషయాన్ని రేవంత్‌కు చెప్పకుండా బకరాను చేశారని ఆయన వ్యాఖ్యానించారు. రక్షణ స్టీల్సు, ఎపిఎండిసి మధ్య ఒప్పందాన్ని పూర్తిగా చూడాలన్నారు. ఒప్పందం పూర్తిగా చదివే ఓపిక కూడా టిడిపి నాయకులకు లేదని ఆయన దుయ్యబట్టారు.

శ్రీమతి షర్మిల చేసిన సవాల్‌కు నిలబడలేని టిడిపి నాయకులు పిరికిపందల్లా పారిపోవడానికే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని జూపూడి నిప్పులు చెరిగారు. చంద్రబాబు అసలు నాయకుడే కాదంటూ అనేక మంది టిడిపి ఎమ్మెల్యేలు గుడ్‌బై చెప్పి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరుతుండడంతో తట్టుకోలేకే గోబెల్సు ప్రచారం చేస్తున్నదని జూపూడి దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్న శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని అన్యాయంగా జైలులో నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీమతి షర్మిల పాదయాత్రను అడ్డుకోవాలన్న దుగ్ధతోనే ఆమె భర్తపైన దుర్మార్గమైన అబద్ధాలను టిడిపి ప్రచారం చేస్తున్నదని విమర్శించారు.

బయ్యారం గనుల వ్యవహారంపై టిడిపి చేసిన అసత్య ప్రచారం కారణంగానే తెలంగాణలో ఫ్యాక్టరీ ఏర్పాటు నిలిచిపోయిందని జూపూడి ప్రభాకరరావు ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తులు దొంగతనంగా తవ్వుకుపోతుంటే దాన్ని నిలువరించేందుకే మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కృషి చేశారన్నారు. దానిలో భాగంగానే బయ్యారం గనుల వ్యవహారాన్ని ప్రభుత్వ సంస్థ ఎపిఎండిసికి అప్పగించారన్నారు. బయ్యారంలో వచ్చే ఉక్కు ఖనిజాన్ని విక్రయించేందుకు ఎపిఎండిసి గ్లోబల్‌ టెండర్లు పిలిచిందన్నారు. బయ్యారం గనులపై ఎపిఎండిసి పిలిచిన గ్లోబల్ టెండర్లలో రక్షణ స్టీ‌ల్సు సహా ఇద్దరు మాత్రమే పాల్గొన్నారని జూపూడి తెలిపారు. ఆ గ్లోబల్‌ టెండర్‌లో అదే జిల్లాకు చెందిన టిడిపి నాయకుడు నామా నాగేశ్వరరావు ఎందుకు పాల్గొనలేదని నిలదీశారు. టిడిపి నాయకులు సుజనా చౌదరి కాని, సిఎం రమేష్‌గాని బయ్యారం గనుల టెండర్ల జోలికి ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నించారు.

తెలంగాణా ప్రాంతం నుంచి రక్షణ స్టీల్సును ఆంధ్రా ప్రాంతానికి తరలించుకుపోతున్నారంటూ రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలో నిజం లేదన్నారు. రక్షణ స్టీల్సు ఖమ్మం జిల్లా సరిహద్దులోని వరంగల్‌ జిల్లాలో ఏర్పాటు చేయాలని దాని యజమానులు నిర్ణయించారన్నారు. ఈ విషయాన్ని రేవంత్‌రెడ్డి కృష్ణాజిల్లాకు తరలిస్తున్నారని, తెలంగాణకు అన్యాయం చేస్తున్నాంటూ గగ్గోలు పెట్టడంలో ఔచిత్యం లేదన్నారు. వరంగల్‌ జిల్లా తెలంగాణలో ఉందా? ఆంధ్రలో ఉందా? అనే విషయం టిడిపి నాయకులకు తెలియదా? అని ప్రశ్నించారు. రక్షణ స్టీల్సు వాటాదారుల్లో సతీష్‌, కృష్ణమాచారి తెలంగాణకు చెందిన వారే అన్నారు. నిజానికి తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందడం అంటే టిడిపికే ఇష్టం లేదన్నారు. గోబెల్సు ప్రచారానికి బాగా అలవాటు పడిన టిడిపి అసత్యాలు ప్రచారం చేయడానికే ఉత్సాహం చూపిస్తోందని దుయ్యబట్టారు. రద్దు చేసిన జీవో మీద ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని జూపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు.

బ్రదర్‌ అనిల్‌ మహానేత అల్లుడైనంత మాత్రాన ప్రతిరోజూ ఈ విధంగా సాధిస్తారా? అని జూపూడి నిలదీశారు. తనపై చేస్తున్న ఆరోపణలపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని బ్రదర్‌ అనిల్‌ ప్రకటించగానే ఆరోపణలు చేసిన టిడిపి నాయకులంతా అడ్రస్‌ లేకుండాపోయారని ఆయన ఎద్దేవా చేశారు. బ్రదర్‌ అనిల్‌కుమార్‌కు మహానేత డాక్టర్‌ వైయస్‌ 1,50,000 ఎకరాలను ధారాదత్తం చేశారంటూ టిడిపి చేస్తున్న ఆరోపణలపై జూపూడి వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం, అక్కడి గిరిజనుల కోసం తెలంగాణలో స్టీలు ఫ్యాక్టరీ రావాలన్నది మహానేత అభిమతం అన్నారు. బయ్యారం గనుల తవ్వకాలకు రోశయ్య ప్రభుత్వం జి.ఓ. జారీచేసిందన్నారు. ఈ గనులపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఈ ఒప్పందం రద్దు వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని జూపూడి వివరించారు. కోర్టులంటే టిడిపికి గౌరవం లేదు గానీ, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు గౌరవం ఉందన్నారు. రద్దు చేసిన జిఓ మీద ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడటం పద్ధతి కాదని జూపూడి సూచించారు.


టిడిపి నాయకులు చెబుతున్న అంశాన్నే పట్టుకుని పిసిసి చీఫ్‌ బొత్స కూడా మాట్లాడడాన్ని జూపూడి ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీల నాయకులూ ఒకే విధంగా మాట్లాతున్నారంటే అవి రెండు పార్టీలు కుమ్మక్కయ్యానడానికి నిదర్శనం ఇంకేమి కావాలన్నారు. టిడిపి దమ్ముంటే తెలంగాణాలో ఏర్పాటు కావాల్సిన రక్షణ స్టీల్సు ఫ్యాక్టరీ ఒప్పందాన్ని రద్దు చేసిన ప్రభుత్వంపై పోరాటం చేయాలని జూపూడి సూచించారు. శ్రీమతి షర్మిల సవాల్‌కు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి కాని రవ్వంత రేవంత్‌రెడ్డి కాదని ఆయన డిమాండ్‌ చేశారు. టిడిపి నాయకులు తమ తీరుతో రాజకీయాల నుంచి మానవత్వాన్ని తీసిపారేస్తున్నారని దుయ్యబట్టారు. శ్రీమతి షర్మిల సవాల్‌కు సమాధానం చెబితే చెప్పండి లేదంటే చేతులు ముడుచుకుని కూర్చోండని టిడిపి నాయకులకు జూపూడి ప్రభాకర్‌రావు హితవు పలికారు.
Back to Top