రాయలసీమ హక్కుల కోసం వైయ‌స్ఆర్‌సీపీ ఉద్యమం 

మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి

బన‌గాన‌ప‌ల్లెలో చలో పోతిరెడ్డిపాడు పోస్టర్ విడుదల

నంద్యాల జిల్లా :  రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను కాపాడేందుకు వైయ‌స్ఆర్‌సీపీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతుందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న “చలో పోతిరెడ్డిపాడు” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను బనగానపల్లె పట్టణంలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఓటుకు నోటు రాజకీయాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంతాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయని అన్నారు. రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నప్పటికీ అక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం 800 అడుగుల స్థాయి నుంచి కృష్ణా జలాలను విద్యుత్ ఉత్పత్తి పేరుతో తరలిస్తోందని ఆరోపించారు.

రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 800 అడుగుల స్థాయి వద్దనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. సుమారు రూ.3,000 కోట్లతో ప్రారంభించిన ఈ పథకంలో 80 శాతం పనులు పూర్తి చేశారని పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వం మిగిలిన 20 శాతం పనులను కూడా పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. రాయలసీమ హక్కుల సాధన కోసం వైయ‌స్ఆర్‌సీపీ ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తుందని కాటసాని రామిరెడ్డి తెలిపారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా పోతిరెడ్డిపాడుకు వెళ్లి తీరుతామని స్పష్టం చేశారు.  కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు  సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి, బీవీ నాగార్జున రెడ్డి, డి చిన్నబాబు, చిక్కేపల్లి ప్రసాద్ రెడ్డి, శ్రీనివాస నాయక్, కోటపాడు ఈశ్వర్ రెడ్డి, గులాంనబీ రఘు రెడ్డి, గుంజలపాడు సేనా రెడ్డి, రామసుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Back to Top