హైదరాబాద్, 17 డిసెంబర్ 2012: ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మేథోమథన సదస్సు 'అబద్దాల సదస్సు' అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీవేనని చెప్పడం శోచనీయమన్నారు. పార్టీ పథకాలే అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ గులాం నబీ ఆజాద్ సొంత రాష్ట్రం జమ్మూలోనూ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. మహానేత ఉన్నప్పుడు పునరంకిత సభలు పెట్టి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపేవారన్నారు. ఆయన మరణానంతరం ఎందుకు అటువంటి సభలు పెట్టలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మేథోమథనం సదస్సు పెట్టి కేవలం వైయస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే లక్ష్యంగా చేసుకున్నారన్నారు.

ఒక్క ఆరోగ్యశ్రీ పథకమే కాదు, ముస్లిం రిజర్శేషన్లు, 108, 104 వంటి పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయలేదని అంబటి ప్రశ్నించారు. మేథోమథనంలో నేతలు మాట్లాడిన తీరు వారి డొల్లతనాన్నిమరోసారి బయట పెట్టిందన్నారు. డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వానివని, ఆయనపై వచ్చిన ఆరోపణలు మాత్రం శ్రీ జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తాయని చెప్పడం సిగ్గు చేటన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మహానేత ఉచిత విద్యుత్తు ఇచ్చారని, చార్జీలు, పన్నులు పెంచకుండా పరిపాలించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మూడేళ్లలో మూడు సార్లు కరెంటు, ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలప భారం వేసిందన్నారు.

చిరంజీవి ఆత్మవిమర్శ చేసుకోవాలి
శ్రీ జగన్మోహన్ రెడ్డి చంచల్‌గూడ జైలు నుంచే సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ రాజకీయాలు చేస్తున్నారన్నాకేంద్ర మంత్రి చిరంజీవిపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలు నుంచే రాజకీయాలు చేస్తుంటే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏంచేస్తున్నాయని ప్రశ్నించారు. అధికారంలో ఉండి ఇటువంటి విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. అవినీతి గురించి మాట్లాడే ముందు చిరంజీవి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. చెన్నైలోని తన బంధువు ఇంట్లో ఐటీ అధికారులకు దొరికిన కోట్ల డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. పార్టీని విలీనం చేసినపుడు చేసుకున్న ఒప్పందాల ప్రకారం మంత్రి పదవులు రాలేదా? అని ప్రశ్నించారు.

తెలుపు రంగు కార్డుదారులను అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించిన ఘనత బొత్స సత్యనారాయణదని అంబటి విమర్శించారు. మహానేతను అడ్డుపెట్టుకుని శ్రీ జగన్మోహన్ రెడ్డి సంపాదించారని అవాకులు, చెవాకులు పేలితే మంచిది కాదన్నారు. జోడు పదవుల్లో కొనసాగుతూ కోట్లు ఖర్చు పెట్టి కూతురి పెండ్లి చేశారని ఆరోపించారు.

చికిత్స అనంతరం షర్మిల పాదయాత్ర
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, శ్రీ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల చికిత్స అనంతరం పాదయాత్ర కొనసాగిస్తారని అన్నారు. మోకాలి గాయంతో బాధపడుతున్న శ్రీమతి షర్మిలకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆపరేషన్ జరుగుతుందన్నారు. మూడు వారాల విశ్రాంతి తర్వాత ఇపుడు ఆగిన ప్రాంతం నుంచే మళ్లీ పాదయాత్ర ప్రారంభిస్తారని అన్నారు.