29 నుంచి రంగారెడ్డిలో షర్మిల పరామర్శ యాత్ర

 హైదరాబాద్ ః వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈనెల 29 నుంచి నాలుగు రోజుల పాటు
రంగారెడ్డి జిల్లాలో పరామర్శయాత్ర చేపట్టనున్నారు. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో
జులై 2 వరకు పరామర్శ యాత్ర ఉంటుందని పార్టీ తెలంగాణ విభాగ ప్రధానకార్యదర్శి
కె. శివకుమార్ వెల్లడించారు. శనివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
జూన్ 29న మహేశ్వరం నియోజకవర్గం నుంచి యాత్ర ప్రారంభమవుతుందని,
ఆ తర్వాత ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పర్యటిస్తారని చెప్పారు. షర్మిల
వెంట పరామర్శయాత్రలో పార్టీ తెలంగాణ విభాగ రాష్ర్ట అధ్యక్షుడు పి.శ్రీనివాస్ రెడ్డి,
ఇతర రాష్ర్ట, జిల్లా స్థాయి నాయకులు ఉంటారన్నారు.
ఈరెండు నియోజకవర్గాలలో మూడు కుటుంబాలను పరామర్శిస్తారని తెలిపారు. ఏడు నియోజకవర్గాలలో
మొత్తం 660 కిలోమీటర్లు షర్మిల పర్యటిస్తారని, 15 కుటుంబాలను పరామర్శిస్తారని శివకుమార్ వివరించారు. ఇబ్రహీంపట్నం తర్వాత యాత్ర
మేడ్చల్ నియోజకవర్గంలో సాగుతుందని, జూన్ 30న ఐదుగ్రామాలలో పర్యటించిన అనంతరం మర్నాడు చేవెళ్ల, పరిగి,
తాండూర్ నియోజకవర్గాలలో ఉంటుందని చెప్పారు. ఈ మూడు నియోజక వర్గాలలో మూడు
కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని తెలిపారు. జులై 2న వికారాబాద్
నియోజకవర్గంతో పర్యటన ముగుస్తుందని, ఈ నియోజక వర్గంలో మూడు గ్రామాలలో
షర్మిల పర్యటిస్తారని శివకుమార్ వివరించారు.

Back to Top