నేడు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మూడేళ్ల ప్రస్థానం

హైదరాబాద్:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ స్థాపించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. ప్రజల సంక్షేమమే పరమావధిగా వారి పోరాటాల నుంచే ఉద్భవించి, ప్రత్యర్థుల కుట్రలు, కుతంత్రాలను ఛేదించుకుంటూ పార్టీ పురోగమిస్తున్న తీరును ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మననం చేసుకుంటున్నాయి. పార్టీ స్థాపించిన రెండు నెలలకే యువనేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి, ఆయన మాతృమూర్తి శ్రీమతి వైయస్ విజయమ్మ కడప లో‌క్‌సభ, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికల్లో సంచలన విజయాలు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

మహానేత, తన తండ్రి, దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర నిర్వహించారు. అయితే కుట్రల నేపథ్యంలో 16 నెలల పాటు జైలులో గడపాల్సి వచ్చింది. దీంతో జైలులో ఉన్నప్పుడే ఆయన తల్లి శ్రీమతి విజయమ్మ, సోదరి శ్రీమతి షర్మిల ద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం, ప్రభుత్వం అవిశ్వాసం సందర్భంగా 18 మంది ఎమ్మెల్యేలు పార్టీకి అండగా నిలవడం, వారిపై అనర్హత కారణంగా జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడం తెలిసిందే.

ఫీజు రీయింబర్సుమెంట్ కోసం, రైతులకు మద్దతు ధర కోసం, విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్షలు, ఇతర ప్రజా సమస్యలపై నిరాహార దీక్షలు, ఆందోళనా కార్యక్రమాల వంటివెన్నో నిర్వహిస్తూ మూడేళ్ల ప్రస్థానంలో వై‌యస్ఆర్ కాంగ్రె‌స్‌ ప్రజలతో మమేకమైంది.

ప్రజల కోరిక మేరకు, ప్రజలే సృష్టించుకున్న పార్టీ వైయస్ఆర్‌సీపీ అని పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. సాధారణంగా నాయకులు పార్టీలు పెట్టి ప్రజల కోసం తపిస్తుంటారని, అయితే ప్రజలే ఒక నాయకుడిని తెచ్చుకున్న పార్టీ తమదని చెప్పారు.

Back to Top