వస్త్ర వ్యాపారులకు వైయస్సార్‌సీపీ అండగా ఉంటుంది

నరసరావుపేటః వస్త్ర దుకాణ వ్యాపారులపై వేసిన వస్తుసేవల పన్ను(జీఎస్‌టీ)పై పార్టీ అధ్యక్షుడు వైయస్‌.జగన్‌మోహనరెడ్డి ద్వారా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళతామని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వస్త్రవ్యాపారులకు హామీ ఇచ్చారు. వ్యాపారులు అందరికీ తమ పార్టీ అనుకూలంగానే ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా వస్త్ర వ్యాపారులపై విధించిన జీఎస్‌టీ పన్నుకు వ్యతిరేకంగా నరసరావుపేట వస్త్ర వ్యాపారుల సమైఖ్య ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని దుకాణదారులు అందరూ తమ దుకాణాలను మూసేసి బంద్‌లో పాల్గొన్నారు. మూడు అసోసియేషన్లకు చెందిన వ్యాపారులు అందరూ ప్రదర్శనగా ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డిని పార్టీ కార్యాలయంలో కలిసి తమ సమస్యను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలంటూ వినతిపత్రం సమర్పించారు. నిత్యావసరాల్లో ఒకటైన వస్త్రాలపై జీఎస్‌టీ పన్నును విధించటం శోచనీయం అన్నారు. దీనివలన చిన్న వ్యాపారులకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నోమార్లు వస్త్రాలపై పన్ను ఉండదని చెప్పారన్నారు. ఇప్పటికే ముడిసరుకుపై 18శాతం, రెడీమేడ్స్‌పై 12శాతం పన్ను విధించారన్నారు. కేంద్ర ప్రభుత్వం వస్త్రాల ముడిసరుకు, ఉత్పత్తి కేంద్రాలపై మాత్రమే పన్ను విధించుకునేలా వ్యాపారుల తరపున సిఫార్సు చేయాలని కోరారు. మీ విజ్ఞాపనలను ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయుడు దృష్టికి తీసుకెళ్ళి కేంద్రప్రభుత్వానికి చేరేలా సహకరిస్తామని ఎమ్మెల్యే గోపిరెడ్డి వారికి హామీ ఇచ్చారు.

Back to Top