కంతెరలో 14 ఎకరాలు ఎలా కొనుగోలు చేశారు బాబూరియలెస్టేట్ వ్యాపారానికి అమరావతి వాడుకుంటున్నారుప్రపంచమంతా ఒకదారైతే.. చంద్రబాబుది దోపిడీ దారిప్రభుత్వానికి ఆఖరి రోజులు మొదలయ్యాయిఅధికారంలోకి వచ్చాక బాబు అవినీతి బయటపెడతాం
విజయవాడ: దుర్గమ్మ వారధి జనసంద్రం ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పడుతుందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కృష్ణా జిల్లాకు వచ్చిన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు వేల సంఖ్యలో తరలివచ్చి ఘనస్వాగతం పలికారన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రేమ చూపిన ప్రజలకు పార్థసారధి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలు, ఎన్నికల హామీలు తుంగలో తొక్కడం, రైతాంగం, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైయస్ జగన్ చెప్పినవన్నీ వాస్తవాలని ప్రజలు నమ్ముతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ఎంతో కొంత లాభం ఉంటేనే చేస్తారని, నీరు చెట్టు, ఉచిత ఇసుక, పోలవరం, రాజధాని నిర్మాణం, పట్టిసీమ కార్యక్రమాల్లో వేల కోట్లు దండుకున్నారన్నారు.
రియలెస్టేట్ వ్యాపారం కోసమే చంద్రబాబు అమరావతిని వాడుకుంటున్నాడని పార్థసారధి మండిపడ్డారు. కంతెర గ్రామంలో హెరిటేజ్ కంపెనీ పేరుతో 14 ఎకరాలు ఏ విధంగా కొనుగోలు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని అని పేదల భూములు లాక్కున్న చంద్రబాబు కంతెర గ్రామంలోని 14 ఎకరాల భూమిని ఎందుకు ముట్టుకోలేదని ప్రశ్నించారు. నిజంగా ప్రజా రాజధాని నిర్మించాలనే చంద్రబాబుకు లేదన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. చంద్రబాబు దగ్గర పనిచేసే అధికారులు కూడా ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుందని చెప్పలేకపోతున్నారన్నారు. ప్రపంచమంతా ఒక దారిలో నడుస్తుంటే.. చంద్రబాబు మాత్రం అపర మేధావిలా ప్రజలను మభ్యపెడుతూ దోపిడీ దారిలో వెళ్తున్నాడన్నారు. ప్రభుత్వానికి ఆఖరి రోజులు మొదలయ్యాయని, అందుకు ప్రజా సంకల్పయాత్రకు జన స్పందనే నిదర్శనమన్నారు. ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు అవినీతిని వైయస్‌ఆర్ సీపీ బయటపెడుతుందన్నారు.