కేసుల నుంచి తప్పించుకునేందుకు బాబు బీజేపీతో ఒప్పందాలుప్రత్యేక హోదా యోధుడిగా చంద్రబాబు తోకపత్రికల ప్రచారం15 రోజుల్లో బాబుపై కేంద్రం దాడి చేయకపోతే ఒప్పందాలు కుదిరినట్లేజస్టిస్ ఈశ్వరయ్య వ్యాఖ్యలకు ఎందుకు వివరణ ఇవ్వలేదుబలహీనవర్గాలను కించపరుస్తున్న చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్‌ను ఎందుకు కలిశారో చెప్పాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చంద్రబాబును గవర్నర్ నరసింహన్ దూకుడొద్దని, కేంద్రంతో సఖ్యతగా ఉండాలని చంద్రబాబు, ఆయన తోక పత్రికలు, ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. నాలుగేళ్లుగా చంద్రబాబు అలుపెరగని పోరాటం చేస్తున్నట్లు, దాని వల్ల సునామీలు వస్తున్నట్లు.. దానికి గవర్నర్ రిక్వస్ట్ చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. గవర్నర్‌ను కలిసి చర్చించిన అంశాలను బయటపెట్టాలని బొత్స సూచించారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ, బీజేపీ లోపాయకార ఒప్పందాలతో ప్రజలను మళ్లీ చేస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న వివిధ అంశాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సతీమణిని మెంబర్‌గా చేయడం, సుజనా చౌదరి గవర్నర్‌ను కలవడం అనుమానాలను బలపరుస్తున్నాయన్నారు.  రాష్ట్ర ప్రజలకు ఆపాదించే ప్రయత్నం..నాలుగేళ్లుగా చేస్తున్న అవినీతి, ఓటుకు కోట్ల కేసు నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు మళ్లీ బీజేపీతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని బొత్స అనుమానం వ్యక్తం చేశారు. అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అమరావతిలో జరిగిన ప్రెస్‌మీట్‌లో కర్ణాటక ఎన్నికలు 15 రోజుల్లో ముగుస్తాయి.. ఆ తరువాత తనపై కేంద్రం వ్యక్తిగత దాడులు, ఎంక్వైరీలు వేస్తారని చెప్పారన్నారు. దాన్ని రాష్ట్ర ప్రజలకు ఆపాదించడానికి తయారయ్యాడన్నారు. ఈ మేరకు చంద్రబాబుకు బొత్స సత్యనారాయణ సూటి ప్రశ్న వేశారు. 15 రోజుల తరువాత చంద్రబాబుపై దాడులు జరగకపోతే.. బీజేపీతో ఒప్పందాలు కుదిరినట్లేనని, లేదంటే రాష్ట్రానికి మేలు జరగాలన్నారు. ప్రతిపక్ష ఎంపీలు రాజీనామాలు చేసి దీక్ష చేసినప్పుడే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసివుంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. మాటలు చెప్పడం కాదు చంద్రబాబూ మీ విశ్వరూపం చూపించి కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. ఇదేం ధర్మం చంద్రబాబూ..?జస్టిస్ ఈశ్వరయ్య చేసిన వ్యాఖ్యలకు వివరణ ఎందుకు ఇవ్వడం లేదని చంద్రబాబును బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. గతంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్‌గా పనిచేసిన వ్యక్తి ఈశ్వరయ్య చంద్రబాబు కుల ప్రితీపై అనేక అంశాలను తెరపైకి తెచ్చారన్నారు. న్యాయమూర్తులుగా బీసీ, ఎస్సీలు పనికిరారా అని చంద్రబాబును ప్రశ్నించారు. బలహీనవర్గాలకు చెందిన వ్యక్తి రాష్ట్ర డీజీపీగా ఉంటే ఆయన్ను తీసి చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెట్టారన్నారు. ఎస్సీలు, బీసీలు పెద్ద పెద్ద స్థానాల్లో ఉంటే మీకు నచ్చారా.. ఇదేం ధర్మం చంద్రబాబూ.. ఒకసారి ఓటేసిన పాపానికి బలహీనవర్గాలను కించపరుస్తారా అని విరుచుకుపడ్డారు. అధికారం ఉంది కదా ఏం చేసినా చెల్లుతుందనే ధోరణిలో ముఖ్యమంత్రి ఉన్నారని, అది చాలా తప్పన్నారు. దీనికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 30వ తేదీన వంచన దినంకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మోసానికి ఈ నెల 30వ తేదీన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వంచన దినంగా ప్రకటించిందని, విశాఖలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన తెలపనున్నట్లు బొత్స సత్యనారాయణ చెప్పారు. వెంకటేశ్వరస్వామి సాక్షిగా 2014 ఏప్రిల్ 30వ తేదీన సమావేశం పెట్టి ప్రత్యేక హోదా అంశంపై ఒకరు 5 అంటే.. మరొకరు 10.. ఇంకొకరు 15 సంవత్సరాలు ఇస్తామని చెప్పి వంచించారన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు 30వ తేదీన ఆందోళన చేపట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజానికానికి చంద్రబాబు చేసిన మోసాలను వివరించి.. మళ్లీ మోసపోకుండా చైతన్యులను చేస్తామన్నారు. ఈ వంచనకు రెండు పార్టీలు సమాధానం చెప్పాలన్నారు.