న్యూఢిల్లీ : రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. లోక్ సభలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీకి కట్టుబడాలని ఎంపీలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని ఆనాడు ప్రస్తుత బీజేపీ చెప్పిందని ఎంపీలు తెలిపారు. విడిపోయిన రాష్ట్రాలను కలపడానికి ఏవిధంగానైతే వీలుపడదో ..ఇచ్చిన హామీని వెనక్కి తీసుకోవడానికి కూడా కుదరదని ఎంపీలు చెప్పారు. <br/>విభజన రోజు చేసిన వాగ్దానం భంగం చేయడం పార్లమెంట్ సంప్రదాయానికే విరుద్ధమన్నారు. తప్పనిసరిగా ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర విభజన జరిగి 18 నెలల అయినా, హోదా ఇవ్వడంలో కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఎంపీలు మండిపడ్డారు. తక్షణమే ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్సీపీ ఎన్నో ఉద్యమాలు చేసిందని, తమ అధినేత వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష కూడా చేపట్టారని నేతలు చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వచ్చే సాధించేవరకు వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు.