అమరావతి: ‘పాత రోజుల్లో ఒక గ్రామం సర్వే చేయాలంటే రెండు సంవత్సరాలు పట్టేది. సర్వేయర్ అక్కడ క్యాంపులో ఉంటాడు. ఒకరోజు ఉంటాడు.. ఒకరోజు ఉండడు.. చాలా సమయం తీసుకునేవారు. పాత రోజుల్లో చెయిన్ వేసేవాళ్లు. అది కొద్దిగా లూజుగా అటూ ఇటూ వదిలితే పక్కకు జరిగేది. ఆ మేర భూమిని తగ్గించేసేవారు. ఇప్పుడు అవన్నీ పోతాయి. లాటిట్యూడ్, లాంగిట్యూడ్ (అక్షాంశాలు, రేఖాంశాలు) ఆధారంగా కచ్చితమైన పాయింట్ (ల్యాట్ లాంగ్) స్పష్టంగా వచ్చేస్తుంది. ఆ పథకం పేరు కూడా కచ్చితంగా సరిపోతుంది. ఓ వ్యక్తి చనిపోయి 15 ఏళ్లు అయినప్పటికీ అతని పేరుపై ఉన్న భూమి కొడుకు పేరుపైకి ఎక్కదు. మా వాళ్లు ఎక్కించి ఉండరు. భూమి కొనుకున్న వాళ్ల పరిస్థితి కూడా ఇంతే. కొత్త వివరాలు రికార్డుల్లోకి ఎక్కవు. ఇలాంటివన్నీ ఇప్పుడు క్లియర్ చేస్తున్నాం. భయాలు, వివాదాలకు తావు లేకుండా కచ్చితంగా హద్దుల నిర్ధారణ జరుగుతోంది’ అని 2022 ఆగస్టు 2వ తేదీన నాటి సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షలో అప్పటి రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ స్పష్టం చేశారు. 2022లో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన చీఫ్ కమిషనర్‌గా భూముల రీ సర్వే ఆయన నేతృత్వంలోనే జరిగింది. వారంలో రెండుసార్లు ఆయన జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి సర్వే వేగంగా జరగడానికి అవసరమైన చర్యలు తీసుకునే వారు. ప్రతి రోజూ రీ సర్వే స్టేటస్ రిపోర్టు తయారు చేయించేవారు. రీ సర్వే అద్భుతంగా జరుగుతోందని, ఎంతో ముందు చూపుతో ఈ కార్యక్రమం చేపట్టారని ఆయన చాలా సందర్భాల్లో ప్రశంసించారు. ఎల్లో మీడియా రీ సర్వేకు వ్యతిరేకంగా పని గట్టుకుని కథనాలు రాసినప్పుడు ఆయన మీడియా సమావేశాలు పెట్టి బాగా జరుగుతోందని, దీని వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పేవారు. సాయిప్రసాద్ 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన పేషీలో పని చేశారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఆయన కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కూడా ఆయనే. త్వరలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉంటారని గతంలోనే ప్రభుత్వం జీఓ జారీ చేసింది. రీ సర్వే బాగా జరిగిందని చంద్రబాబు అంగీకరించినట్లే » వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో విప్లవాత్మకంగా ప్రారంభమై విజయవంతంగా అమలవుతున్న భూముల రీ సర్వేపై చంద్రబాబు రెండు నాల్కల ధోరణి చర్చనీయాంశంగా మారింది. జగన్ హయాంలో జరిగిన రీ సర్వేను అన్ని రకాలుగా తప్పు పట్టిన చంద్రబాబు.. అప్పట్లో ఆ కార్యక్రమాన్ని అమలు చేసిన అప్పటి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్‌కు ఇప్పుడు తన ప్రభుత్వంలో అదే రెవెన్యూ శాఖను అప్పగించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. » పైగా తదుపరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయన్ను ఎంపిక చేయడాన్ని ఎత్తి చూపుతున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్.. రీ సర్వే బాగా జరుగుతోందని పలుమార్లు సమీక్షా సమావేశాల్లో వెల్లడించారు. ఇప్పుడు ఆయనకు అత్యున్నత స్థాయి పోస్టింగ్ ఇవ్వడం ద్వారా గతంలో ఆయన మాట్లాడిన మాటలు, చేసిన కార్యక్రమాలను.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో జరిగిన రీ సర్వేను అంగీకరించినట్లేనని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. » ఇటీవల దావోస్‌లో జరిగిన సదస్సులో ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) ఎండీ గీతా గోపీనాథ్ సైతం గత ప్రభుత్వంలో రాష్ట్రంలో చేపట్టిన రీ సర్వేను ప్రశంసించారు. సీఎం చంద్రబాబు అక్కడ ఉండగానే ఆమె ఈ విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడం గమనార్హం. ఇలాంటి భూ సంస్కరణలు అత్యంత ఆవçశ్యకమని ఆమె కొనియాడటం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎంతో మంది ఐఏఎస్ అధికారులు సైతం రీ సర్వేను మెచ్చుకుంటున్నారు. ఇది అత్యంత సాహసోపేత కార్యక్రమమని, వందేళ్ల తర్వాత చేపట్టిన మహా యజ్ఞమని చెబుతున్నారు. తమ జీవితంలో చాలా సంతృప్తిని ఇచ్చిన కార్యక్రమమని.. రీ సర్వేలో పాలు పంచుకున్న అధికారులందరూ వ్యక్తిగత సంభాషణల్లో చర్చించుకుంటున్నారు. » వీటన్నింటినీ బట్టి చూస్తే ఎన్నికలకు ముందు చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి పక్కా ప్రణాళికతోనే రీ సర్వేపై దుష్ప్రచారం చేశారని స్పష్టమవుతోంది. ప్రజల్లో విషం నింపి రాజకీయ లబ్ధి కోసం బరితెగించారని ఇట్టే తెలుస్తోంది. నేను రెవెన్యూ శాఖలో (ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్టింగ్ ఇవ్వక ముందు) చేరక ముందే తూర్పుగోదావరి జిల్లాలోని పాలగుమ్మి గ్రామానికి వెళ్లి రీ సర్వే ఎలా జరుగుతుందో చూశాను. మూడు గంటలు అక్కడే ఉండి పరిశీలించాక అక్కడి నుంచే సిద్ధార్థ జైన్‌కు ఫోన్ చేసి బాగా చేస్తున్నారని చెప్పా. ఒక సెంటు అటూ ఇటూ అవుతుందేమోనన్న భయంతో పాటు అనుమానాలు ఉండేవి. కానీ అలాంటిదేమీ జరగలేదు. దీని వల్ల చాలా మేలు జరుగుతోందని సిద్ధార్థ్‌కు చెప్పాను. రెవెన్యూ శాఖలో జాయిన్ అయ్యాక గుంటూరు జిల్లాలో రెండు మూడు గ్రామాలకు వెళ్లి రైతులతో రీ సర్వే గురించి మాట్లాడాను. చాలా బాగుందని చెప్పారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. – 2022 మార్చి 31న రీ సర్వేపై సమీక్షలో రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్