వైయ‌స్ఆర్‌ జిల్లా కడపలో అర్ధరాత్రి అరాచకం

నోటిసులు లేకుండా ఇంటిని జేసీబీల‌తో నేల‌మ‌ట్టం చేయించిన టీడీపీ నేత‌లు 

వైయ‌స్ఆర్ జిల్లా: కడప నగరంలో టీడీపీ నేతల దాష్టీక పాలన మరోసారి వెలుగులోకి వచ్చింది. ఎర్రముక్కపల్లి ప్రాంతంలో అర్ధరాత్రి వేళ జరిగిన ఘటన కూట‌మి నేత‌ల దౌర్జ‌న్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. కడప నగరంలోని ఎర్రముక్కపల్లిలో భాస్కర్, లక్ష్మీ చలపతి, భారవి కుటుంబానికి చెందిన ఇంటిని టీడీపీ నేతలు రెండు జేసీబీలతో పూర్తిగా నేలమట్టం చేశారు.  ఎలాంటి నోటీసులు, చట్టబద్ధ ప్రక్రియలు పాటించకుండా అర్ధరాత్రి దాడికి పాల్పడటం అమానుషమని స్థానికులు మండిపడుతున్నారు. ఇంట్లో ఉన్న మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులను సైతం   బలవంతంగా బయటకు లాగి రోడ్డుపై పడేసిన ఘటన మానవత్వాన్ని సైతం ప్రశ్నించేలా ఉందని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముసలివారిని, పసిపిల్లలను కూడా కనికరం లేకుండా బయటకు లాగేసిన తీరు టీడీపీ దౌర్జన్య రాజకీయాలకు పరాకాష్టగా మారిందని విమర్శించారు.

ఈ అక్రమ ధ్వంసం వెనుక టీడీపీకి చెందిన శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ద్వారకనాథరెడ్డి ఉన్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ అండతోనే ఈ దాష్టీకానికి పాల్పడ్డారని, లేకపోతే ఇంత సాహసం చేయలేరని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే అసలు బాధ్యులైన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం దౌర్జన్యాలకు వేదికగా మారిందని, ప్రతిపక్షం గొంతు నొక్కేందుకే ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ బాధిత కుటుంబాల పక్షాన నిలబడి న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామని వైయ‌స్ఆర్‌సీపీ స్పష్టం చేసింది.

Back to Top