రాష్ట్రంలో రాజ్యహింస

– దేశంలో ఎక్కడాలేని చట్టాలు ఏపీలోనే
– పిల్లలు కాపీ కొడితే ఇన్విజిలేటర్‌ జైలుకా?
– రేయిన్‌ గన్స్‌తో సాగునీరు అంటూ డ్రామాలు
– డ్రిప్‌ వాటర్‌ పేరుతో చంద్రబాబు షో చేశారు
– రైతులను మోసం చేసి కపట ప్రేమ
– దుష్టపరిపాలనను పారద్రోలుదాం
విజయవాడ: రాష్ట్రంలో రాజ్యహింస నడుస్తోందని, దేశంలో ఎక్కడా లేని చట్టాలు అమలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు మొసలి కన్నీరు కార్చుతున్నారని, అలాంటి వ్యక్తిని నమ్మొద్దని గోపాల్‌రెడ్డి సూచించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని పేరుతో టీడీపీ ప్రభుత్వం 33 వేల ఎకరాల మూడు పంటలు పండే భూములను దౌర్జనంగా లాక్కుందని విమర్శించారు.  రైతుల భూములు లాక్కొని వెయ్యి గజాలు ఇవ్వడం, భూసేకరణ చేసుకొని రైతులను బిక్షగాళ్లుగా మార్చుతున్నారని మండిపడ్డారు. ఈ రోజు రైతులు భూములు ఇవ్వమంటే అరెస్టు చేస్తున్నారని, పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని ధ్వజమెత్తారు. మీరా ప్రసాద్‌అనే రైతును వేధించారని గుర్తు చేశారు. చంద్రబాబు మొసలి కన్నీరు నమ్మి మోసపోవద్దు అన్నారు. అనంతపురంలో రైయిన్‌గన్లతో కరువును పారద్రోలామని రైతులను చంద్రబాబు మభ్యపెట్టారన్నారు. నాలుగు కంపెనీలతో రైయిన్‌గన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ నాలుగు కంపెనీలు అనంతపురంలో వనగ, తదితర పంటలు సాగుకు అనుకూలంగా లేదని చెప్పారని గుర్తు చేశారు. మున్సిపల్‌ ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి రూ.240 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. రెయిన్‌ గన్లు చూసేందుకు వచ్చిన ప్రజల తొక్కిసలాటలో పంటలు దెబ్బతిన్నాయన్నారు. చంద్రబాబు పొద్దున లేచింది మొదలు షో చేస్తున్నారని మండిపడ్డారు. డ్రిప్‌ వాటర్‌పైపులు ఎత్తుకెళ్లారని తప్పుడు ప్రచారం చేశారన్నారు. రాయలసీమ జిల్లాల్లో ఎక్కడా రైతులు రెయిన్‌గన్లు వాడటం లేదన్నారు. రైతులను మోసం చేసి చంద్రబాబు కపట ప్రేమ చూపుతున్నారని విమర్శించారు. కనీసం వ్యవసాయ శాఖ అధికారులు కూడా రైతుల వద్దకు వెళ్లి రెయిన్‌గన్ల గురించి చెప్పలేకపోతున్నారన్నారు.

టీచర్లు ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేదు
రాష్ట్రంలో టీచర్లు ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేకుండా చేశారని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. పిల్లలు కాఫీ కొడితే ఉపాధ్యాయులకు ఐదేళ్లు జైలు శిక్షానా?. విద్యార్థులు పొరపాటున జేబులో పేపర్‌ పెట్టుకొని వస్తే ఆ బాధ్యత ఉపాధ్యాయుడిదా అని మండిపడ్డారు. టీచర్లను హింసించడం సరికాదన్నారు. దోమలపై దండయాత్ర అవసరమా బాబూ అని నిలదీశారు. మున్సిపాలిటీలో ఫంగింగ్‌ చర్యలు చేపడితే దోమలు ఉండవన్నారు. అధికారులను వారి పని వారు చేసుకోనివ్వడం లేదని, టీచర్లు వారి పని చేసుకోలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో ఫ్యూడలిస్టు పాలన కొనసాగుతుందన్నారు.

బాబు చెప్పే అబద్ధాలకు విసుగు చెందారు
చంద్రబాబు చెప్పే అబద్ధాలతో ప్రజలు విసుగు చెందుతున్నారని గోపాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రెట్టింపు వర్షాలు వచ్చి పంటలు దెబ్బతిన్నాయని మంత్రి అసెంబ్లీలో మాట్లాడం బాధాకరమన్నారు. రాయలసీమ జిల్లాలో 450మిల్లిలీటర్లకు మించి పదేళ్ల నుంచి వర్షాలు పడలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకు నిజం చెప్పాలని సూచించారు. చంద్రబాబు చెప్పే అబద్ధాలు విని విని ప్రజలకు విసుగు వచ్చిందన్నారు. మంత్రులైనా నిజాలు చెప్పాలని సూచించారు. మీ దుర్మార్గాలు చూడలేక అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించామన్నారు. మాట్లాడితే మైక్‌ కట్‌ చేయడం, తన అనుచరులతో ప్రతిపక్ష నేతలపై విచక్షణ కోల్పోయి మాటల యుద్ధానికి దిగడంతోనే అసెంబ్లీకి రావడం లేదన్నారు. ఫిరాయింపులపై హైకోర్టు తప్పుపట్టిందన్నారు. అయినా చంద్రబాబులో ఎలాంటి మార్పు రావడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలని సూచించారు. ప్రజారంజక పాలన అందించాలని నీకు అధికారం ఇచ్చారని, నీ  ఇష్టానుసారంగా కమిటీలు వేసుకొని పాలన సాగించడం సరికాదన్నారు. జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతర శక్తులగా మారయన్నారు. దుష్ట పరిపాలనను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని గోపాల్‌రెడ్డి హెచ్చరించారు. 
 
Back to Top