30వేల మందితో వైయస్సార్సీపీ ప్లీనరీ

  • నియోజకవర్గ, జిల్లా స్థాయి ప్లీనరీలు విజయవంతం 
  • జూలై 8,9 తేదీల్లో అమరావతిలో జాతీయస్థాయి ప్లీనరీ
  • 18 కమిటీల పర్యవేక్షణలో ముమ్మరంగా ఏర్పాట్లు
హైదరాబాద్ః మూడంచల ప్లీనరీ సమావేశాల్లో భాగంగా నియోజకవర్గ, జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలు విజయవంతమయ్యాయని వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. వైయస్సార్సీపీ జాతీయ స్థాయి ప్లీనరీని జూలై 8,9 తేదీల్లో అమరావతిలో జరపనున్నట్టు స్పష్టం చేశారు. గుంటూరు, విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ ఎదురగా ఈ ప్లీనరీ సమావేశం జరుగుతుందని ఉమ్మారెడ్డి ప్రకటించారు. ప్లీనరీ నిర్వహణకు గాను మొత్తం 18 కమిటీలు వేసినట్లు ఉమ్మారెడ్డి తెలిపారు. నియోజకవర్గ, జిల్లా స్థాయి ప్లీనరీ తీర్మానాల ప్రాతిపదికనే అమరావతిలో తీర్మానాలుంటాయని చెప్పారు.  జాతీయ స్థాయి ప్లీనరీ వేదికగా మొత్తం 18 తీర్మానాలు ఆమోదించనున్నట్టు ఉమ్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్లీనరీకి రాష్ట్రవ్యాప్తంగా 30వేల మంది ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు.  హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఉమ్మారెడ్డి మాట్లాడుతూ ప్లీనరీ విశేషాలను వెల్లడించారు. 

ఒకే చోట ప్లీనరీ సమావేశాలు పెడితే కిందిస్థాయి వాళ్లు ఏం చర్చిస్తున్నారో తెలిసే అవకాశం లేనందున మూడంచల్లో నిర్వహించినట్టు ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గ స్థాయి ప్లీనరీ  చర్చల్లో గ్రామీణులు కూడ పాల్గొంటారు కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలు క్షేత్రస్థాయిలో తెలుస్తాయన్నారు.   ప్రస్తుత రాజకీయ పరిణామాలు నియోజకవర్గ ప్లీనరీలో పాల్గొనే వాళ్లకు ఉపయోగపడుతుందన్నారు. మే నెల 25 నుంచి 175 నియోజకవర్గాల్లో 10, 12 రోజుల పాటు నియోజకవర్గ ప్లీనరీలు జరిగాయని ఉమ్మారెడ్డి తెలిపారు. జిల్లాస్థాయి నియోజకవర్గాలు దాదాపుగా అయిపోవచ్చాయన్నారు.  తెలంగాణకు సంబంధించి అందరూ కలిసి హైదరాబాద్ లో ప్లీనరీ పెట్టుకున్నారని చెప్పారు. జిల్లాల్లో ఆమోదించబడ్డ తీర్మానాలన్నీ రాష్ట్రస్థాయికి వచ్చాయన్నారు. వీటన్నంటినీ క్రోడీకరించి జూలై 8,9 తేదీల్లో అమరావతిలో జరిగే ప్లీనరీలో తీర్మానాలు రూపొందించుకుంటున్నామని ఉమ్మారెడ్డి తెలియజేశారు. 

పార్కింగ్ స్థలం నుంచి భోజన వసతి వరకు ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.  మొత్తం 18 కమిటీలు ప్లీనరీ నిర్వహణను పర్యవేక్షిస్తున్నాయన్నారు.  రెండ్రోజుల సమావేశాల్లో ఎవరికి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామన్నారు. పార్టీ నియమావళి ప్రకారం  అధ్యక్షుని ఎన్నికకు  8వ తేదీ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. సాయంత్రానికి స్క్రూటినీ చేసుకొని 9న ఫలితాలను వెల్లడిస్తామన్నారు. అలంకరణలో భాగంగా  వివిధ మార్గాలనుంచి వచ్చే ప్రతినిధుల కోసం రోడ్లకు ఆహ్వాన ద్వారాలు ఏర్పాటు చేస్తామన్నారు. అంబేద్కర్, అబ్దుల్ కలాం, అల్లూరి , తాండ్రపాపారాయుడు లాంటి ప్రముఖుల పేర్లతో 28 నుంచి 30 ద్వారాల వరకు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. 

Back to Top