చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు

హైదరాబాద్, 23 సెప్టెంబర్ 2013:

రాష్ట్రం అగ్నిగుండంగా మారడానికి, పాలన పూర్తిగా అస్తవ్యస్తం కావడానికి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టిడిపిలే కారణమని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్యేలు జి. శ్రీకాంత్‌రెడ్డి, కె. శ్రీనివాసులు మండిపడ్డారు. సిఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు అసమర్ధ నాయకుల కారణంగానే రాష్ట్రాన్ని కేంద్రం అధోగతి పాలు చేసిందని ఆందోళన వ్యక్తంచేశారు. సమైక్య ఉద్యమం వల్ల సామాన్యులు, ఉద్యోగులు, రైతులు, రోడ్డున పడిప్పటికీ కిరణ్- చంద్రబాబు మాత్రం తమ పదవులను పట్టుకుని వేలాడుతునే ఉన్నారని వారు ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఆవరణలో వారు సోమవారంనాడు మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఎందుకు చేశారో చెప్పలేకపోవడం ఆయన లోపాయికారీ రాజకీయాలకు నిదర్శనమని శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు విమర్శించారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ కోసం పంపించిన అభ్యర్థన లేఖలో ఏ అంశాన్ని పేర్కొన్నారని అడిగిన మీడియా విలేకరిపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేయడాన్ని శ్రీకాంత్‌రెడ్డి తప్పుపట్టారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి బెయిల్ను అడ్డుకునేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు కాబట్టే ఆ వాస్తవాన్ని చెప్పలేకపోతున్నారని ‌వారు ఆరోపించారు. సమైక్య రాష్ట్రం కోసం రాజీనామాలు చేయవద్దని అటు సిఎం కిరణ్, ఇటు చంద్రబాబు తమ పార్టీల ప్రజాప్రతినిధులను తప్పుదారి పట్టిస్తున్నారని వారు విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు సమైక్య రాష్ట్రంపై తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తమైపోయిందని శ్రీకాంత్‌రెడ్డి విచారం వ్యక్తంచేశారు. ఇన్ని రోజులుగా ప్రజాజీవనం స్తంభించిపోయినా సిగ్గు లేకుండా రకరకాల మాటలతో మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని కిరణ్‌కుమార్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. చీటికి మాటికి ఢిల్లీ వెళ్ళే సిఎం కిరణ్‌ తాను రాష్ట్రానికి ఏ ప్రయోజనం చేకూర్చారని ప్రశ్నించారు. తనది 'పి' టర్ను అని చెప్పిన చంద్రబాబు దాని గురించి వివరంగా చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. బిజెపికి మద్దతు ఇవ్వబోనని మైనార్టీలకు మాట ఇచ్చిన చంద్రబాబు నేడు ఆ మాట తప్పి బిజెపి అధ్యక్షుడితో సమాలోచనలు చేయడం సిగ్గచేటు అని విమర్శించారు. ఎన్డీయేతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు.

ఇంతకాలం కాంగ్రెస్‌తో లోపాయికారీ మిత్రత్వాన్ని నెరపిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు వస్తున్న తరుణంలో యుపిఎతోనే ఉండాలా లేక ఎన్డీయేతో కలవాలా అనేది రాజకీయ లబ్ధి కోణంలో చంద్రబాబు బేరీజు వేసుకుంటున్నారని శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్‌కు టిడిపి ఎమ్మెల్యేల చేత పాదాభివందనాలు చేయించడమేమిటని ప్రశ్నించారు. ఒక్కొక్కసారి తనకు నిద్ర పట్టడంలేదని చెప్పే చంద్రబాబు మొద్దు నిద్ర పోతుండబట్టే రాష్ట్రంలో ప్రస్తుత దుస్థితి వచ్చిందని దుయ్యబట్టారు.

ఒక పక్కన రాష్ట్రం అగ్నిగుండంలా కాలిపోతుంటే ఇప్పటికింకా రాజీనామా రేపు చేస్తున్నాం, ఎల్లుండి చేస్తున్నామని కాంగ్రెస్‌ పెద్దలు, మంత్రులు, ఎంపిలు చెప్పడం సరికాదని శ్రీనివాసులు అన్నారు. తొమ్మిదేళ్ళు సిఎంగా, తొమ్మిదేళ్ళుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఊసరవెల్లిలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

Back to Top