‘చంద్రబాబును చూసి ఊసరవెల్లే సిగ్గు పడుతోంది’కమలాపురం : ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఊసరవెల్లి కూడా సిగ్గు పడేవిధంగా మాటలు మారుస్తున్నారని కమలాపురం వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. వైయ‌స్ఆర్‌ జిల్లా కమలాపురంలో రవీంద్రనాథ్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి సొమ్ముతో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను కొని పార్టీలో చేర్చుకుని మరీ తెలంగాణాలో పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేలను ఓడించాలని పిలుపునివ్వడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గపు నాయకుడు ప్రపంచంలో ఎక్కడా లేరని వ్యాక్యానించారు.

గత ఎన్నికల్లో అన్నివర్గాల ప్రజలందరినీ మభ్యపెట్టి ముఖ్యమంత్రి అయ్యాక అందరినీ మోసం చేశాడని విమర్శించారు. కమీషన్లు ఎక్కువ వచ్చిన చోటే పనులు మాత్రమే చేశారని ధ్వజమెత్తారు. కొన్ని పేపర్లు అడ్డం పెట్టుకుని వాటి ద్వారా ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు చెబుతున్న మాటలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.
Back to Top