అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకు కన్నీరు


  – 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి కంట తడిపెట్టడం ఏంటీ?
– ఏపీకి అన్యాయం జరిగిందని సీఎం బాధపడ్డారట
– అసెంబ్లీలో చంద్రబాబు భావోద్వేగం అంటూ కొన్ని పత్రికల కథనాలు
– ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారంటూ గతంలో అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం చేశారు
– ఇప్పుడేమో ప్రత్యేక ప్యాకేజీపై మొసలికన్నీరు కారుస్తున్నారు
– మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం వైయస్‌ జగన్‌ పోరాటం
– ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షంతో కలిసి అధికార పక్షం పోరాటం చేయాలి
– ఇప్పుడెందుకు అన్యాయం అంటూ గగ్గోలు పెడుతున్నారు
– హైదరాబాద్‌కు ఐటీని తెచ్చింది బాబేనట
– ప్రతి దానికి క్రెడిట్‌ కోసం చంద్రబాబు పాకులాట
– బాబు మాటలు చూస్తే ఆయనకు జ్ఞానం ఉందో లేదో? 
 
విజయవాడ: చంద్రబాబు తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కన్నీరు పెట్టినట్లు నటిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.  ముఖ్యమంత్రి భావోద్వేగానికి గురై, చెమ్మగిల్లిన కళ్లు, కంట తడి, గధ్గద స్వరం.. అంతలోనే తేరుకొని నిప్పులు చెరిగారట. ఏపీకి అన్యాయం జరిగిందని చంద్రబాబు మొసలి కన్నీరు కార్చారని ఆయన విమర్శించారు. నిన్న అసెంబ్లీలో చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని బుగ్గన తీవ్రంగా తప్పుపట్టారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో రాజేంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 9.09.2016న అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ధన్యవాద తీర్మానంలో ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించిందనందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారని, అసెంబ్లీలో టీడీపీ సభ్యుల చప్పట్లు కొట్టారన్నారు. పోలవరానికి 100 శాతం నిధులు ఇచ్చారట, ఏపీ ప్రజల తరఫున కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీకి  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారని గుర్తు చేశారు. ఇప్పుడేమో ప్రత్యేక ప్యాకేజీపై మొసలి కన్నీరు కార్చుతున్నారని ధ్వజమెత్తారు.

ప్రత్యేక హోదా అంటే దబాయించారు
ప్రత్యేక హోదా కోసం మొట్ట మొదటి రోజు నుంచి వైయస్‌ జగన్‌ పోరాటం చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ప్రతిపక్షంపై హేళనగా మాట్లాడారని చెప్పారు. ఇవాళ చంద్రబాబు ప్రత్యేక హోదా అవసరమని మాట మార్చారని, ప్రత్యేక ప్యాకేజీ తెచ్చామని చెప్ప డం హాస్యాస్పదమన్నారు. నాడు కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అన్నారు. మళ్లీ 14వ ఆర్థిక సంఘం వద్దంటుందని చెప్పారని తెలిపారు. ఆ రోజు వైయస్‌ జగన్‌ను దబాయిస్తూ చంద్రబాబు ప్రసంగాలు చేశారన్నారు. ఈ రోజు ఆశ్చర్యకరంగా చంద్రబాబు 14వ ఆర్థిక సంఘం చెప్పడం లేదని మళ్లీ కొత్త పల్లవి అందుకున్నారన్నారు. అప్పును గ్రాంట్‌గా మార్చిందని కాగ్‌ చెప్పలేదన్నారు. కేంద్రం రూ.4 వేల లోటు బడ్జెట్‌ ఉందని చెబుతుంటే, ఏపీ ప్రభుత్వం మాత్రం రూ.16 వేల కోట్లు ఉందని చెబుతుందన్నారు. రుణమాఫీ, పింఛన్లకు సంబంధించి ఆ లోటు భర్తీ చేయాలని చంద్రబాబు కోరుతున్నారు. కేంద్రం మాత్రం విభజన సమయంలో ఉన్న లోటును మాత్రమే భర్తీ చేస్తామని చెబుతున్నారని వివరించారు. నాలుగేళ్లుగా లోటు ఎంత ఉందో తేల్చలేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తర్జనభర్జన పడుతున్నాయని విమర్శించారు. ఎన్ని సార్లు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు లడ్డులు తీసుకెళ్లి పంచిపెట్టారని, ఏ రోజు ప్రతిపక్షానికి ఆయన ఢిల్లీలో చేసిన ఘన కార్యాలు చెప్పలేదన్నారు. ప్రతిపక్షానికి ఏ కార్యక్రమంలో కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం లేదన్నారు. కేంద్రం సహాయం చేయడం లేదంటే ఎవరేం చేస్తారన్నారు. 


హైదరాబాద్‌పై బాబు గొప్పలు సరికాదు
హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశానని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం సరికాదని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ను చంద్రబాబే కట్టినట్లు గొప్పలు చెప్పడం సిగ్గుచేటు అన్నారు. హైదరాబాద్‌కు 400 ఏళ్ల చరిత్ర ఉందని, పైన ఉన్న కుతుబ్‌షా ఆత్మ క్షోభిస్తుందన్నారు. తమిళనాడులో 14 శాతం ఐటీ ఎగుమతులు ఉన్నాయని ఆ క్రెడిట్‌ కరుణానిధి తీసుకోవడం లేదన్నారు. దక్షిణభారతంలో ఇంజినీర్లు ఎక్కువగా ఉన్నారని, విదేశీయులు ఇక్కడ ఐటీ పరిశ్రమలు స్థాపించేందుకు అనుకూలంగా ఉండటంతో ఐటీ సంస్థలు వచ్చాయన్నారు. హైదరాబాద్‌లో వివిధ సంస్థలు ఉన్నాయన్నారు. చంద్రబాబు బయటకు వచ్చే సమయంలో తానుకట్టినట్లు చెప్పుకోవడం సరికాదన్నారు. 

కమీషన్ల కోసమే పోలవరం తీసుకున్నారు
రూ.16 వేల కోట్లతో పోలవరం కట్టడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. జీవో 22 ప్రకారం చంద్రబాబు ఆన్‌ గోయింగ్‌ కోసం రేట్లు పెంచారన్నారు. కేంద్రం నుంచి ల్యాండ్‌ అక్విజేషన్‌ రేట్లు మారాయన్నారు. మీకు తెలియకుండానే కేంద్రం వద్ద ఒప్పుకొని వచ్చారా అని ప్రశ్నించారు. పోలవరానికి రూ.58 వేల కోట్లు అవుతుందని ఆ నాడు మీకు తెలియదా అని చంద్రబాబును ప్రశ్నించారు. అదనపు భారం కూడా ఏపీనే భరించాలంటే ఎందుకు ఒప్పుకున్నారన్నారు. కాంట్రాక్టుల కోసమే పోలవరాన్ని చంద్రబాబు తీసుకున్నారన్నారు. ఆ రోజు మేం వద్దు అంటూ చంద్రబాబు దబాయించారన్నారు. మూడేళ్ల కోసం పట్టిసీమ నిర్మాణం చేపట్టారని విమర్శించారు.

కేసుకు భయపడి విజయవాడకు పారిపోయి రాలేదా?
చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుకు భయపడి హుటాహుటిన  హైదరాబాద్‌ నుంచి అమరావతికి పరుగెత్తుకొని వచ్చారని బుగ్గన విమర్శించారు.  ఈ రోజు చంద్రబాబు తీరు కారణంగా సగం కష్టాలు వచ్చాయన్నారు. అక్కడే ఉండి ఉంటే కేంద్రమే డబ్బులు ఇచ్చి తొందరగా పంపించేవారు అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి కేంద్రం ఎందుకు అపాయింట్‌మెంట్లు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎన్‌డీఏ భాగస్వామి అయిన వ్యక్తికి ఎందుకు అపాయింట్‌మెంట్‌ దోరకడం లేదని నిలదీశారు. పోలవరం, భూకేటాయింపులు, అవినీతి, ఓటుకు కోట్లు వంటి కేసుల కారణంగానే ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని అనుమానం వ్యక్తం చే శారు.

పొత్తులు పెట్టుకోవడంలో చంద్రబాబును మించిన వారు ఎవరూ లేరు
రాజకీయాల్లో అవసరాలకు అనుగుణంగా పొత్తులు పెట్టుకోవడంలో చంద్రబాబును మించిన వారు ఎవరూ ఉండరని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం  అని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన రాజకీయచరిత్ర అందరికి తెలిసిన విషయమే అన్నారు. ఎన్‌టీ రామారావును ఎన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన చరిత్ర అందరికి తెలుసు అన్నారు. లెప్ట్, రైట్‌ పొత్తులతో ముఖ్యమంత్రి అయిన అనుభవం చంద్రబాబుదే అన్నారు. 40 ఏళ్లలో ఎన్ని మార్పులు, చేర్పుల విషయంలో మీఅంత అనుభవం ఎవరికి ఉండదన్నారు. అన్ని రకాల పార్టీలు మారడం, పొత్తులు పెట్టుకోవడం వంటి అనుభవం ముందు ఎవరు నిలువలేరన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి కంట తడి పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు ధైర్యం ఇవ్వాల్సిన వ్యక్తి భయపెట్టడం సరికాదన్నారు. ఆ రోజు వైయస్‌ జగన్‌ ఇదే చెప్పారన్నారు. కట్టుబట్టలతో పంపించారని ఎన్ని రోజులు చెబుతారని విమర్శించారు. కేంద్రం వద్దకు ఎప్పుడు వెళ్లినా చంద్రబాబు ఒక్కరే వెళ్లడంతో అనుమానాలు ఉన్నాయన్నారు.


నిరాశకు లోనై కన్నీరు
చంద్రబాబు నిరాశ, నిస్పృహతో కంటతడిపెట్టుకున్నారని దానికి ఆయన అసమర్థతే కారణమని ఎమ్మెల్యే విమర్శించారు.  రాజధాని పేరుతో వేల ఎకరాలు తీసుకున్నారని, వాటిని ఎం చేశారని రైతులు ప్రశ్నిస్తున్నారన్నారు. లాండ్‌ఆర్డర్‌ పూర్తిగా లేకుండా పోయిందన్నారు. జన్మభూమి కమిటీల దబాయింపులకు సర్పంచ్‌లు, ఎంపీటీసీ వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. అధికారులు భయపడుతున్నారని చెప్పారు. నిరాశ, నిసృహకు లోనై ఆ డిస్పిషన్‌తో కంటతడి పెట్టి ఉంటారన్నారు. మేం 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నామని, మీకు చిత్తశుద్ధి ఉంటే మద్దతు ఇవ్వాలని, లేదంటే మీకు మేం మద్దతిస్తామన్నారు. ఢిల్లీలో వేషాలు వేసి తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు.  అవిశ్వాస తీర్మానం పెడితే మేం పక్కరాష్ట్రాల నుంచి మద్దతు తెస్తామన్న పవన్‌ కళ్యాన్‌ ఎక్కడున్నారో కనిపించడం లేదన్నారు. ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో వారికే మా మద్దతు ఇస్తామని మా నాయకులు వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారని మరోమారు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. 
 
Back to Top