తాడేపల్లి: అమరావతిపై ఇప్పటికే ప్రజల్ని నిండా ముంచుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు అమరావతి చట్టబద్ధత పేరుతో పెద్ద డ్రామా చేసిందని, ఆ పేరుతో జగన్‌గారిని తిట్టడమే చంద్రబాబు ఉద్దేశం అని వైయస్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేశారు. ప్రత్యేకంగా ఆరు గంటల పాటు సమావేశమైన అసెంబ్లీలో అదే పనిగా నిందలు వేస్తూ, జగన్‌గారిని తిట్టారన్న ఆయన, కేవలం అసెంబ్లీ తీర్మానంతో అమరావతికి చట్టబద్ధత రాదని చెప్పారు. అందుకు శాసనమండలి ఆమోదం అవసరం లేదా? అని నిలదీసిన ఆయన, ప్రజలను మభ్య పెట్టడానికి చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అవసరం లేకున్నా అమరావతిపై తీర్మానం చేశారని, దాంతో పాటు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలని.. రామాయపట్నం పోర్టు వ్యయం రీయింబర్స్ చేయాలని.. ఇవన్నీ కోరుతూ తీర్మానాలు చేయగలరా? అని పేర్ని నాని ప్రశ్నించారు. అందుకే మీ కేసుల కోసం కాకుండా, ప్రజల కోసం పని చేయాలని చంద్రబాబుకు హితవు చెప్పారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ కానే కాదని, మొత్తం అప్పులు చేస్తూ నిర్మాణాలు చేస్తూ.. అమరావతిని పూర్తిగా అప్పులకుప్పగా మార్చిన చంద్రబాబు కాంట్రాక్టుల పేరుతో అంచనాలు భారీగా పెంచి దోపిడి చేస్తున్నారని ఆక్షేపించారు. చంద్రబాబుకు అమరావతి ఒక ఏటీఎంలా మారిందని అన్నారు. ఇప్పటి వరకు రూ.21 వేల కోట్లు ఖర్చు చేసి ఏ పనులు చేశారో చెప్పాలని, ఆ నిర్మాణాలు పూర్తయ్యే సరికి మొత్తం ఎంతవుతుందో అంచనా ఉందా అని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు. ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి పేర్ని నాని ఇంకా ఏం మాట్లాడారంటే..: అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం డ్రామా: రాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ కూటమి సర్కార్ చేసిన అమరావతి తీర్మానం పెద్ద డ్రామా. ఎంత పెద్ద డ్రామా అంటే ఒక్క రోజు అసెంబ్లీ పెట్టి జగన్‌గారిని నోటి దూల తీర్చుకునే దాకా తిట్లు తిట్టి, చంద్రబాబు చేతకానితనాన్ని కప్పి పుచ్చేందుకు సుమారు 35 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, సకల శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఇలా అందరూ కలిసి ఆరు గంటల పాటు పిల్లి మొగ్గలు వేస్తూ జనం సొమ్ముతో సర్కస్ చేసిన పరిస్థితులు. చంద్రబాబు అమరావతి బాగోతం గురించి నేను కాదు, ఇంకెవరు కాదు.. సాక్షాత్తూ ఈనాడు రామోజీరావు గారి అబ్బాయి మొన్న 26వ తేదీన చాలా స్పష్టంగా రాశారు. మార్చి 28న అసెంబ్లీలో జరిగే తీర్మానం గురించి టేబుల్ ఎజెండాగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలనే అంశాన్ని తీసుకొని దాన్ని అసెంబ్లీలో ఆమోదించి, దాన్ని పార్లమెంట్‌లో చట్టసవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం అనుకుందట!. ఒక్కసారి కాగితాలు పరిశీలిస్తే అక్కడ వారికి ఏమీ కనిపించక పోవడంతో నారా చంద్రబాబు గారికి ఫోన్ చేశారట. గతంలో ఎప్పుడైనా అమరావతికి చట్టబద్ధత కల్పించేలా అధికారిక ఉత్తర్వులు ఏమైనా ఉన్నాయా? ఉంటే వెంటనే పంపించండి, మేము పార్లమెంట్‌లో ఆమోదిస్తామని కేంద్రం చెప్పిందట. కానీ ఎక్కడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పే ఒక కాగితం కానీ, ప్రభుత్వ జీవో కానీ, ముఖ్యమంత్రి లేదా కేబినెట్ తీర్మానం కానీ, సీఆర్‌డీఏ కార్యాలయంలో కూడా ఒక్క పత్రం లేదట. వెంటనే కేబినెట్ తీర్మానం చేసి పంపించమని కేంద్రం చెప్పిందట. అందుకే మార్చి 26న కేబినెట్ సమావేశం పెట్టి తీర్మానం చేశారు. అక్కడితో ఆగకుండా వెంటనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి హడావుడిగా తీర్మానం పెట్టారు. ఆరు గంటల పాటు వైఎస్ జగన్ గారిని తిట్టడం తప్ప ఇంకేమీ చేయలేదు. మరి మండలి తీర్మానం అవసరం లేదా?: అసెంబ్లీ సమావేశం, తీర్మానం అంతా డ్రామా కాబట్టే కౌన్సిల్ అవసరం లేదని స్పష్టంగా తెలుస్తోంది. చట్టాలు తెలిసిన ఎవరైనా చెప్పగలరు. అసెంబ్లీ, కౌన్సిల్ ఉన్నప్పుడు రెండింటి ఆమోదం లేకుండా తీర్మానం చట్టబద్ధం అవుతుందా? కాదు కదా?. అంటే ఇది కేవలం ప్రజల్లో డ్రామా కోసం చేసిన చర్య. అమరావతి కోసం కాదు, రైతుల కోసం కాదు, 29 వేల మంది రైతుల కోసం కాదు. భూసేకరణ కోసం నాటకం. అమరావతి తనకు సెంటిమెంట్ అని చంద్రబాబు చెబుతున్నారు. రాజధానికి తూర్పు వైపు నది ఉండటం మంచి వాస్తు అంటున్నారు. అయితే సత్తెనపల్లి వైపు వెస్ట్ సైడ్ భూసేకరణకు ఎలా వెళ్తారు? వాస్తు ప్రకారం వెస్ట్ వైపు విస్తరణ ఎలా సాధ్యం? ఓటుకు నోటు కేసు కారణంగా హైదరాబాద్ నుంచి రావాల్సి వచ్చిందని చంద్రబాబు స్వయంగా చెప్పారు. బస్సులో నిద్రపోయిన ముఖ్యమంత్రి నేనే అని చెబుతున్నారు. అయితే లింగమనేని గెస్ట్ హౌస్ ఉండగా, హోటళ్లు ఉండగా బస్సులో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?. పాపాలు మీరు చేసి నెపం జగన్‌గారిపైనా!: సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇంకా 15 ఏళ్లు తామే అధికారంలో ఉంటామని అంటున్నారు. జగన్‌ను తొక్కేశామని చంద్రబాబు అంటున్నారు. మరి ఇవాళ బిల్లు హడావిడిగా ఎందుకు పెట్టారు? ఇంకెవరు వచ్చినా అమరావతిని మార్చకుండా ఉండేందుకు తీర్మానం అంటున్నారు. అంటే రేపు మేం అధికారంలోకి వస్తామనే భయం మీకు ఉందని అర్థం. వైయస్ జగన్ రాజధాని మారుస్తారనే భావనను సృష్టించారు. కానీ మేము వదిలేశాం కదా?. అప్పుడు కూడా మేం ఎందుకు ఆలోచించామంటే.. మీరు అమరావతిలో రాజధాని అంటూ 33 వేల ఎకరాల రైతుల పొలాలు తీసుకొని, మరో 10 వేల ఎకరాల ప్రభుత్వ, దేవాదాయ భూములు కలిపి మొత్తం 53 వేల ఎకరాలు సేకరించారు. సింగపూర్‌ను తలదన్నే నగరం నిర్మిస్తామని, అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని, బుల్లెట్ ట్రైన్ తెస్తామని, ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ నిర్మిస్తామని చెప్పారు. కానీ, ఏమైంది? 2015లోనే ఈ మాటలు చెప్పారు కదా.. ఇప్పటి వరకు ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లేదు. మీపై మీకే నమ్మకం లేదు. ఎవరు మార్చకుండానే అమరావతికి చట్టసవరణ చేస్తామని అంటున్నారు. ఏపీకి వైయస్ జగన్ రాజధాని లేకుండా చేశారని, విధ్వంసం చేశారని ఆరోపించారు. ఎల్లో మీడియా మీకు వంత పాడింది. కానీ పాపమంతా మీరు చేసి, ఆ నెపాన్ని వైయస్ జగన్‌పై నెట్టింది మీరే కదా చంద్రబాబుగారు. వైయస్ జగన్‌కు బట్టకాల్చి మసి పూశారు. సెల్ఫ్ ఫైనాన్స్ కాదు. మొత్తం అప్పులకుప్ప: అమరావతిలో 29,966 మంది రైతుల వద్ద నుంచి 34,400 ఎకరాలు సేకరించి ‘సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్’ అన్నారు కదా? కానీ, వాస్తవాలు ఏమిటి?. 2014–2019 మధ్యలో రూ.5,335 కోట్లు అప్పు తెచ్చారు. హడ్కో నుంచి రూ.1,275 కోట్లు తెచ్చారు. దానికి అసలు, వడ్డీ కలిపి ఏటా రూ.106 కోట్లు చెల్లించాలి. అమరావతి పేరుతో ముంబై వెళ్లి గంట కొట్టి రూ.2 వేల కోట్ల అప్పు తెచ్చారు. పదేళ్లకు బాండ్లు తాకట్టు పెట్టి ఆ అప్పు తీసుకున్నారు. దానికి ఏటా అసలు, వడ్డీ కలిపి రూ.886 కోట్లు చెల్లించాలి. ఆరు బ్యాంకుల నుంచి రూ.2,060 కోట్లు అప్పులు ఇచ్చాయి. దానికి అసలు, వడ్డీ కింద ఏటా రూ.124 కోట్లు 14 ఏళ్ల పాటు చెల్లించాలి. మొత్తం రూ.5,335 కోట్లు 2014–2019 మధ్య అప్పులు చేశారు. ఇంకా 2024–2025లో అమరావతి పేరుతో మీరు చేసిన అప్పులు చూస్తే.. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ నుంచి రూ.5 వేల కోట్లు, నాబ్‌ఫిడ్ నుంచి రూ.7,500 కోట్లు, ఇతర ఫైనాన్స్ సంస్థల నుంచి రూ.8,887 కోట్లు.. అన్నీ కలిపి మొత్తం రూ.47,387 కోట్లు మంజూరు చేసుకుని, అందులో రూ.13 వేల కోట్లు డ్రా చేసుకున్నారు. ఈ రెండేళ్లలో ఆ డబ్బులో రూ.5,500 కోట్లు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా ఇచ్చారు. రూ.2,500 కోట్లు బిల్లులు చెల్లించారు. రూ.960 కోట్లు ఇతర అవసరాలకు మళ్లించారు. అలాంటి మీరు డైవర్షన్ గురించి, మితిమీరిన అప్పుల గురించి జగన్‌గారిని విమర్శిస్తారా? అమరావతి పేరుతో రైతులను ముంచింది, రాష్ట్ర ప్రజలను అప్పుల్లోకి నెట్టింది, మెడకు అప్పుల గుదిబండ వేసింది చంద్రబాబు కాదా? అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు, మంత్రుల అబద్ధాలు: ఇవాళ అసెంబ్లీలో 55 నిమిషాల పాటు సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు.. అమరావతి నిర్మాణం, తీసుకొచ్చిన అప్పులు తదితర అంశాల మీద ఎందుకు మాట్లాడలేదు? అమరావతిలో ఎన్ని భూములు అమ్మారు? ఎంత రాబడి వచ్చిందన్న వివరాలు ఎందుకు చెప్పలేదు? రాబడి వచ్చింది నిజమే అయితే, ఇదివరకు తెచ్చిన అప్పులకు వాటిని కట్టారా? సభలో ఇవన్నీ ఎందుకు మాట్లాడలేకపోయారు? వివిధ సంస్థలకు భూములు అమ్మగా వచ్చిన డబ్బు ఏం చేశారు? అమరావతి అప్పుల మీద మంత్రి నారాయణ చెప్పేవన్నీ అబద్ధాలే. అసలు 2025–26లో రూ.6 వేల కోట్లు దేని కింద ఖర్చు చేశారు? మేజర్ వర్క్స్ హెడ్ కింద ఖర్చు చేసింది వాస్తవం కాదా? దీన్ని దాచిపెట్టి, అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటూ అబద్ధాలు ఎందుకు చెప్తారు? ఈ ఏడాది బడ్జెట్లో రూ.6వేల కోట్లు పెట్టారు. దీని బుక్ అడ్జస్ట్‌మెంట్ అంటూ అబద్ధాలు చెప్పడం భావ్యమేనా? ప్రజలను మోసం చేయడం కాదా? చంద్రబాబు, నారాయణలకు తప్ప మరెవ్వరికీ లెక్కలు, బడ్జెట్లు రావని అనుకుంటారా? వీటన్నింటికీ మీ వద్ద సమాధానం ఉందా?: రాజధాని తొలిదశకు రూ.1 లక్ష కోట్లు కావాలి. కానీ చంద్రబాబు గత ఐదేళ్లలో ఖర్చు చేసింది రూ.5 వేల కోట్లు. అంతే కాకుండా అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు కష్టాలు కన్నీళ్లు మిగిల్చారు, తొలి దశ రాజధాని నిర్మాణం కోసం రూ.90 వేల కోట్లు అవుతుందని చెప్తున్నారు. అంటే ఏడాదికి రూ.8 వేల కోట్ల వడ్డీనే కట్టాలి. ప్రజలకు నిజాలు చెప్పే ధైర్యం ఉందా? అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ అన్నది పెద్ద మాయ. ఇప్పుడు మళ్లీ కొత్తగా భూ సమీకరణ అంటూ రైతుల్ని మోసం చేస్తున్నారు. అమరావతి గేటెడ్ కమ్యూనిటీ అని పవన్‌కళ్యాణ్ అన్నారు కదా. అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఎంత డబ్బు తెచ్చారు? నవ నగరాలు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? చంద్రబాబు, నారాయణ చెప్పగలరా? ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, బుల్లెట్ ట్రైన్ ఇవన్నీ ఎప్పుడు తెస్తారు. ఇవన్నీ సభలో చంద్రబాబు, నారాయణ ఎందుకు చెప్పలేకపోయారు? రైతుల ప్లాట్లు గజం లక్ష చేస్తామన్నారు. ఎప్పటిలోగా చేస్తారో ఏ తేదీలోగా చేస్తారో చెప్పగలరా? రైతులను భూమిమీదకు తీసుకువెళ్లి, 29 వేల మంది రైతులకు ప్లాట్లు ఎప్పుడు చూపించగలరో తేదీ చెప్పించగలరా? ఇవన్నీ చూపించే సినిమా చంద్రబాబు, లోకేష్‌లకు ఉందా? సినిమా ఉంటే.. ఆ తేదీలు ఎప్పుడో చూపండి. జగన్ సినిమా చూపిస్తాడో లేదా 2029లో జనం చెప్తారు. చంద్రబాబు దోపిడీకే అమరావతి: చంద్రబాబు దోచుకోవడానికే తప్ప అమరావతి దేనికి ఉపయోగపడుతుంది. 2015లో ఏ కాంట్రాక్టు కంపెనీలకైతే ఇచ్చాకో, వాటికే మళ్లీ కాంట్రాక్టులు ఇచ్చారు? కొత్త కంపెనీలు రాలేదు. పనులు మార్చలేదు, టెండర్లు మార్చలేదు, కేవలం పాతవాటిని రద్దుచేసి అదే కంపెనీలకు ఇచ్చారు. 2019 వరకూ చేసిన కంపెనీలకు అవే పనులు ఇచ్చారు. అన్ని వర్కులకూ, అందరికీ రమారమి 4 శాతం అదనపు రేట్లకు ఇచ్చారు. నేను తప్పు చెప్పింది తప్పని మీరు నిరూపిస్తే క్షమాపణలు చెప్తా? గతంలో అమరావతి పనుల్లో కాంట్రాక్టు కమీషన్ల నుంచి కమీషన్లు తీసుకుని, ఐటీ నోటీసులు చంద్రబాబుకు వచ్చాయి. అమరావతిలో అవినీతికి నిదర్శనం ఇది. అమరావతి చంద్రబాబుకు మరో ఏటీఎంగా మారిపోయింది. అమరావతి టెండర్లు అయిపోగానే వెంటనే టెండర్ డాక్యుమెంట్లు తీసేశారు. దేశంలో ఇంత దారుణం ఎక్కడా ఉండదు. దేశంలో ఏ నేషషనల్ హైవే పనైనా, చివరికి జమ్మూ–కశ్మీర్లో హైవేలకు సైతం కనీసం 10 శాతం తక్కువకే టెండర్లు ఇస్తారు. కానీ అమరావతిలో మాత్రం ఏ పనైనా 30 శాతం ఎక్కువకే ఇస్తారు. ఇందులో మాయేంటో చంద్రబాబే చెప్పాలి. ఇచ్చిన ప్లాట్లు కూడా చెరువులు. కుంటల్లో..!: నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు, రెండెకరాలు నుంచి రెండు లక్షల కోట్లకు అధిపతి అయిన వ్యక్తి ఇప్పటికైనా రాష్ట్ర ప్రజల్ని పీడించకుండా వదిలేయొచ్చు కదా. అమరావతిలో రైతులకు గజం లక్ష చేస్తామని చెబుతున్న చంద్రబాబు, వారికి ప్లాట్లు ఎప్పుడు అభివృద్ది చేసి ఇస్తారో చెప్పాలి. రైతులకు సొంతూళ్లనే ప్లాట్లు ఇస్తామన్న చంద్రబాబు కనీసం కాగితం మీద అయినా ఇచ్చారా? కేవలం టీడీపీ నేతలకో, నోరు ఉన్న వాళ్లకో ఇచ్చి మిగతా వాళ్లకు 10–15 కిలోమీటర్ల అవతల, చెరువులు, కుంటల్లో ప్లాట్లు ఇచ్చి మోసం చేస్తున్నారు. చంద్రబాబుకు ఐదెకరాలు ఇచ్చిన వారికి మాత్రం ఇంటి ముందు సచివాలయం, ఇంటి వెనుక హైకోర్టు, రెండువైపులా హైవే ఉండేలా ప్లాట్ ఇస్తారు. మిగతా వాళ్లకు ఇలాంటి చోట్ల ఎందుకు ప్లాట్లు రాలేదో, వారిని ఎందుకు దగా చేశారో చెప్పాలి. అమరావతిలో భూములిచ్చిన రైతులకు కౌలు కింద ఇప్పటివరకూ ఇచ్చింది రూ.2 వేల కోట్లు, అక్కడ పని చేసే పొలం లేని కూలీలకు రూ.800 కోట్లు పెన్షన్ల కింద ఇచ్చారు. వెరసి రూ.2,800 కోట్లు కౌలు, పెన్షన్ల కింద రాష్ట్ర ఖజానా నుంచి ఇచ్చారు. అమరావతి పూర్తయ్యేంత వరకూ ఇలా డబ్బులు చెల్లించాల్సిందే. రాజధానికి భూములు కొనేస్తే వేల కోట్ల ఆదా: రైతుల్ని ఏడిపించి ఇలా పూలింగ్ చేసే బదులు ఉండవల్లి నుంచి రోడ్డు వేసుకుని కృష్ణాయపాలెం దాటాక రాజధాని పెట్టుకుంటే ఈ 15 వేల ఎకరాలు, ఎకరం కోటి చొపున కొన్నా రూ.15 వేల కోట్లు ఖర్చవుతాయి. ప్రభుత్వానికి 7500 ఎకరాలు మిగులుతుంది. ఈరోజుకీ రూ.21 వేల కోట్లు చెట్లు పీకడానికో, పునాదులకో ఖర్చు పెట్టారు. అందుకే ఏకంగా రూ.13 వేల కోట్లు 20 నెలల్లో డ్రా చేసి ఖర్చు పెట్టారు. పెన్షన్లు, కౌలు కింద కూడా కలుపుకుంటే మొత్తం రూ.21 వేల కోట్లవుతోంది. దానికి బదులు రూ.15 వేల కోట్లు తెచ్చి పొలాలు కొనేస్తే, 7500 ఎకరాలు మిగిలేది, మరో నాలుగైదు వేల కోట్లు ఖర్చు పెడితే రాజధాని నిర్మాణం పూరయ్యేది. అమరావతికి న్యాయం చేసింది జగన్‌గారే: అమరావతికి వాస్తవంగా న్యాయం చేసింది జగన్‌గారే. పశ్చిమ బైపాస్‌ను తీసుకొచ్చి దారీ తెన్నూ లేకుండా ఉన్న అమరావతికి గుంటూరు, విజయవాడతో లింక్ చేసింది ఆయనే కదా. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌కు అమరావతిలో ఇప్పటికీ సొంత ఇళ్లు లేవు. మూడు ముక్కలాట ఆడాలని విమర్శలు చేస్తున్న వారు అమరావతి విలువలు పెంచేస్తే సాధారణ ప్రజలు ఇక్కడికి ఎలా వస్తారు? జన జీవనం లేని రాజధానిగా అమరావతి మిగిలిపోవాలా? పేద వాళ్లకు అమరావతిలో జగన్‌గారు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే అడ్డుకుని రద్దు చేశారు. అమరావతిలో పట్టుమని వెయ్యి మంది వచ్చే ఆఫీసు ఒక్కటైనా కడుతున్నారా? బ్యాంకుల ఆఫీసుల్లో పనిచేసే సిబ్బంది ఎంత మందో తెలియదా? అమరావతిలో 5 శాతం కంటే తక్కువ నిధులు ఖర్చు పెట్టారు. దీన్ని పూర్తిగా నిర్మించాలంటే రాష్ట్రం అప్పుల పాలవ్వాలా?. 80 ఏళ్ల వయసులో ఇలా అబద్ధాలు మాట్లాడాలా!: కాంగ్రెస్ రాష్ట్ర విభజన కోసం పార్లమెంట్‌లో తీర్మానం పెడితే జగన్‌గారు ఎక్కడున్నారో తెలియదంటున్న చంద్రబాబుకు.. ఆరోజు ప్లకార్డులతో ఆయన నిరసన తెలియచేసిన విషయం తెలియదా? (అంటూ ప్రెస్‌మీట్‌లో ఆ ఫోటో చూపారు) చివరకు, అమరావతిలో జరిగిన అగ్నిప్రమాదాలనూ మాపైకి నెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. జీతాలు ఇవ్వకపోవడంతో కాపలాదారే కాల్చాడని పోలీసులే చెప్పారు. అయినా సరే చంద్రబాబు బురదజల్లుతున్నాడు. 80 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు నీచంగా ఆలోచిస్తున్నాడు. ఈ తీర్మానాలు కూడా చేసి పంపండి: ఎలాగో అమరావతిపై రాష్ట్ర విభజన చట్టాన్ని పార్లమెంట్‌లో సవరిస్తున్నారు కాబట్టి పనిలో పనిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కూడా తీర్మానం చేయాలి. కనీసం కేబినెట్ తీర్మానం చేసి పంపినా సరిపోతుంది. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు గనుల్ని కేటాయించాలని కేబినెట్ తీర్మానం చేసి పంపాలి. కేంద్రం కట్టాల్సిన దుగ్గరాజపట్నం స్ధానంలో కట్టుకున్న రామాయపట్నం పోర్టుకు ఖర్చుపెట్టిన నిధుల్ని రీయింబర్స్ చేయమని కేంద్రాన్ని అడగండి. కేంద్రం వద్ద మీ పరపతి కేవలం మీ కేసుల కోసమే కాదు వీటి కోసం కూడా వాడండి. మొత్తం మీద ఇవన్నీ కలిపి పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయించాలని కూటమి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు.