కాకినాడ: అమరావతి చట్టబద్ధత తీర్మానం చంద్రబాబు ఆడుతున్న డ్రామా అంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. - రైతులపై మొసలి కన్నీరు: 11 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ను వదిలి వచ్చి అమరావతిని రాజధానిగా ప్రకటించిన చంద్రబాబు, ఇప్పటి వరకు భూములిచ్చిన రైతులకు ఒక్క రిటర్నబుల్ ప్లాట్ కూడా ఇవ్వలేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు గుర్తు చేశారు. రాజధాని భవనాల నిర్మాణానికి అడుగుకు రూ. 11 వేలు ఖర్చు చూపిస్తున్నారని, ఇది భారీ అవినీతి కాదా? అని ప్రశ్నించారు. కేవలం డిజైన్ల కోసమే కొత్తగా రూ. 400 కోట్లు తగలేస్తున్నారని, గతంలో ఇడ్లీ పాత్రలు, ఉప్మా గిన్నెల మాదిరి డిజైన్లు చేయించి నవ్వులపాలయ్యారని ఎద్దేవా చేశారు. - అభివృద్ధి శూన్యం - ప్రచారం అపారం: రాజధానిలో నేటికీ రోడ్లు లేవని, భూములన్నీ తుప్పలు పట్టి కనిపిస్తున్నాయని విమర్శించారు. హైపర్ లూప్, ఒలింపిక్స్ అంటూ మార్కెటింగ్ చేస్తున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. అమరావతిని 'సెల్ఫ్ ఫైనాన్స్' నగరం అని చెప్పి ఒక్క రూపాయి అయినా సమీకరించారా? అని నిలదీశారు. పేదలకు చోటు ఎక్కడ?: అమరావతి అనేది చంద్రబాబు కొంతమంది సంపన్నుల కోసమే నిర్మిస్తున్నారని విమర్శించారు. అమరావతిలో పేదలకు చోటు లేదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. వచ్చే మూడేళ్లు అమరావతి పేరుతో కట్టుకథలు చెప్పి కాలక్షేపం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ప్రజలకు మీపై నమ్మకం లేదు. రాష్ట్రాన్ని గాలికి వదిలేసి కేవలం గ్రాఫిక్స్ నగరాల కోసం పాకులాడటం మానుకోవాలని హితవు చెప్పారు. అమరావతి ప్రాంతానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యతిరేకం కాదని.. ఆ పేరుతో చంద్రబాబు చేస్తున్న దోపిడీ ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు.