దాడి కేసులో ప్రభుత్వ పెద్దల హస్తం


న్యూఢిల్లీ:  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటన వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.  వైయస్‌ జగన్‌పై గత నెల 25న విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని, కుట్ర వెనుక ఉన్న సూత్రదారులను నిగ్గు తేల్చాలని రాష్ట్రపతిని కోరామన్నారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఆయన ఢిల్లీలో మీడయాతో మాట్లాడారు. రాష్ట్రపతికి అన్ని విషయాలు వివరించామని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారన్నారు. ఈ కేసును ఏవిధంగా నీరుగార్చారన్న విషయాలను ప్రెసిడెంట్‌కు వివరించినట్లు చెప్పారు. ఒక కత్తి తీసుకొని ఎయిర్‌ పోర్టులోకి నిందితుడు ఎలా వెళ్లాడని, ఇదంతా కూడా కుట్రలో భాగమే అని, ఎయిర్‌పోర్టులో సీసీ కెమెరాలు కూడా పని చేయకపోవడంపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. అలాంటి వ్యక్తి ఎయిర్‌పోర్టులో పని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నో అబ్జెక్సన్‌ సర్టిఫికెట్‌ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌ను హతమార్చేందుకు రాష్ట్రంలోని కొందరు శక్తుల హస్తం ఉందని రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో మాకు న్యాయం జరగడం లేదని, సీఎం, డీజీపీ మాట్లాడుతున్న తీరుపై అనుమానాలు ఉన్నాయని రాష్ట్రపతికి వివరించినట్లు చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని రాష్ట్రపతిని కోరినట్లు చెప్పారు. కోర్టులో మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. హైకోర్టు ఇవాళ ప్రతివాదులకు నోటీసులు ఇవ్వడం మంచి పరిణామమన్నారు. 
Back to Top