అగ్రిగోల్డు బాధితులకు అండగా జనవరి 3న ధర్నాలు

–అగ్రిగోల్డు బాధితులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుంది
– విశాఖలో అగ్రిగోల్డు బాధితుల బాసట కమిటీ సమావేశం
విశాఖ: అగ్రిగోల్డు బాధితులకు అండగా వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో జనవరి 3వ తేదీన అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వైయస్‌ఆర్‌సీపీ అగ్రిగోల్డు బాధితుల బాసట కమిటీ చైర్మన్‌ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. శనివారం అగ్రిగోల్డు బాధితుల బాసట కమిటీ ఉత్తరాంధ్ర జిల్లాల సమావేశం విశాఖలో నిర్వహించారు. సమావేశం అనంతరం బాధితుల బాసట కమిటీ చైర్మన్‌ లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ రోజు నాలుగు జిల్లాలకు సంబంధించిన కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేశామన్నారు. అగ్రిగోల్డు బాధితులకు న్యాయం చేయాలని నిన్న విజయవాడలో నిరాహార దీక్ష చేపట్టామన్నారు. ప్రభుత్వం ఆందోళన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు అరెస్టులు చేసిందన్నారు. అగ్రిగోల్డు బాధితుల సమస్యలు పరిష్కరించకుండా, అగ్రిగోల్డు ఆస్తులను దోచుకునేందుకు కుట్రలు చేస్తుందన్నారు. ఈ దోపిడీని వైయస్‌ఆర్‌సీపీ అడ్డుకుంటుందన్నారు. ఇప్పటికే వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టామని గుర్తు చేశారు. ఆందోళనలో భాగంగా జనవరి 3వ తేదీన అన్ని జిల్లాల్లో ధర్నా కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. అప్పటికీ స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. 

 
Back to Top