ఆదుకోకపోగా.. ఆస్తులు కాజేస్తారా..?

రహస్యభేటీలతో చంద్రబాబు చీకటి ఒప్పందాలు
జీఎస్సెల్‌ కంపెనీ ఎందుకు వెనక్కు తగ్గిందో సమాధానం చెప్పాలి
కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెట్టే విధానం సిగ్గుచేటు
బాధితుల పక్షాన జిల్లా వ్యాప్తంగా పోరాటాలకు సిద్ధం
అగ్రిగోల్డ్‌ బాధితులతో వైయసార్‌ సీపీ బాసట కమిటీ సమావేశం
పలు అంశాలపై తీర్మానం, 18వ తేదీన మరో సమావేశం
విజయవాడ: ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోకపోగా.. ఆస్తులను కాజేందుకు కుట్రలు చేస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ చైర్మన్‌ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. రహస్య భేటీలతో చీకటి ఒప్పందాలు చేసుకొని అగ్రిగోల్డ్‌ ఆస్తులను అప్పనంగా నొక్కేయాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అగ్రిగోల్డ్‌ బాధితులు, సంఘాలతో లేళ్ల అప్పిరెడ్డి, బొత్స సత్యనారాయణ, పార్థసారధిలు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 3వ తేదీన చంద్రబాబు ఢిల్లీలో రహస్యంగా అమర్‌సింగ్, అగ్రిగోల్డ్‌ ఆస్తులు విక్రయించేందుకు వచ్చిన జీఎస్సెల్‌ కంపెనీ ఎండీ సుభాష్‌చంద్రతో చీకటి ఒప్పందం చేసుకున్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం ఆస్తులకంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయని జీఎస్సెల్‌ కంపెనీ కోర్టును ఆశ్రయించిందన్నారు. బాధితు పక్షాన పోరాడాల్సిన ప్రభుత్వం.. కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెట్టే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. 

ఢిల్లీలో చంద్రబాబు చేసిన రహస్య ఒప్పందాలపై బొత్స సత్యనారాయణ ప్రశ్నిస్తే ఇవాల్టికి చంద్రబాబు సమాధానం చెప్పకపోవడం దుర్మార్గమని లేళ్ల అప్పిరెడ్డి దుయ్యబట్టారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న కుటుంబరావు టీడీపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ సమావేశం జరిగిందని.. బాధితులంతా ప్రభుత్వంపై నమ్మకం లేదని చెబుతున్నారన్నారు. రూ. 50 వేల లోపు ఉన్న బాధితులందరికీ ప్రభుత్వం వెంటనే డబ్బులు అందించాలని, మిగిలిన వారికీ ఎప్పుడు ఇస్తారో గడువు చెప్పే విధంగా తీర్మానం చేశామన్నారు. కర్ణాటక ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ బాధితుల జాబితా.. ఆస్తుల విలువల జాబితాను విడుదల చేస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అందుకనే వీటన్నింటిపై బాసట కమిటీ 18వ తేదీన మరో సమావేశం జరుగుతుందని, చర్చకు వచ్చిన అంశాలన్నీ వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అవసరమైతే జిల్లా స్థాయిల్లో ఉద్యమం చేయడానికి కార్యచరణ రూపొందిస్తామన్నారు. బాధితులు ఎవరూ అధైర్యపడొద్దని, అందరికీ న్యాయం జరిగేలా పోరాటం చేస్తామన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలల్లో రూ. 50 వేల లోపు ఉన్నవారందరికీ డబ్బులు చెల్లిస్తామని, మిగిలిన వారికి గడువులోపు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. 
 
Back to Top