వేతనం పెంచాలంటే తాట తీస్తావా..?

ఇదేనా చంద్రబాబూ బీసీలపై నీకున్న ప్రేమ
నాయీ బ్రాహ్మణులపై చంద్రబాబు తీరు దారుణం
సీఎంపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి
విజయవాడ: సీఎం చంద్రబాబు బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని, ఓటు బ్యాంక్‌గానే ఉపయోగించుకుంటున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ మండిపడ్డారు. నాయీ బ్రాహ్మణుల పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. విజయవాడలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జోగి రమేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు బీసీలంటే చులకన, మత్స్యకారుల విషయంలో కూడా చంద్రబాబు ఇలాగే వ్యవహరించారన్నారు. ఎన్నికల సమయంలో బీసీలు టీడీపీకి పట్టుకొమ్మలని మాట్లాడిన చంద్రబాబు అధికార మదంతో తాట తీస్తా.. తోటు తీస్తానని దారుణంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను ఎన్నికల్లో పావుగా వాడుకొని ఇప్పుడు తరమికొడతావా..? చంద్రబాబూ అని ప్రశ్నించారు. 

కనీసం వేతన చట్టం ఉందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తెలియకపోవడం దారుణంగా ఉందని జోగి రమేష్‌ అన్నారు. వేతనాలు పెంచాలని అమరావతి సచివాలయం వద్ద నాయీ బ్రాహ్మణులు ఆందోళన చేస్తే వారిని కించపరిచే విధంగా వ్యవహరించారని మండిపడ్డారు. సీఎం స్థాయిని చంద్రబాబు దిగజార్చారన్నారు. ఎన్నికల్లో మీరిచ్చిన వాగ్ధానాలు అమలు చేయమని అడగటం తప్పా..? మా బీసీలపై మీ ప్రతాపం ఏంటి చంద్రబాబు..? అని నిలదీశారు. నాయీ బ్రాహ్మణులను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడిన చంద్రబాబుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దేశ చరిత్రలో ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని, వచ్చే ఎన్నికల్లో బీసీలంతా చంద్రబాబుకు చుక్కలు చూపిస్తామన్నారు. 
Back to Top