ప్రజలను మభ్యపెట్టడమే చంద్రబాబు అభిమతం

వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య
బాబ్లీ ప్రాజెక్టుకు 2010లో వైయస్‌ఆర్‌ మద్దతు పలికారనడం విడ్డూరం
2010లో వైయస్‌ఆర్‌ ఉన్నారా..? మతిభ్రమించిందా బాబూ?
బాబు విశ్రాంతి తీసుకోకుండా దోపిడీ కోసం పనిచేస్తున్నాడు
రెండెకరాల భూమితో రూ.2 లక్షల కోట్లకు ఎలా ఎదిగావు
అగ్రిగోల్డ్‌ బాధితులను రోడ్డున పడేసిన దుర్మార్గుడు 
ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వం వైయస్‌ జగన్‌ది
జననేతను సీఎం చేసేందుకు ప్రజలంతా ఎదురుచూస్తున్నారు
విజయవాడ: ఎక్కడ అవకాశం దొరికినా.. ఏ సభ అయినా సందర్భం ఉన్నా,, లేకపోయినా మాయమాట చెప్పి ప్రజలను మభ్యపెట్టడమే చంద్రబాబు అభిమతమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. జలహారతి అనే పేరుతో శ్రీశైలంలో హారతి ఇస్తూ, విజయనగరం జిల్లా తోటపల్లి కాల్వ వద్ద హారతులు ఇస్తూ చంద్రబాబు మాట్లాడిన మాటలు వింటుంటే ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాబ్లీ ప్రాజెక్టు గురించి పోరాటం చేస్తుంటే దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టుకు మద్దతు తెలిపారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 2010లో వైయస్‌ఆర్‌ ఏంటీ.. బాబ్లీ ప్రాజెక్టు ఏంటీ చంద్రబాబూ.. మతిభ్రమించి మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదన్నారు. తోటపల్లి ప్రాజెక్టును రాత్రులు పడుకొని పూర్తి చేశానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. 89 శాతం పనులు గత ప్రభుత్వం పూర్తి చేస్తే 11 శాతం పనుల పూర్తికి అతీగతి లేదన్నారు. పిల్ల కాల్వలు, ఎడమ కాల్వ పనులు ప్రారంభించలేదన్నారు. చంద్రబాబు మాట్లాడేవన్నీ అన్ని అబద్ధాలు.. మోసం, దగా చంద్రబాబు ఇంటిపేరని విమర్శించారు. 

జనవరిలో ముందస్తు ఎన్నికలు రావొచ్చు.. లేకపోతే ఎప్పటిమాదిరిగానే పార్టీని సమాయత్తం చేసుకోవాలని సమావేశంలో వైయస్‌ జగన్‌ చెబితే ఈయనకు ఎలా తెలుసని చంద్రబాబు ప్రశ్నించడం సిగ్గుచేటన్నారు. పార్టీ బలోపేతం కోసం వైయస్‌ జగన్‌ నాయకులతో సమావేశమైతే చంద్రబాబుకు ఏం నొప్పో అర్థం కావడం లేదన్నారు. ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబుకు ఎలా తెలిసిందని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి వస్తాయని పచ్చమీడియా ఎంత ఊకదంపుడు కథనాలు ప్రసారం చేసిందని నిలదీశారు. 

చంద్రబాబు చేస్తున్న కార్యక్రమాలు అప్రజాస్వామికమని, ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొచ్చి అధికార పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెట్టడం దేశ చరిత్రలో ఇదే ప్రధమమన్నారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.. వారిపై చర్య తీసుకోండి వెంటనే అసెంబ్లీకి వస్తామని చెప్పినా పట్టించుకోకుండా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబు పాదయాత్ర చేసిన సమయంలో అసెంబ్లీ నుంచి జీతభత్యాలు తీసుకోలేదా.. నీకో చట్టం ఎదుటివారికి ఒక చట్టమా అని ప్రశ్నించారు. నువ్వు ఏం మనిషివి చంద్రబాబూ.. ఏం చెప్పినా ప్రజలంతా నమ్ముతారనుకుంటే పొరబాటన్నారు. 

విశ్రాంతి తీసుకోకుండా రాష్ట్ర శ్రేయస్సు కోసం కష్టపడుతున్నానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. విశ్రాంతి తీసుకోకుండా ఏ విధంగా చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రతీ అంశంలో అవినీతి ఉంటేనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. చంద్రబాబు చేపట్టిన ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. పోలవరం, పట్టిసీమ పేరుతో ఏ విధంగా దోచుకున్నారో తెలుసన్నారు. చంద్రబాబు కుమారుడు లోకేష్‌ ఏ విధంగా ప్రభుత్వ భూములు ఇతరులకు కేటాయిస్తున్నారో అన్ని తెలుసని చెప్పారు. పైపెచ్చు నంగనాచిలా ఉద్దరిస్తున్నానని చెబితే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. ప్రజలంతా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. ఎప్పుడు బాబును దించేద్దామా అని ఎదురు చూస్తున్నారన్నారు.  రెండెకరాల భూమి ఉన్న రూ. 2 లక్షల కోట్లకు ఎలా ఎదిగారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసులను ఎందుకు ధైర్యంగా ఎదుర్కోక స్టేలు తెచ్చుకొని పబ్బం గడుపుతున్నారని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లలో అనేక అవినీతి కార్యక్రమాలు, ఆరోపణలు తెరమీదకు వచ్చినా వాటిపై ఎంక్వైరీలు వేశారా..? మీ చేతుల్లో ఉన్న సంస్థలతో చేపించుకున్న ఎంక్వైరీలో నివేదికలను బయటపెట్టారా..? అని నిలదీశారు. 

16 లక్షల మందికి సంబంధించిన అగ్రిగోల్డ్‌ సమస్యను పరిష్కరించకుండా ప్రజల జీవితాలతో చంద్రబాబు ఆడుకుంటున్నాడని బొత్స మండిపడ్డారు. జీఎస్‌ఎల్‌ సంస్థ వచ్చి అగ్రిగోల్డ్‌ ఆస్తులు కొనేందుకు ముందుకు వస్తే ఢిల్లీలోని ఆంధ్రభవన్‌లో నిందితులను పక్కనకూర్చొబెట్టుకొని బేరసారాలు చేసింది అందరికీ తెలుసన్నారు. ఏం అనుభవం ఉందని వైయస్‌జగన్‌కు ఓటేయాలని చంద్రబాబు అడుగుతున్నాడని, చంద్రబాబు అనుభవం, తత్వం రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య అని, సొంత కుటుంబ సభ్యులు అయినా, పిల్లనిచ్చిన మామ అయినా, బయటివారైనా వెన్నుపోటు ఒక్కటే చంద్రబాబుకు తెలిసిన విద్య అన్నారు. కానీ వైయస్‌ జగన్‌ మాట ఇస్తే తప్పే మనిషి కాదని చెప్పారు. ఏ కష్టం వచ్చినా ముందుంటాడని, అందుకే ప్రజలంతా వైయస్‌ జగన్‌కు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. స్వతహాగా ఒక్క కార్యక్రమైనా చేశావా చంద్రబాబూ అని బొత్స ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని మాట్లాడుతున్న చంద్రబాబు మరి నీకు ఓటేస్తే సోనియాగాంధీకి వేసినట్లేనా.. చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

కోర్టు నోటీసులు ఇస్తే తప్పేంటి చంద్రబాబూ.. న్యాయస్థానాల్లో స్నేహితులు, బంధువులు ఉన్నారు కదా.. మేనేజ్‌ చేయడంలో దిట్టకదా.. ఎందుకు రాజకీయ లబ్ధి కోసం ప్రజలను మభ్యపెడుతున్నారని బొత్స ప్రశ్నించారు. హుద్‌హుద్‌ తుఫాన్‌ సమయంలో సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకోవాలని చెప్పారని, అదే సిద్ధాంతాన్ని అనుసరిస్తూ కోర్టు నోటీసులను అవకాశంగా మల్చుకుంటున్నాడన్నారు. చంద్రబాబు ప్రవచనాలు చెబుతుంటే ప్రజలు విని భజనలు చేసి పూజించాలంట. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే వైయస్‌ఆర్‌లా మహాపురుషులు అవుతారన్నారు. ఐదు సంవత్సరాల పాలనలో ప్రపంచ మొత్తం మీద అలాంటి పథకాలు లేవని స్థితి తీసుకొచ్చిన మహానుభావుడు వైయస్‌ఆర్‌ అని గుర్తు చేశారు. శ్రీశైలం నేనే కట్టాను.. బ్రిటీష్‌వారితో పోరాడాను.. అలెగ్జండర్‌ను రాష్ట్రపతిని చేశాను.. తోటపల్లి దగ్గర రాత్రుళ్లు పడుకున్నానని చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రజలంతా మాయమాటలు, మోసపూరిత వాగ్దానాలు నమ్మి మరోసారి మోసపోవద్దు.. వ్యవస్థలను కాపాడుకుందాం.. ప్రభుత్వం అంటే అండగా ఉండే ప్రభుత్వం.. వైయస్‌ఆర్‌ సిద్ధాంతాలతో నిర్మాణమైన వైయస్‌ఆర్‌సీపీని, వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమర్ధించమని కోరారు. 
Back to Top