వైయస్‌ జగన్‌ రాకతో జనసంద్రమైన దుర్గమ్మ వారధి

ఇంతటి అభిమానం నా జీవితంలో చూడలేదు
ప్రజల ఆదరణతో మాపై బాధ్యత పెరిగింది
అంబేద్కర్‌ జయంతిని చంద్రబాబు మరోరోజు చేస్తామని విడ్డూరం
మహానుభావులను కించపరిచే విధంగా మాట్లాడతారా..?

విజయవాడ: దుర్గమ్మ వారధి మొత్తం జనసంద్రంతో నిండిపోయిందని, 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి ప్రజాధరణ, అభిమానం ఎప్పుడూ చూడలేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కనీవిని ఎరుగని రీతిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు ఘనస్వాగతం పలికారన్నారు. ప్రజల సంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో 33 రోజుల పాటు పాటు 12 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసిన వైయస్‌ జగన్‌ శనివారం ఉదయం కృష్ణా జిల్లాలోకి ప్రవేశించారు. ప్రజల అభిమానంతో ఇంకా మాపై బాధ్యత పెరిగిందని, కృష్ణ జిల్లా వాసుల ఆదరాభిమానాలు ఇలాంగే ఉండాలని బొత్స ఆకాంక్షించారు. కృష్ణా జిల్లాలో వైయస్‌ జగన్‌కు స్వాగతం పలికిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

మహోన్నత వ్యక్తి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన వ్యక్తి సింగపూర్‌ ఎందుకు వెళ్లారో చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. అంబేద్కర్‌ జయంతిని మరో రోజు నిర్వహిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ ఆలోచన, అహంకారం ఏ విధంగా ఉందో ప్రజలు ఆలోచించాలన్నారు. మహానుభావులను ఏ విధంగా కించపరుస్తున్నాడో.. చంద్రబాబు లాంటి వ్యక్తులతో ప్రజాస్వామ్య మనుగడకే ముప్పు వస్తుందన్నారు. పూలే జయంతిన ముఖ్యమంత్రి వస్తే తప్ప ఎవరూ నివాళులర్పించవద్దనే ఆంక్ష విధించారన్నారు. ప్రభుత్వ కార్యక్రమం చేస్తున్నప్పుడు దాంట్లో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలన్నారు. కానీ చంద్రబాబు తన సొంత కార్యక్రమంగా 12 గంటల వరకు అందరినీ ఎండలో నిల్చోబెట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. 
 
భారత రాజ్యాంగ ప్రదాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి రోజున ప్రభుత్వం ఒక ప్రతిజ్ఞ చేయాలని బొత్స సత్యనారాయణ సూచించారు. ఇప్పటికైనా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని, రాజ్యాంగ పరిధిలోనే కార్యక్రమాలు చేస్తామని, అసెంబ్లీలో చేసిన అకృత్యాలు, అనైతిక చర్యలు పక్కనబెట్టి నైతికంగా మెలిగే పరిస్థితులు తీసుకొస్తామని టీడీపీ ప్రతిజ్ఞ చేయాలన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర అభివృద్ధి కోసం, అన్ని వర్గాల శ్రేయస్సు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. 

Back to Top