వర్ష ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల పర్యటనదెబ్బతిన్న పంటల పరిశీలన, బాధితులకు పరామర్శ
ఏపీలో గత ఐదు,ఆరు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లా సహా పలు ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. వేల ఎకరాల్లో పంట నీటమునిగింది. ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. తుఫాన్ తో ప్రజలంతా తిండితిప్పలు లేక అల్లాడుతుంటే చంద్రబాబు వారి వంక చూసిన పాపాన పోవడం లేదు. సొంత కార్యక్రమాల కోసం చిత్తూరు వరకు వెళ్లిన చంద్రబాబు...వర్షాలతో ప్రజలు అవస్థలు పడుతున్నా అవేమీ పట్టనట్టు తిరిగి వచ్చేశాడు.
ముందస్తు చర్యలు చేపట్టడంలోనూ, బాధితులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ నేతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి, బాధితులను పరామర్శిస్తున్నారు. ఆహార పదార్థాలు, సరుకులు అందజేస్తున్నారు. తుఫాన్ కారణంగా ఉన్నదంతా తూడ్చుకుపెట్టుకుపోవడంతో, ఆందోళన చెందుతున్న బాధితుల్లో భరోసా నింపేందుకు... వైఎస్ జగన్ సోమ, మంగళ వారాల్లో వర్ష ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
వైఎస్సార్ జిల్లా రాజంపేటలో వైఎస్సార్సీపీ నాయకులు వరద ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మండలంలోని ముకుందారిగడ్డలో వరద నీటిలో చిక్కుకున్న బాధితులను పరామర్శించి సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్ నాథ్ రెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరులో ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో బాధితులకు ఆహారపొట్లాలు అందజేశారు. చిత్తూరులో ఎమ్మెల్యే నారాయణ స్వామి ఆధ్వర్యంలో నాయకులు వరద ప్రాంతాల్లో పర్యటించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నర్సాపురం మండలంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంట దెబ్బతిన్న రైతులకు తక్షణమే నష్ట పరిహారం ఇవ్వాలని కొత్తపల్లి డిమాండ్ చేశారు. రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.