ఉల్లి రైతుల కన్నీరు పట్టదా బాబూ?


 
 అమ‌రావ‌తి: ఉల్లి రైతుల క‌న్నీరు ప్ర‌భుత్వానికి ప‌ట్ట‌దా అని వైయ‌స్ఆర్‌సీపీ రైతు విభాగం అధ్య‌క్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ప్ర‌శ్నించారు. ఉల్లి రైతుల ఇబ్బందుల‌పై ఆయ‌న ప్ర‌భుత్వానికి బ‌హిరంగ లేఖ రాశారు. లేఖ పూర్తి పాఠం ఇలా..

ఖరీఫ్‌లో తొలుత మార్కెట్‌లోకి వచ్చే పంటలలో ఉల్లి ప్రధానమైనది. రాష్ట్రంలో అతి కొద్ది ఏరియాలో  సాగయ్యే పంట ఇది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రంలో ఉల్లి పంట సాధారణ సాగు 27 వేల హెక్టార్లు అయితే ఇందులో సాగైంది కేవలం 21,103 హెక్టార్లు మాత్రమే. వరిసాగుకు కృష్ణా–గోదావరి డెల్టా ప్రాంతం ఎలా ప్రసిద్ధో.. కర్నూలు జిల్లా ఉల్లిసాగుకు పేరు. ఉల్లి సాగు రాష్ట్రం మొత్తంమీద 21,103 హెక్టార్లలో జరిగితే, ఒక్క కర్నూలు జిల్లాలోనే 18,459 హెక్టార్లు సాగైంది. మిగతాది కడప జిల్లాలో 1442 హెక్టార్లు, అనంతపురం జిల్లాలో 982 హెక్టార్లు సాగు జరిగింది.  

గత మూడేళ్ళుగా రాయలసీమలో వర్షాభావం వల్ల ఉల్లిసాగు గణనీయంగా పడిపోయింది. సాగు తగ్గితే ధర పెరగాల్సిందిపోయి ధర కుప్పకూలిపోయింది. ధరల పతనంతో కుదేలైన ఉల్లి రైతులు కర్నూలులో ముఖ్యమంత్రికి నిరసన తెలియజెప్పేందుకు ప్రయత్నిస్తూ.. నిర్దాక్షిణ్యంగా రైతులపై లాఠీచార్జ్‌ చేయించారు. కేసులు పెట్టారు. ఉల్లి పంటకు ధరలేక అయినకాడికి అమ్ముకుంటే, అప్పులు తీర్చలేక బాబూరావు అనే రైతు వారం రోజుల క్రితం(ఆగస్టు 25న)కర్నూలు మార్కెట్‌ యార్డులోనే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఇదే జిల్లాలో రైతుల ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతుంటే, జిల్లా అంతా కరవుతో అల్లాడుతుంటే 54 మండలాలకు గాను కేవలం 37మండలాలనే కరవు మండలాలుగా ప్రకటించటం ఎంతవరకు న్యాయం?. ఒకవైపు రాష్ట్రంలో ఉల్లి సాగు తగ్గినా.. ఉల్లి ధర కిలో రూ.5కి కుప్పకూలిపోయినా చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదు? మరోవైపు రైతు బజార్లలోనే కిలో ఉల్లి ధర రూ.17 ఉంటే, బహిరంగ మార్కెట్‌లో దాని ధర రూ. 22పైనే అమ్ముడవుతోంది. ఒక్క రైతుకే ఎందుకు నష్టం జరుగుతోంది? టిడిపి మేనిఫెస్టోలో పెట్టిన రూ. 5 వేల కోట్ల ధరల స్ధిరీకరణ నిధి మాట దేవుడెరుగు... ఇటీవల క్యాబినెట్‌లో ప్రకటించిన రూ. 500 కోట్లు కూడా విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం జల్సాలకు, సోకులకు పెట్టే ఖర్చులో ఒక్క శాతం కేటాయించినా ఉల్లి రైతులను ఆదుకోవచ్చు. 

ఒకవైపు వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధిరేటు సుకుపోతుందంటారు.. మరోవైపు మొత్తం 13 జిల్లాల్లో 6 జిల్లాలు తీవ్ర కరువుతో అల్లాడుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. ఇంకోవైపు రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. రైతు కంట కన్నీరు ఆగలేదు. రైతును కన్నీరు పెట్టించిన ప్రభుత్వాలేవీ బాగు పడినట్టు చరిత్రలో లేదు. రైతును కన్నీరు పెట్టిస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం కూడా రైతు కన్నీటిలో కొట్టుకుపోవడం ఖాయం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతులకు లాభసాటి ధర ఇచ్చి ఉల్లి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాల‌ని డిమాండు చేస్తున్నాం.


Back to Top