వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకంజన్మభూమి కమిటీల పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారుమహానేత వైయస్‌ఆర్ పాలన వైయస్ జగన్‌తోనే సాధ్యంనెల్లూరు: వచ్చే సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకమని, ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పరిపాలన రావాలంటే ఆయన తనయుడు, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలన్నారు. నెల్లూరు జిల్లా కొవ్వూరులో జరిగిన నియోజకవర్గస్థాయి బూత్ కమిటీ సమావేశానికి మేకపాటి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో బూత్ కమిటీలు చాలా కీలకమన్నారు. పార్టీ పటిష్టతకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. దివంగత మహానేత వైయస్‌ఆర్ చేపట్టిన ఫీజురీయంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వంటి ఎన్నో పథకాలు పేద ప్రజలకు మేలు చేశాయన్నారు. అలాంటి పరిపాలన మళ్లీ వైయస్ జగన్ వల్లే సాధ్యమవుతుందన్నారు. టీడీపీ పాలనలో ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా పోయిందన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలను పక్కకునెట్టి జన్మభూమి కమిటీలతో చంద్రబాబు పరిపాలన చేయిస్తున్నాడని మండిపడ్డారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన 67 మంది ఎమ్మెల్యేల్లో చంద్రబాబు 23 మంది రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ కొనుగోలు చేశారని ధ్వజమెత్తారు. కోట్లు వెచ్చించి కొనడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారన్నారు. అంతే కాకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని, రానున్న ఎన్నికల్లో ప్రజలు వైయస్‌ఆర్ సీపీని అఖండ మెజార్టీతో గెలిపిస్తారన్నారు.