ప్రతి పంచాయతీపై జెండా ఎగరాలి

హనుమకొండ (వరంగల్) 03 జూలై 2013: పంచాయతీ ఎన్నికల సదస్సులో పార్టీ కార్యకర్తలను కలుసుకోవడానికి వచ్చానని శ్రీమతి విజయమ్మ చెప్పారు. వరంగల్ పట్టణంలోని అభిరామ్ గార్డెన్సులో ఏర్పాటుచేసిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ప్రసంగించారు. పంచాయతీ ఎన్నికలకు మన సార్టీ సంసిద్ధంగా ఉందన్నారు. రాజశేఖరరెడ్డిగారి రాజకీయ ఉన్నతికి కార్యకర్తలే కారణమని చెప్పారు. ఆయన కార్యకర్తలకు ఎంతో విలువనిచ్చేవారని చెప్పారు. కార్యకర్తలకు తమ కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. రెండేళ్ళ క్రితమే పుట్టిన మన పార్టీని పటిష్ట పరుచుకోవడానికి ఈ ఎన్నికలు ఒక మహదవకాశమని పేర్కొన్నారు. ఇవి కార్యకర్తలకు అవకాశం కల్పించే ఎన్నికలన్నారు. మీరే సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్ పి టీసీలుగా ఎన్నికవచ్చని చెప్పారు. మీకు ఎన్నికలలో పార్టీ అండగా నిలుస్తుందన్నారు. ఐకమత్యంతో సాగి.. ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎన్నికలు నిర్వహించకుండా ఇంతవరకూ స్థానిక ఎన్నికలపై కాలయాపన చేసిందన్నారు. సకాలంలో ఎన్నికలు జరిగుంటే గ్రామాలలో సమస్యలు ఉండేవి కావన్నారు. ప్రత్యేక అధికారులు ప్రజలకు జవాబుదారిగా ఉండరనీ, ప్రజా ప్రతినిధులే వారికి జవాబుదారీగా ఉంటారని శ్రీమతి విజయమ్మ తెలిపారు.

గ్రామాల్లో సమస్యల కుప్పలు
సకాలంలో ఎన్నికలు జరగకపోవడంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయనీ, నిధులు మురిగిపోయాయనీ చెప్పారు. రాజన్న పంచాయతీలకు నిధులు విడుదల చేసి, కావాల్సిన విధులను కూడా కేటాయించారన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులకు చెక్ పవర్ ఇవ్వడమే కాక, ప్రొటోకాల్ కూడా కల్పించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం, రాజశేఖరరెడ్డిగారినీ, జగన్మోహన్ రెడ్డిగారినీ అప్రతిష్ట పాలుచేసే విధంగా కాంగ్రెస్, టీడీపీలు వ్వవహరిస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై స్పందించి నాయకులుగా ఎదగాలని ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాజన్న ముఖ్యమంత్రిగా ఉండగా అధికారుల దగ్గరినుంచి మంత్రుల వరకూ అందరూ అందుబాటులో ఉండేవారన్నారు. ప్రస్తుతం భరోసా ఇచ్చే నాయకులే లేరని ఆవేదన వ్యక్తంచేశారు. వైయస్ఆర్ రాజకీయ జీవితంలో 25 సంవత్సరాలు అధికారంలోనే లేరన్నారు. ఉన్న ఐదేళ్ళ మూణ్ణెలలో ఆయన వ్యవసాయ రంగానికి ఉపయోగపడే పథకాలపై దృష్టి సారించారని తెలిపారు.

తెలంగాణ వాదాన్ని రాజన్న గౌరవించారు
రాజన్న తెలంగాణ వాదాన్ని గౌరవించారన్నారు. తెలంగాణ వెనుకబాటు తనాన్ని ఆయన గుర్తించారు. అన్ని వర్గాల సమగ్రాభివృద్దికి ఆయన ఎంతో కృషి చేశారు. జిల్లాకో విశ్వవిద్యాలయం, మెదక్ జిల్లాలో ఐఐటీ ఏర్పాటుచేశారన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఐటీ కంపెనీలకు అవకాశం కల్పించి సాఫ్టువేర్ పరిశ్రమకు ఊపు తెచ్చారన్నారు. జయంతి ఘోష్ కమిటీ సిఫార్సులను రైతాంగానికి అమలుచేశారన్నారు. బీటీ విత్తనాల ధరను సుప్రీం కోర్టుకు వెళ్లి తగ్గేలా చేశారన్నారు. వ్యవసాయ రంగానికి దివంగత మహానేత ఏ విధంగా పాటుపడిందీ కూలంకషంగా వివరించారు.

రాజన్న పథకాలు వరంగల్ జిల్లాలో ఎక్కడివక్కడే..
వరంగల్ జిల్లాలో దేవాదుల ప్రాజెక్టు చేపడుతున్నట్టు చంద్రబాబు నాటకమాడారన్నారు. అదే దివంగత మహానేత జలయజ్ఙంలో ప్రాజెక్టును చేపట్టి పూర్తిచేస్తానని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం 843కోట్ల రూపాయల ఖర్చుతో దేవాదుల ప్రాజెక్టును ప్రారంభించారని చెప్పారు. దుర్భిక్ష ప్రాంతాలైన వరంగల్, మెదక్, తదితర ఎగువప్రాంతాలకు ఏటూరునాగారంలోని గోదావరి ప్రాంతంనుంచి దాదాపు 130 కిలోమీటర్ల మేర పైపు లైను ఏర్పాటుచేసి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలించడానికి మొదలుపెట్టిన పనులు రెండేళ్ళ క్రితం పూర్తయ్యాయని చెప్పారు. రాజన్న అనుకున్న ప్రకారం లక్షా 24 వేల ఎకరాలకు నీరు అందించాల్సి ఉందన్నారు. ఆయననుకున్న ప్రకారం ఈపాటికి ఆ పనులు పూర్తికావాల్సి ఉందన్నారు. భూమి సాగులోకి వచ్చేది. నలబై వేల ఎకరాలకు నీరందించేందుకు అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ అందుకు తగిన పరిస్థితులు లేవన్నారు. పూర్తయినా ప్రాజెక్టులనుంచైనా నీరందించాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వంలో కనిపించడం లేదని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. దేవాదుల రెండో దశలో 1887 కోట్లతో మొదలైనప్పటికీ పూర్తికాలేదన్నారు. మూడో దశ 3356 కోట్లతో ప్రారంభమైంది కానీ పూర్తి కాలేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. నిధులను ప్రభుత్వం కేటాయించకపోవడమే దీనికి కారణమని ఆమె ఆరోపించారు. దేవాదుల ఎత్తిపోతలు ప్రారంభం కావాలంటే కంకణపల్లి వద్ద రిజర్వాయరు నిర్మించాల్సి ఉందన్నారు. నీటిని నిల్వ చేయకపోతే పైపు లైన్లకు నీరొచ్చే అవకాశమే లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆమె విమర్శలు గుప్పించారు. రాజన్న పాలనకు ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య తేడాను గణాంకాలతో వివరించారు. భూపంపిణీని ఇందుకు ప్రధాన ఉదాహరణగా చూపారు. పరిశ్రమలకు రాజన్న ఇచ్చిన ప్రోత్సాహాన్ని వివరించారు. ఇప్పటిదాకా మిన్నకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వివిధ పథకాలను ప్రకటించడం, ఉద్యోగ ప్రకటనలు ఇవ్వడం చేస్తోందని శ్రీమతి విజయమ్మ మండిపడ్డారు.

చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు
చంద్రబాబు మీద వ్యంగ్యాస్తాలు విసిరారు. ఆయన 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో చేసిన పనులన్నింటినీ తూర్పారబట్టారు. అసెంబ్లీలో మాట్లాడ్డానికి కూడా ఎన్టీ రామారావుకు అవకాశమివ్వలేదంటే చంద్రబాబు వైఖరిని అర్థం చేసుకోవచ్చన్నారు. ఏ ఎండాకాగొడుగు పట్టడం ఆయన నైజమన్నారు. అధికార, ప్రతిపక్షాలు కలిసి పనిచేయడం కేవలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే చూస్తున్నామన్నారు. ఎఫ్.డి.ఐ. ల బిల్లుపై తన ఎంపీలను గైర్హాజరయ్యేలా చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒడ్డున పడేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడేం చేయాలో కూడా బాబు చెబుతున్నారని చెప్పారు. అవిశ్వాసం తీర్మానంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన ఎమ్మెల్యేలనే అనర్హులుగా ప్రకటించారనీ, మిగిలిన వారిపై చర్య తీసుకోలేదనీ ఆమె తెలిపారు. శాసన సభలో సభ్యుల సంఖ్య తగ్గించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టుకొస్తోందన్నారు.

బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని పెట్టాలనే విషయం తొమ్మిదేళ్ళ తర్వాత గుర్తొచ్చిందా అని చంద్రబాబును శ్రీమతి విజయమ్మ నిలదీశారు. పదేళ్ళ తర్వాత రాజశేఖరరెడ్డిగారి సంక్షేమ పథకాలు గుర్తుకొచ్చి వాటిని మరింత సమర్థంగా అమలుచేస్తాననడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుటుంబంపై వస్తున్న ఆరోపణల గురించి ఆమె సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. అవన్నీ అభూత కల్పనలని కొట్టిపారేశారు. సీబీఐ వైఖరి, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కుమ్మక్కు కుట్రల గురించి తెలియజేశారు. తమ కుటుంబం గురించి ఎందుకిలా మాట్లాడుతున్నారని ప్రశించారు.

Back to Top