శరద్‌యాదవ్‌తో వైయస్‌ జగన్‌ భేటీ

న్యూ ఢిల్లీ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో శరద్‌యాదవ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అనైతిక చర్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వైయస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మంత్రివర్గంలోకి వైయస్‌ఆర్‌సీపీ గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన విషయంపై మిగతా పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లినట్లుగానే శరద్‌యాదవ్‌కు కూడా వివరించామన్నారు. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి, ఆ పార్టీకి రాజీనామా చేయకుండా, ఎమ్మెల్యే పదవుల నుంచి డిష్‌క్వాలిఫై కాకుండా ఏకంగా మంత్రి పదవుల్లో వాళ్లను కూర్చోబెట్టడం అనైతికమన్నారు. ఇలాంటి అప్రజాస్వామికమైన చర్యలను అందరం కలిసి అడ్డుకోలేకపోతే రేపు ఇదే అంశం అన్ని రాష్ట్రాల్లో పునరావృతమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపడుతుందని శరద్‌ యాదవ్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా మద్దతిస్తామని హామీ ఇచ్చినట్లు వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వైయస్‌ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, వరప్రసాదరావు, ఎమ్మెల్యే కోన రఘుపతి ఉన్నారు.
 
Back to Top