వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ఢిల్లీ పర్యటన సక్సెస్

బాబు అవినీతిపై కేంద్రం దృష్టి
రాష్ర్టపతి, మంత్రులతో జగన్మోహన్రెడ్డి వరుస భేటీలు
ప్రత్యేక హోదాపైనా ప్రథమపౌరుడికి నివేదన
విభజన హామీలపై ఆర్థిక మంత్రికి అభ్యర్థన
పెండింగ్ ప్రాజెక్టులపై రైల్వే మంత్రికి వినతి
 
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హస్తిన పర్యటన విజయవంతంగా పూర్తయింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేకి ముడుపులు ఎరచూపించి ప్రలోభపెట్టాలని చూసి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ కుట్రలు, కుయుక్తులు, అవినీతిపై దేశం దృష్టిపడేలా చేయడంలో జగన్మోహన్రెడ్డి సక్సెస్ అయ్యారు. బాధ్యత గలిగిన ప్రతిపక్ష నాయకునిగా ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ చేస్తున్న నీతిబాహ్యమైన చర్యలను ప్రపంచానికి ఎత్తిచూపడంలో జగన్మోహన్రెడ్డి విజయవంతమయ్యారు. జగన్ తన పర్యటనలో భాగంగా ప్రథమపౌరుడైన రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీని , కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్ను, ఆర్థికమంత్రి అరుణ్జైట్లీని, రైల్వే మంత్రి సురేష్ప్రభును కలసి తెలుగుదేశం పార్టీ సాగిస్తున్న అవినీతి పాలన గురించి వివరించారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కూరుకుపోయిన విషయాన్ని కూలంకషంగా వివరించారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చూడాలని కూడా రాష్ర్టపతికి జగన్ విజ్ఞప్తి చేశారు. రైల్వే మంత్రిని కలుసుకుని ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. చంద్రబాబు అవినీతి వ్యవహారాలను గురించి కూడా సురేష్ ప్రభుకు జగన్ వివరించారు.
 
ప్రథమ పౌరుడి దృష్టికి బాబు అవినీతి
చంద్రబాబు నాయుడు, ఆయన సహచరులు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎలాంటి అవినీతి చర్యలకు పాల్పడ్డారో వివరిస్తూ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీకి జగన్మోహన్రెడ్డి సవివరమైన వినతిపత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది పాలనలో ఎన్ని రకాల కుంభకోణాలకు పాల్పడ్డారో అందులో వివరించారు. ఆంధ్రప్రదేశ్లో అవినీతి అత్యున్నత స్థాయిలో నిరాటంకంగా కొనసాగుతోందని, అలా అవినీతితో సంపాదించిన డబ్బును తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోలు కోసం వినియోగించారని రాష్ర్టపతికి ఆయన వివరించారు. నామినేటెడ్ ఎమ్మెల్యేకి డబ్బులిస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డారని, ఈ వ్యవహారం తమ బాస్ చంద్రబాబు సూచనల మేరకే చేస్తున్నానని పదేపదే చెప్పడం వీడియో టేపుల్లో రికార్డయిందని జగన్ రాష్ర్టపతికి వివరించారు. అంతేకాదు నామినేటెడ్ ఎమ్మెల్యేతో చంద్రబాబు నేరుగా మాట్లాడిన ఆడియో టేపులు కూడా వెలుగులోకి వచ్చాయని ప్రణబ్కు జగన్ తెలిపారు. ముఖ్యమంత్రి పదవి గౌరవాన్ని దిగజార్చిన చంద్రబాబును ఈ కేసులో ఏ-1గా చేర్చాలని, లంచం ఇవ్వజూపిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో దర్యాప్తు సంస్థలు నిగ్గు తేల్చాలని జగన్ డిమాండ్ చేశారు. జగన్ చెప్పిన విషయాలన్నీ ఓపిగ్గా విన్న ప్రణబ్ ముఖర్జీ ఆయన డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు.
 
ప్రత్యేక హోదాకై అలుపెరుగని పోరు
ప్రత్యేక హోదాపై ఎన్నికల ముందు ఎన్నో కబుర్లు చెప్పిన చంద్రబాబు పీఠమెక్కగానే ఆ విషయాన్ని పక్కనపెట్టేశారు. ఏదో మొక్కుబడిగా ఆ విషయం చూడండి అంటూ కేంద్రానికి లేఖలు రాయడం తప్ప గట్టిగా వత్తిడి చేసిందే లేదు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం జగన్మోహన్రెడ్డి అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారు. ప్రత్యేక హోదా కల్పించి ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నిలదొక్కుకునేలా చూడాలని రాష్ర్టపతికి జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని విభజించేటపుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన కోరారు. ఐదేళ్లపాటు స్పెషల్కేటగిరీ స్టేటస్ వర్తింపజేస్తామని రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ హామీ ఇచ్చారని, దానిని అమలు చేయాలని నాటి ప్రభుత్వం ప్రణాళికాసంఘాన్ని కూడా ఆదేశించిందని జగన్ గుర్తు చేశారు. అపాయింటెడ్ డే నుంచి 14వ ఆర్థికసంఘం సిఫార్సులు అందేవరకు రెవెన్యూలోటును భర్తీ చేసేందుకు వీలుగా 2014-15 సాధారణ బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని చట్టంలో హామీ ఇచ్చారని, అయితే కొత్త రాష్ర్టం సమస్యలను తీర్చడం కోసం వాస్తవిక రెవెన్యూలోటును రీయింబర్స్ చేయాలని జగన్ కోరారు. మరిన్ని జిల్లాలకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీని విస్తరించాలని, పోలవరం జాతీయ ప్రాజెక్టును మూడేళ్లలో కేంద్రమే పూర్తిచేయాలని, భూసేకరణకు సంబంధించి రాష్ర్టప్రభుత్వాన్ని కట్టడి చేయాలని, పన్ను ప్రోత్సాహాలను మొత్తం రాష్ట్రానికి వర్తించేలా చూడాలని జగన్ విజ్ఞప్తి చేశారు.
 
పెండింగ్ ప్రాజెక్టులపై రైల్వేమంత్రిపై వత్తిడి
విభజన చట్టం హామీలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని పెండింగ్ ప్రాజెక్టులన్నిటినీ పూర్తి చేయాల్సిందిగా రైల్వేమంత్రి సురేష్ ప్రభును జగన్మోహన్రెడ్డి కోరారు. 2014 బడ్జెట్ నాటి హామీలు కూడా అమలు కాని విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. విజయవాడ - ఢిల్లీ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ - నిజాముద్దీన్ ఏసీ ఎక్స్ప్రెస్, కాజీపేట - ముంబై వీక్లీ ఎక్స్ప్రెస్లను ప్రకటించినా పట్టాలెక్కలేదని వివరించారు.  రెండు రాష్ట్రాలలో మొత్తం 29 ప్రాజెక్టులు ప్రస్తుతం అమలు దశలో ఉన్నాయని 2014-15 బడ్జెట్లో ప్రస్తావించినా వాటిపైనా ఇంతవరకు ఎలాంటి చర్యలూ లేవని సురేష్ప్రభుకు జగన్మోహన్రెడ్డి వివరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి ఏపీ ఎక్స్ప్రెస్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నా ఇంతవరకు దాన్ని ప్రకటించలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. నాలుగు ఫ్రైట్ కారిడార్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారని, అయితే అవి ఎక్కడ ఏర్పాటు చేస్తారో చెప్పలేదని రైల్వే మంత్రికి జగన్ వివరించారు. బెంగళూరు - కడప రైల్వేలైన్ లింక్కు సరిపడినన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 
 
జగన్మోహన్రెడ్డి ప్రశ్నలకు బదులెక్కడ? 
ఢిల్లీ పర్యటన సందర్భంగా రాష్ర్టపతిని, ఇతర మంత్రులను కలుసుకుని చంద్రబాబు అవినీతి గురించి తూర్పార బట్టిన జగన్మోహన్రెడ్డి తన పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాటిని మీడియా విస్తృతంగా కవర్ చేసింది. వాటిలో కొన్ని...
  • సాక్షాత్తూ ముఖ్యమంత్రి వివిధ కుంభకోణాల్లో తీసుకున్న లంచాలను మళ్లీ ఇంకొక చోట లంచంగా ఇస్తూ వందల కోట్లు ఉన్న ఇలాంటి వ్యవహారంలో పట్టుబడితే ఎందుకు కేసు పెట్టడం లేదు?
  • ఆంధ్రప్రదేశ్లో అవినీతికి పాల్పడిన డబ్బుతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనాలనుకున్నారు. వీటికి సంబంధించిన ఆడియో వీడియో టేపులు ఇప్పటికే బయటకు వచ్చాయి. చంద్రబాబును ఏ-1 ముద్దాయిగా ఎందుకు చేర్చడం లేదు?
  • చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి వదిలేయడం ఎంతవరకు ధర్మం? అదే సామాన్యుడు చేసుంటే ఇదే మాదిరిగా వదిలిపెట్టేవారా? సామాన్యుడికి ఒక న్యాయం.. ముఖ్యమంత్రికి ఒక న్యాయమా? ఇదెక్కడి ధర్మం?
  • ఒక ముఖ్యమంత్రి లంచాలు తీసుకుని లంచాలు ఇస్తూ పట్టుబడిన తర్వాత ఈ వాదనలెందుకు? ముందు చంద్రబాబును జైల్లో పెట్టండి. దొంగలు ఎక్కడ ఉండాలో ఆయనను కూడా అక్కడ ఉంచాలి.
  • ప్రతిపక్ష నేతగా రాష్ర్టంలో జరుగుతున్న అవినీతిపై, చంద్రబాబు అక్రమాలపై ప్రశ్నించే హక్కు నాకు ఉంది.
  • నాపై ఆరోపణలు వచ్చిన సమయంలో నేను సీఎం, ఎంపీ, చివరకు ఎమ్మెల్యేగా కూడా నేను. సచివాలయంలో ఎన్నడూ అడుగుపెట్టలేదు. ఏ అధికారికీ ఫోన్లు చేయలేదు. అయినా నాపై వచ్చిన ఆరోపణలను ధైర్యంగా ఎదుర్కొన్నా...
  • రాష్ర్టంలో చంద్రబాబు నాయుడు ఏ రకంగా టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడో, వాస్తవాలను పక్కదోవ పట్టిస్తున్నాడో హోం మంత్రికి వివరించాం. 
  • రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన చంద్రబాబును జైలుకు పంపాల్సిందే. కేంద్ర ప్రభుత్వంపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. అవినీతి సీఎంను కాపాడుతుందని భావించడం లేదు. కేంద్రం తగురీతిలో స్పందిస్తుందనే ఆశిస్తున్నా.
Back to Top