వైయస్సార్ జిల్లాలో బ్రహ్మరథం

ఏసీసీ బాధిత రైతుల న్యాయమైన కోర్కెలను సాధించుకోవడానికి వైయస్సార్‌సీపీ ముందువరుసలో నిలిచి పోరాటం చేస్తుందని ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. వైయస్సార్ జిల్లా మైలవరం మండలం వద్దిరాల, గొల్లపల్లె, ఉప్పలపాడు తదితర గ్రామాలకు చెందిన రైతులు స్థానిక వైయస్సార్‌సీపీ నాయకుడు రామాంజనేయులుయాదవ్‌ నేతృత్వంలో ముద్దనూరు వద్ద కలిశారు. 1996లో సిమెంటు ఫ్యాక్టరీ నిర్మిస్తామంటూ ఏసీసీ యాజమాన్యం తమ ప్రాంతంలో 2700 ఎకరాల పంటపొలాలను కొనుగోలు చేసిందని వివరించారు. ఇప్పటివరకూ కనీసం పునాదిరాయి కూడా వేయలేదని వారు చెప్పారు.

జిల్లా ప్రజలు జననేతకు ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా రైతుల సమస్యలను ఓపిగ్గా ఆలకించిన ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ పాలకుల బెదిరింపులకు భయపడాల్సిన పనిలేదన్నారు. అప్పట్లో భారతి సిమెంటు ఎకరాకు రూ.2లక్షలు అదనపు పరిహారం చెల్లించిందని, ఇప్పటి ధరల ప్రకారం ఏసీసీ యాజమాన్యం ఎకరాకు రూ.4లక్షలు చెల్లించవచ్చని ఆయన సూచించారు. ఈనెల 20వ తేదీన గొల్లపల్లె వద్ద రైతులు చేపట్టనున్న ధర్నాకు వైఎస్సార్‌సీపీ తరుపున కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఇన్‌ఛార్జి సుధీర్‌రెడ్డిలు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. 

నాలుగురోడ్ల కూడలి చేరుకోగానే ఓపెన్‌ టాప్‌ వాహనంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు సమన్వయకర్త డాక్టర్‌ సుధీర్‌రెడ్డిలతో ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఆర్యవైశ్యుల ఆహ్వానం మేరకు  వైఎస్‌ జగన్‌ ముందుగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారిశాలకు సమీపంలోనే ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి పాల్గొన్నారు.


తరలివచ్చిన జమ్మలమడుగు నేతలు..
వైఎస్‌ కుటుంబానికి ద్రోహం తలపెట్టి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అండగా తామున్నామంటూ నియోజకవర్గవ్యాప్తంగా నాయకులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు తరలివచ్చారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి భారీగా వైఎస్సార్‌సీపీ అభిమానులు , నాయకులు వచ్చారు. మీకు అండగా మేమున్నామంటూనే, వైఎస్సార్‌ మా గుండెల్లో ఉన్నారు, అవకాశవాదులకు బుద్ధి చెబుతామంటూ పలువురు నినాదాలు చేశారు.


ప్రొద్దుటూరు ఉత్సవాలకు హాజరు
 మైసూరు తర్వాత ఆ స్థాయిలో దసరా ఉత్సవాలు నిర్వహించే ప్రొద్దుటూరులో ఆర్యవైశ్యుల ఆహ్వానం మేరకు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రాత్రి దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. అమ్మవారికి, సమీపంలో ఉన్న చెన్నకేశవస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు  వైఎస్‌ జగన్‌ హాజరవుతున్న విషయం తెలుసుకొని పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.  ఈ సందర్భంగా విపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు, ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిలను ఉత్సవ కమిటీ సన్మానించింది. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు పట్టణ ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రామ్మోహన్‌రావు, ఆంధ్రప్రదేశ్‌ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఉదయం పులివెందుల మండలం వెంకటాపురంలో ఇటీవల వృతి చెందిన తిమ్మనాయుడు కుటుంబసభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. అలాగే వేముల మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు సత్యప్రభావతమ్మ కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో పులివెందులలో ఆయన ఇంటికి వెళ్లి ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.


Back to Top