చంద్రబాబు మొద్దు నిద్ర..సహాయక చర్యల్లో విఫలం..ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలం..వరద బాధితులను ఆదుకోవడంలోవిఫలం..
హైదరాబాద్: వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కుండపోత వర్షాలతో ప్రజలంతా అల్లాడుతూంటే చంద్రబాబుకు చీమకుట్టినట్టైనా లేదని మండిపడ్డారు. నాలుగు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలు అతలా కుతలమయ్యాయన్నారు. ఇంతవరకు ప్రభుత్వం వాళ్లను ఆదుకున్న పాపాన పోవడం లేదన్నారు. సొంత కార్యక్రమాల కోసం చిత్తూరు వెళ్లిన చంద్రబాబుకు...వరద బీభత్సం కనిపించలేదా అని బొత్స ప్రశ్నించారు. సోమ, మంగళవారాల్లో వైఎస్ జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ..బాధితులకు భరోసా ఇస్తారని బొత్స చెప్పారు.
చంద్రబాబుకు ఎంతసేపు ఎలా దోచుకుందామన్న ధ్యాసే తప్ప..ప్రజల బాధలే పట్టడం లేదన్నారు. భారీ వర్షాలతో రాష్ట్రమంతా కొట్టుకుపోతుంటే ఆప్రాంతాలకు వెళ్లకుండా చంద్రబాబు చోద్యం చూస్తున్నాడని బొత్స నిప్పులు చెరిగారు. తుఫాన్ ముందస్తు చర్యలు చేపట్టడంలోనూ, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయమే లేదని మండిపడ్డారు.
కరువు మండలాల ప్రకటనలోనూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బొత్స ఫైరయ్యారు. కరువు జాబితా తమ వద్దకు రాలేదని స్వయంగా కేంద్రవ్యవసాయ శాఖ మంత్రి చెప్పేదాకా...ప్రభుత్వం మొద్దునిద్రపోతున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. చంద్రబాబుకు వ్యవసాయమన్నా, రైతులన్నా ద్వేషం, కక్ష ఎందుకని బొత్స నిలదీశారు.
ఏపీలో నెలకొన్న దుర్భర పరిస్థితుల గురించి...హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బొత్స వివరించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నాయకులతో పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటికే మాట్లాడారని, బాధిత ప్రాంతాల్లో ప్రజలను ఆదుకోవాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారని తెలిపారు. కుండపోత వర్షాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని ...వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.