గుండె తరుక్కుపోతోంది– అమరావతి ప్రజల బాధ వింటుంటే గుండె తరుక్కుపోతుంది
– అమరావతి రైతులను చంద్రబాబు నిండా ముంచారు
– అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు
– పేదలకు తోడుగా ఉండాలనే ఆలోచన చంద్రబాబుకు లేదు
– వైయస్‌ఆర్‌ పాలనలో పసుపు క్వింటాల్‌ రూ.16 వేలు
– స్మార్ట్‌ సిటీ దేవుడెరుగు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కూడా లేదు
– ఆనంద నగరాల పేరిట రూ.52 కోట్లు ఖర్చు చేస్తున్నారు
– నాలుగేళ్లలో చంద్రబాబు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు
– రాష్ట్రంలో 40 లక్షల ఉద్యోగాలు మీకు కనిపించాయా?
– బీసీలపై నిజమైన ప్రేమ చూపింది మహానేత ఒక్కరే
– లోక్‌సభలో ఆ నాడు ఓటు వేసి చంద్రబాబు రాష్ట్రాన్ని విడగొట్టారు
– ప్రత్యేక హోదా ఎండమావి అయ్యిందంటే చంద్రబాబే కారణం
– 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసి ఉంటే మోడీ దిగివచ్చేవారు
– మీ పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివించే బాధ్యత నాదే
– హాస్టల్‌ చార్జీలకు రూ.20 వేలు
– మీ చిట్టి పిల్లలను బడికి పంపిస్తే తల్లికి రూ.15 వేలు


గుంటూరు: అమరావతి ప్రజల బాధ వింటుంటే గుండె తరుక్కుపోతోందని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో అన్ని వర్గాలను చంద్రబాబు నిండా ముంచారని ఆయన మండిపడ్డారు. కార్పొరేటర్‌కు ఉన్న ఇంగితజ్ఞానం కూడా చంద్రబాబుకు లేదని విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ౖÐð యస్‌ జగన్‌ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే.. 

ఎండలు తీక్షణంగా ఉన్న వేలాది మంది నాతో పాటు అడుగులో అడుగులు వేస్తున్నారు. ఒకవైపు వాళ్లకున్న కష్టాలు చెబుతున్నారు..అర్జీలు ఇస్తున్నారు. మరోవైపు నా భుజాన్ని తడుతూ అన్నా..నీ వెంటే మేమంతా అని చెబుతున్నారు. ఏ ఒక్కరికి ఈ ఎండలో నాతో నడవాల్సిన అవసరంలేదు. నడిరోడ్డుపై  ఇలా నిలబడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నాపై ప్రేమానురాగాలు చూపుతున్నారు. ఆత్మీయతలు పంచుతున్నారు. మీ అందరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు.

– రాజధాని ప్రాంతంలో అడుగులు వేస్తున్నప్పుడు ఇక్కడి ప్రజలు నా వద్దకు వచ్చి చెప్పుకుంటున్న బాధలు వింటుంటే గుండెలు తరుక్కుపోయాయి. నా వద్దకు ఒక మున్సిపల్‌ కార్పొరేటర్‌ వచ్చి అన్నా..చంద్రబాబు హ్యాపీ సిటీ అంటూ మూడు రోజుల పాటు ఒక కార్యక్రమం చేపడుతున్నారన్నా..ఆ కార్యక్రమానికి రూ.52 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నా అని కార్పొరేటర్‌ చెబుతున్నారు. ఒకవైపు డబ్బులు లేవంటున్నారు. మరోవైపు కాన్సల్టెన్సీలకు కోట్లు కట్టబెట్టి లంచాలు తీసుకుంటున్నారు.  చంద్రబాబు తన నాలుగేళ్ల పాలనలో చేసిన మోసాలను కట్టబెట్టేందుకు బయట నుంచి నలుగురిని తీసుకొని వచ్చి వారికి కోట్లు కట్టబెట్టి ప్రజలను మభ్యపెట్టారు. ఆ కార్పొరేటర్‌కు ఉన్న బుద్ధి కూడా సీఎంకు లేకపోవడం బా«ధనిపించింది. 
– ఇదే చంద్రబాబు పాలన గురించి ఇక్కడి రైతులు చెబుతున్నారు. మాకు  ఇష్టం లేకపోయినా భూములు తీసుకున్నారు. ఇవాళ ఒక్కసారి మా బతుకులు చూడమని రైతులు వాపోతుంటే బాధనిపించింది. అసైన్డ్‌ భూములు కొల్పొయిన దళితులు నావద్దకు వచ్చి అన్నా..చంద్రబాబుకు అసైన్డ్‌భూములపై పెత్తనం ఏంటన్నా అంటున్నారు. ఆయనకు భూములు తీసుకునే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. అన్నా..లంక భూములకు ప్యాకేజీ రాదని, ల్యాండ్‌ ఫూలింగ్‌లో తీసుకుంటున్నారని పద్ధతి ప్రకారం చెప్పి.. ఆ తరువాత లంక భూములు టీడీపీ నేతలు ఎకరాకు రూ.15 వేలకు తీసుకున్నారని, ఆ తరువాత వాటికి కూడా ప్యాకేజీ తీసుకున్నారని ఆ బాధిత రైతులు చెబుతుంటే బాధనిపించింది.
– ఇదే ప్రాంతానికి చెందిన రైతులు నా వద్దకు వచ్చి అన్నా..ఆ రోజు భూములు తీసుకునే సమయంలో మా పిల్లలను కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదివిస్తామన్నారు. ఇవాళ మా పిల్లలను బస్సు ఎక్కించాలంటే బాధగా ఉందన్నా..అంటున్నారు.
– అన్నా..ఉచితంగా వైద్యమన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి అన్నారు. వృద్ధాశ్రమాలు అన్నారు. వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు అన్నా అని ఆ పేదవాడు బాధపడుతుంటే బాధనిపించింది. 
– ఇక్కడ ఎకరా రూ.5 కోట్లు ఉంటే..ప్రభుత్వం మాత్రం ఇక్కడ రోడ్లు వేయడం లేదన్నా అని చెబుతున్నారు. మా భూములు తీసుకుని ముష్టి వేసినట్లు వెయ్యి గజాలు ఇస్తున్నారన్నా అని వాపోతున్నారు.
 – అన్నా..పక్కనే సీఎం క్యాంపు ఆఫీస్‌ ఉంది. ముఖ్యమంత్రి అంటే ప్రజల ఆస్తులు కాపాడేవాడా? దోచుకునే వాడా?అంటుంటే బాధనిపించింది. ముఖ్యమంత్రి కళ్ల ఎదుటే పెనుమాక, వెంకటపాలెం, ఉద్దండరాయపాలెం ఇలా అన్ని గ్రామాల్లో ఇసుక రీచ్‌ల్లో నుంచి వేల లారీల్లో ఇసుక తరలిస్తున్నారన్నారు. ఇసుక మాఫియాకు డాన్‌ ఎవరన్నా అంటున్నారు. ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. పెద్దబాబు, చిన్నబాబు వరకు లంచాలు తీసుకుంటున్నారు. 
– పసుపు రైతులు నా వద్దకు వచ్చారు. అన్నా పసుపు రేటు రూ.5600 క్వింటాల్‌ పలుకుతోంది. నాడు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో రూ.16 వేలకు అమ్ముకున్నామని చెబుతున్నారు. మార్కెట్‌యార్డుల్లో దళారుల రాజ్యం సాగుతుందని చెబుతున్నారు. 
– పక్కానే కృష్ణా నది వెళ్తున్నా..మంగళగిరి, తాడేపల్లిలో తాగడానికి నీరు కరువైందని చెబుతుంటే బాధనిపించింది. స్మార్ట్‌సిటీ, క్యాపిటల్‌సిటీ అంటున్నారు. మాకు మాత్రం అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ లేదని చెబుతుంటే సిగ్గనిపిస్తోంది.
– ఎన్నికలప్పుడు ఇదే చంద్రబాబు ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం ఇస్తామని ఊదరగొట్టారు. ఇవాళ వాళ్లందరు నా వద్దకు వచ్చి అడుగుతున్నారు. అన్నా..నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కూడా ఈ దుర్మార్గుడు ఇవ్వడం లేదన్నా అని నా వద్దకు వచ్చి అంటుంటే బాధనిపిస్తోంది.
– మీ ప్రాంతంలో మీకున్న సమస్యలపై చెప్పాను. రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనను ఒక్కసారి చూడండి. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని చంద్రబాబే చెబుతున్నారు. ఏడాదిలో జరుగబోయే ఆ ఎన్నికల్లో ఎలాంటి నాయకుడు కావాలి?మోసాలు చేసేవాడు నాయకుడు కావాలా? అబద్ధాలు చెప్పేవాడు నాయకుడు కావాలా? 
– చంద్రబాబు నాలుగేళ్ల పాలనను గమనించమని  కోరుతున్నాను. చదువుకుంటున్న పిల్లలను కూడా మోసం చేసేందుకు చంద్రబాబు వెనుకడుగు వేయలేదు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఏస్థాయిలోకి మోసం పోయిందంటే..ఈ పెద్ద మనిషి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఇక్కడ ఉద్యోగాలు రాక పిల్లలు హైదరాబాద్, బెంగుళూరుకు వెళ్తున్నారు. ఈ పెద్ద మనిషి విశాఖలో మీటింగ్‌ పెట్టి రూ.20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని అబద్ధాలు చెబుతున్నారు. అంతోఇంతో ఉద్యోగాలు వచ్చే మార్గం ఉందంటే అది ఒక్క ప్రత్యేక హోదా మాత్రమే.
– రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో చంద్రబాబు సమన్యాయమని రెండుగా చేశారు. అప్పుడు ఏపీకి 15 ఏళ్లు ప్రత్యేక హోదా తెస్తామని ఎన్నికల్లో చెప్పారు. సీఎం స్థాయిలో కేంద్రాన్ని అడిగి ఉంటే ఎప్పుడో ప్రత్యేక హోదా వచ్చేది. హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణం.
– ప్రత్యేక హోదాపై చంద్రబాబు చేసిన  అన్యాయాన్ని గమనించమని కోరుతున్నాను. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఢిల్లీలో మన ఎంపీలు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఈ పెద్ద మనిషికి చిత్తశుద్ది ఉంటే టీడీపీ ఎంపీలతో కూడా రాజీనామా చేయించి ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉంటే దేశం మొత్తం చర్చనీయాంశంగా మారేది. నరేంద్ర మోడీ దిగివచ్చి ప్రత్యేక హోదా ఇచ్చేవారు కాదా?
– చంద్రబాబు తీరు చూస్తే నాకు ఒ కటి గుర్తుకు వస్తుంది. యుద్ధానికి ఒక సైనికుడు తుపాకి పట్టుకుని వెళ్లాడట. యుద్ధం తీవ్రంగా జరుగుతున్నప్పుడు ట్రిగ్గర్‌ నొక్కారట. అప్పుడు తుపాకి పేలలేదు. సమయానికి ట్రిగర్‌ పేలి ఉంటే యుద్ధంలో గెలిచేవారు కాదా? చంద్రబాబు హోదా కోసం సమయానికి స్పందించి ఉంటే హోదా వచ్చి ఉండేది కాదా?
– రేపు పొద్దున చంద్రబాబు మీ వద్దకు వచ్చి చిన్న చిన్న అబద్ధాలకు నమ్మరని ఆయనకు తెలుసు. అందుకే పెద్ద పెద్ద అబద్దాలు చెబుతారు. రేపు పొద్దున ఇదే చంద్రబాబు మీ వద్దకు వచ్చి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానని చెబుతారు. నమ్ముతారా అన్నా..? నమ్మరని ఆయనకు తెలుసు..కేజీ బంగారానికి బోనస్‌ అంటారు. ప్రతి ఇంటికి బెంజీ కారు కొనిస్తా అంటారు. నమ్మరు కాబట్టి ప్రతి ఇంటికి మనిషిని పంపించి ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతారు. డబ్బిస్తే మాత్రం వద్దు అనకండి..రూ.5 వేలు కావాలని గుంజండి. అదంతా మనదే.. మనజేబుల్లో నుంచి దోచేసిన సొమ్మే. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయమని అందరికి కోరుతున్నాను. అబద్ధాలు చెప్పేవారిని, మోసం చేసే వారిని బంగాళఖాతంలో కలిపే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడే ఈ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీకి అర్థం వస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన వ్యవస్థ బాగుపడుతుంది.
– రేపు పొద్దున ఇటువంటి దుర్మార్గపు పాలన పోయి..మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రబుత్వం అధికారంలోకి వచ్చాకా..నవరత్నాలు ప్రకటించాం. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వులు చూడాలని నవరత్నాలు ప్రకటించాం. ఇందులో ఏవైనా సలహాలు, సూచనలు ఇవ్వండి. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పిల్లల చదువుల కోసం మనం ఏం చేయబోతున్నామో నవరత్నాల్లో చెబుతున్నాను.
– ఇవాళ మీ అందరు గుండెలపై చేతులు వేసుకొని మన పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివించే స్థితిలో ఉన్నామా ఆలోచన చేయండి. చంద్రబాబు దృష్టిలో బీసీలపై ప్రేమ అంటే నాలుగు కత్తెర్లు..ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడమే. పేదవారిపై నిజమైన ప్రేమ చూపింది దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మాత్రమే అని గర్వంగా చెబుతున్నాను. పేదవారు అప్పుల పాలు అయ్యేది పిల్లలను చదివించేందుకు, వైద్యం కోసమే. ఇలాంటి పరిస్థితి రాకుండదని పేదవారికి తోడుగా నిలబడి భరోసా ఇచ్చారు. ఏం చదువుకుంటావో చదువుకో నేను చదివిస్తానని వైయస్‌ రాజశేఖరరెడ్డి తోడుగా నిలబడ్డారు. మహానేత మన మధ్య నుంచి వెళ్లిపోయాక కథ మొదటికి వచ్చింది. ఇవాళ మన పిల్లలను ఉన్నత చదువులు చదివించే పరిస్థితి లేదు. ఇవాళ ఇంజినీరింగ్‌ ఫీజులు లక్షల్లో ఉన్నాయి. చంద్రబాబు ముష్టి వేసినట్లు రూ.35 వేలు మాత్రమే ఇస్తున్నారు. ఆ పేద వాడు మిగిలిన డబ్బుల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. ఆ పేదవాడు ఇల్లు, పొలాలు అమ్ముకుంటే తప్ప పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితి లేదు. నెల్లూరులో నేను పాదయాత్ర చేస్తుంటే నా వద్దకు తల్లిదండ్రులు వచ్చారు. నా వద్దకు వచ్చి బోరున ఏడ్చారు. ఆ తండ్రి నాతో ఏమన్నారో తెలుసా? అన్నా..నా కొడుకు ఇంజినీరింగ్‌ చదువుతా అంటే నేను ఆరాటపడ్డాను. ఫీజులు లక్షల్లో ఉన్నాయి. ప్రభుత్వం రూ.35 వేలు మాత్రమే ఇస్తుంది..మిగిలిన డబ్బులు ఎలా కడతారు నాన్న అని తన కొడుకు బాధపడ్డాడట. రూ.70 వేలు అప్పు తెచ్చి మొదటి సంవత్సరం చదివించా అన్నారు. రెండో ఏడాది ఎలా కడతారు నాన్న అని నా పరిస్థితి తెలిసి ఆత్మహత్య చేసుకున్నాడని ఆ తల్లిదండ్రులు చెబుతుంటే నా గుండె బరువెక్కింది. 
– రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..పేదవాడి కోసం నాన్నగారు ఒక్క అడుగు ముందుకు వేస్తే..జగన్‌ రెండు అడుగులు ముందుకు వేస్తాను. మీ పిల్లలు ఏం చదువుతారో చదివించండి..ఎన్ని లక్షలు ఖర్చైనా నేను చదివిస్తాను. అంతేకాదు మీ పిల్లలు హాస్టల్‌ ఉండేందుకు అయ్యే ఖర్చులకు గాను ప్రతి ఏటా రూ.20 వేలు చెల్లిస్తాం.  మన పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లు కావాలంటే ఆ చిట్టి పిల్లల నుంచి పునాదులు పడుతాయి. ఈ చిట్టి పిల్లలు బడికి వెళ్తేనే మన తలరాతలు మారుతాయి. వీరు డాక్టర్లు, ఇంజినీర్లు అయితేనే మన బతుకులు మారుతాయి. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పేదవాడి కోసం రెండు అడుగులు ముందు కు వేస్తాను. మీ చిట్టి పిల్లలను బడికి పంపించినందుకు ప్రతి ఏటా ఆ తల్లికి రూ.15 వేలు ఇస్తాను. దీని వల్ల పిల్లలు బడి బాట పడుతారు. ఆ తల్లులు కూడా పిల్లలను చదివించేందుకు ఆరాటపడుతారు. వారు చదివితేనే మన తలరాతలు మారుతాయి. ఏపీలో 32 శాతం మందికి చదువురాని పరిస్థితి ఉందట. దాని అర్థం పేదవాడు తన పిల్లలను చదివించడం లేదు. ఈ పరిస్థితి మారుస్తాను. నవరత్నాలలో ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే నాకు సూచనలు, సలహాలు ఇవ్వండి. మీ అందరికి తెలుసు నేను ఎక్కడ పడుకుంటానో..ఎక్కడికి వెళ్తానో తెలుసు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను  ఆశీర్వదించమని, తోడుగా ఉండమని మీ అందరిని కోరుతున్నాను. 


 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top