వైయస్‌ఆర్‌ గర్వపడేలా పాలన చేస్తా



– తూర్పు గోదావరి జిల్లాకు చంద్రబాబు చేసింది ఏంటి?
– వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారు
– ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదు
– గుడి, బడి పక్కనే బెల్టు షాపులు
– ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చినట్లు బాబు నాటకాలు
–వినేవాడు అమాయకుడు అయితే చెప్పేవాడు చంద్రబాబు
– ఆరు నెలల్లో 19 లక్షల ఇళ్లు అంటూ బాబు ప్రజల  చెవుల్లో క్యాలీఫ్లవర్‌ పెడుతున్నారు.

– బస్సు, విద్యుత్‌ చార్జీలు ఎడాపెడా పెంచారు
– 100 పడకల ఆసుపత్రిలో 8 మంది డాక్టర్లే
– లంచాలు తీసుకునేది బాబు, డబ్బులు కట్టాల్సింది పేదోడా?
 – వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కింద పరిగణిస్తాం
– దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారికి పింఛన్‌ రూ. 10 వేలు  
 
తూర్పు గోదావరి: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి స్వర్గం నుంచి గర్వపడేలా పాలన చేస్తానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. మహానేత పాలన గురించి ప్రజలు గొప్పగా చెబుతుంటే గర్వంగా ఉందని ఆయన తెలిపారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అబద్ధాలు, మోసాలతో పాలన సాగిందని, ఇలాంటి వారిని బంగాళఖాతంలో కలిపేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 207వ రోజు రామచంద్రాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
 
– ఈ రోజు వేలాది మంది నాతో పాటు అడుగులో అడుగులు వేశారు. ఒకవైపు కష్టాలు చెప్పుకుంటూ, అర్జీలు ఇస్తూ..మరో వైపు అన్నా..మేమంతా నీకు తోడుగా ఉంటామని భుజాన్ని తడుతున్నారు. ఏ ఒక్కరికి నాతో పాటు నడవాల్సిన అవసరం లేదు. అయినా వేలాది మంది నాతో నడుకుంటూ వస్తున్నారు. ఈ నడిరోడ్డుపై నిలవాల్సిన అవసరం లేకున్నా..వర్షం పడుతున్నా లెక్క చేయకుండా చిక్కటి చిరునవ్వులతో ప్రేమానురాగాలు పంచుతున్నారు. ఆప్యాయతలు పంచుతున్నారు. మీ అందరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
– టీడీపీ పాలనకు నాలుగేళ్లు పూరై్తంది. ఇక్కడికి వచ్చినప్పుడు నాతో ప్రజలు అన్న మాటలు ఏంటంటే..నిరుడు ఎన్నికల్లో చంద్రబాబుకు 14 నియోజకవర్గాలు కట్టబెట్టాం. అది చాలదు అన్నట్లుగా చంద్రబాబు వైయస్‌ఆర్‌సీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొనుగోలు చేశారు. మొత్తం 17 మంది ఎమ్మెల్యేలను తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. మాజిల్లాకు చంద్రబాబు చేసింది ఏంటని ప్రజలు అడుగుతున్నారు.
– అన్నా...ఈ నియోజకవర్గానికి చంద్రబాబు చేసిందేంటన్నా..ఆ దివంగత నేత వైనయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తుకు తెచ్చుకుంటూ వారి నోట్లో మాటలు వింటుంటే గుండె ఉప్పొంగింది. నాన్నగారు చేసిన పనులను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. 
– ఇదే ప్రాంతంలో వెటర్నరీ పాలిటెక్నిక్‌ కాలేజీ ఏర్పాటు చేశారని, దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రామచంద్రాపురంలో రూ.800 కోట్లు అభివృద్ధి పనులు జరిగాయని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. తాగడానికి మంచినీళ్లు లేవు. శివారు భూములకు సాగునీరు లేదు. ఏటా గోదావరి ప్రవాహంలో పంట పొలాలు మునిగిపోతున్నాయి. నాన్నగారి పాలనలో 21 కిలోమీటర్ల ఏటిగట్లను ప్రటిష్ట పరిచారు. జొన్నాడ నుంచి కోటీ వరకు గట్టును వెడల్పు చేసి ఎత్తు పెంచారని చెప్పుకుంటున్నారు. నాన్న గారు చనిపోయాక ఈ పనులు అంగుళం కూడా ముందుకు సాగడం లేదు. 
– ఇవాళ పరిస్థితుల గురించి ప్రజలు బాధతో చెబుతున్నారు. డ్రైన్లలో పూడికలు తొలగించకపోవడంతో సుమారు 35 వేల ఎకరాలు ప్రతి ఏటా మునిగిపోతున్నాయి. ఇదే నియోజకవర్గంలోనే కాజలూరు, కే.గంగవరం మండలంలో రబీసీజన్‌లో సక్రమంగా సాగునీరు అందడం లేదని మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదు. కష్టపడి రైతు వరి పండిస్తే..ఆ ధాన్యం అమ్ముకోలేని పరిస్థితి ఉంది. ఆ వరి రూ.1150కి కూడా అడిగే నాథుడు లేడు.
– చంద్రబాబు పాలన గురించి చెప్పుకోస్తు..పక్కనే ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు 16 మంది ఉండాలి. అక్కడేమో 8 మంది డాక్టర్లు కూడా లేరు. ఈ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌ లేని పరిస్థితిలో ఆసుపత్రి నడుపుతున్నారు. జనరల్‌ ఫీజిషియన్‌ లేడు.  ఇదే మండలంలోని నెలవర్తిపాడు పంచాయతీలో అక్కచెల్లెమ్మలు కలిశారు. అన్నా..మా పంచాయతీలో డ్రైన్‌లో పిల్లలు పడి చనిపోతున్నారు. రోడ్డు వేయమని బ్రతిమిలాడుకుంటున్నా..పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. అన్నా..ఎదురుగా కలినిపిస్తున్న వైయస్‌ఆర్‌ ఆర్చ్‌ కనిపిస్తే రోడ్డు వేస్తామని చెబుతున్నారన్నా..ఇంత కంటే దిక్కుమాలిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా?
– రామచంద్రాపురంలో రోడ్డు వేయడానికి డబ్బులు ఉన్నా కూడా కేవలం వైయస్‌ఆర్‌సీపీకి సంబంధించిన ఆర్చ్‌ ఉందని రోడ్డు వేయడం లేని దుస్థితి చూసి గుండె తరుక్కుపోతోంది.
– అన్నా..చంద్రబాబు రూ.2లకే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌  ఇస్తామన్నారు. ఇవాళ ఇదే రామచంద్రాపురం మునిసిపాలిటీలో నాన్నగారి హయాంలో మా దాహార్తి తీసేందుకు 42 ఎకరాల్లో సమ్మర్‌ స్టోరేజీ ఏర్పాటు చేస్తే ..ఆ పనులు ఎక్కడి గొంగలి అక్కడే ఉందన్నా అంటున్నారు.  ఇటువంటి వారా రూ.2 లకు మినరల్‌ వాటర్‌  ఇచ్చేది.
– కే.గంగవరంలో కలుషిత నీరు ఇళ్లలోకి వస్తోంది. తామరపల్లి, ఉడిముడి, కోట్ల గ్రామాలలో ప్రజలు కుళాయి నీటిని ఉపయోగించడం లేదు. ఈ నీళ్లు చూపించి అన్నా..మీటింగ్లో ఈ నీరు చూపించి..చంద్రబాబు గారు..ఇవి చెరుకు రసం కాదు ..మేం తాగే మంచినీళ్లు. ఈ నీరు కుళాయిల్లో వస్తుందని చంద్రబాబుకు చూపించండి అన్నా అంటున్నారు.
– కాజలూరు మండలంలో వైయస్‌ఆర్‌ ప్రారంభించిన రక్షిత మంచినీటి పథకం 26 గ్రామాల్లో రోజుకు రెండు పూటల నీరు ఇవ్వాల్సి ఉండగా ఇప్పుడు కేవలం వారానికి రెండు సార్లు ఇస్తున్నారంటే..నిజంగా ఇది పాలనేనా? 
– అన్నా..ఆ రోజు ఎన్నికల సమయంలో ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం, ఇల్లు కట్టిస్తామని ఊదరగొట్టారు. నాన్నగారి హయాంలో ఈ నియోజకవర్గంలో 11 వేల ఇల్లు ఇచ్చారని చెబుతుంటే నిజంగా గర్వంగా ఉంది. 32 ఎకరాలు సేకరించి పేదవారికి ఉచితంగా ఇల్లు కట్టించాలని నాన్నగారు భావించారు. ఈ భూమిని ఈ ప్రభుత్వం హస్తగతం చేసుకొని, అక్కడ ప్లాట్లు కడుతారట. చంద్రబాబు చేస్తున్న అవినీతిని చూసి బాధనిపిస్తోంది. పేదవాళ్లకు  ఇచ్చే ఇళ్లలో కూడా లంచాలు తీసుకునే వ్యక్తి చంద్రబాబు తప్ప మరెవ్వరూ ఉండరేమో?. ఆ ప్లాట్లు పేదవాడికి అడుగుకు రూ.2 వేల చొప్పున అమ్ముతారట. ప్లాట్లలో లిప్టు లేదు. మార్బుల్‌ ప్లోరింగ్‌ లేదు. ఇటువంటి ప్లాట్లు కట్టడానికి రూ.1000 కూడా కాదని బిల్డర్స్‌ చెబుతున్నారు. అక్షరాల రూ.3 లక్షలకే పేదవారికి ఇవ్వవచ్చు. ఈ పెద్ద మనిషి పేదవాడికి రూ.6 లక్షలకు ఇస్తున్నారట. ఇందులో రూ.3 లక్షలు పేదవాడి తరఫున అప్పుగా రాసుకుంటారట. ఆ పేదవాడు 25 సంవత్సరాలు కంతులు కట్టుకుంటూ పోవాలట. లంచాలు తీసుకునేది చంద్రబాబు..అప్పులు కట్టేది ఆ పేదవాడు.  ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? ఎన్నికలు వస్తున్నాయని కాబట్టి వాటిని మీకు ఇచ్చే యోచనలో ఉన్నారు. ఆ ప్లాట్లు తీసుకోండి. మనందరి ప్రభుత్వం వచ్చాక మీరు కట్టే రూ.3 లక్షలు మాఫీ చేస్తానని మాట ఇస్తున్నాను.
– చంద్రబాబు పరిపాలన గురించి ఒక్కసారి చెప్పుకోవాలంటే..చంద్రబాబు సీఎం అయ్యాక ద్రాక్షారామం వచ్చారు. చుట్టూ రింగ్‌ రోడ్డు నిర్మిస్తానని జన్మభూమి సభలో చెప్పారు. ఇంతవరకు అతీగతీ లేదు.
– రామచంద్రాపురంలో డంపింగ్‌ యార్డు తరలించాలని ప్రజలు అడుగుతున్నా కూడా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ఇలాంటి పాలన మనకు కావాలా? ఇంతటి దారుణమైన పాలన చూస్తున్నాం.
– ఇదే పాలనను ఒక్కసారి గమనించండి. చంద్రబాబు సర్వం దోచుకుని రాష్ట్రాన్ని నడిరోడ్డున పడేశారు. ఇప్పుడేమో అయ్యయ్యో ఏపీకి అన్యాయం జరుగుతుందని డ్రామాలాడుతున్నారు. అయ్యయ్యే హోదా రాలేదా? దగా చేసిన ఈ రాష్ట్రాన్ని చూపిస్తూ..అయ్యయ్యో మన రాష్ట్రాన్ని మోడీ మోసం చేశారని మాట్లాడుతున్నారు.  ఇదే పెద్ద మనిషి నాలుగేళ్లు బీజేపీతో కలిసి సంసారం చేశారు. కేంద్ర మంత్రులుగా టీడీపీ ఎంపీలుగా కొనసాగారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఇక్కడ మంత్రులుగా పని చేశారు. ఒకరికి ఒకరు విఫరీతంగా పొగిడేసుకున్నారు. ఎన్నికలు ఆరు నెలల్లో వస్తున్నాయని విడాకులు తీసుకున్నారు. ప్రజలకు క్వాలీఫ్లవర్‌ పూలు పెడుతున్నారు. చంద్రబాబు తానే ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడుస్తారు. ఎన్నికల సమయంలో ఆయన ఫోటోకు దండలు వేస్తారు. ఇటువంటి దారుణమైన వ్యక్తిని ఏమనాలి. మోసం చేసే వ్యక్తిని ఏమనాలి?
– చంద్రబాబు మోసాలు గమనిస్తే..రైతుల రుణాలు బేషరత్తుగా మాఫీ చేస్తామన్నారు. బ్యాంకులో బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. ఆ తరువాత మోసం చేశారు. రైతులకు గిట్టుబాటు కల్పించకుండా దళారీలకు నాయకుడిగా మారాడు. రైతులను ఆత్మహత్యల బాట పట్టించారు. ఇలాంటి మనిషిని ఏమనాలి. పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఒ క్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. ఆ అప్పులు రెట్టింపు అయి బ్యాంకులు నోటీసులు ఇస్తున్నారు. 
– రైతులు, డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు లేకుండా చేశారు.
– బాబు వస్తే జాబు వస్తుందని ఊదరగొట్టారు. చివరకు నాలుగేళ్లుగా నిరుద్యోగభృతి బాకీ పడి ఎగ్గొట్టిన ఈ వ్యక్తిని ఏమనాలి?
– ఎన్నికల సమయంలో బెల్టు షాపులు రద్దు అన్నారు. సీఎం కాగానే తొలి సంతకం చేశారు. ఇవాళ ప్రతి వీధిలో, బడి, గుడి పక్కన బెల్టు షాపులు పెట్టారు.
– ఇసుకను వదిలిపెట్టడం లేదు. మట్టి, బొగ్గు, కరెంటు కొనుగోలు, రాజధాని, గుడి భూములను దోచేస్తున్న ఈ వ్యక్తిని ఏమనాలి.
– చంద్రబాబు ఎన్నికల సమయంలో ఏమన్నారు. ప్రతి పేదవాడికి ఉచితంగా చదువులు చెప్పిస్తా అన్నారు. ఇవాళ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నీరు గార్చారు. పిల్లలను చదివించుకోలేని  అవస్థలు చూసి ఏమనాలి.
–నాలుగేళ్లలో చంద్రబాబు అరకొరగా ఇల్లు కట్టించారు. ఎన్నికలు ఆరు నెలల్లో వస్తున్నాయని 19 లక్షల ఇల్లు కట్టిస్తానని క్వాలీఫ్లవర్‌ పెడుతున్నారు.
– రేషన్‌కార్డు, పింఛన్‌ కావాలన్నా లంచాలు ఇవ్వాలి. జన్మభూమి కమిటీల పేరుతో మాఫీయాలను పెంచి పోషిస్తున్నారు. పెట్రోలు, డీజిల్, కరెంటు, ఆర్‌టీసీ చార్జీలు ఎడాపెడా పెంచారు.
– ప్రత్యేక హోదా రాదని తెలిసీ కూడా తన ఎంపీలతో రాజీనామా చేయించని వ్యక్తిని ఏమనాలి.
– కడపలో స్టీల్‌ ప్లాంట్‌ రాకుండా అడ్డుకున్న వ్యక్తి ఇవాళ ముసలి కన్నీరు కార్చుతూ నిరాహార దీక్షలు చేయిస్తుంటే ఏమనాలి?
– చంద్రబాబు ఇవాళ గవర్నమెంట్‌ ఉద్యోగులకు 3 డీఏలు పెండింగ్‌లో పెట్టారు. సీపీఎస్‌ రద్దు చేయలేదు. పదోన్నతులు లేవు. ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయని ఉద్యోగస్తులతో సన్మానాలు చేయించుకుంటున్నారు.
– వినేవాడు అమాయకుడు అయితే తాను ఎన్నైనా చెబుతాను అంటున్న చంద్రబాబును ఏమనాలి?
– చంద్రబాబు పాలన గురించి సుమతి శతకంలో ఒక మాట ఉంది. పాముకు విషయం కోరల్లో ఉంటుంది. తేలుకు తోకలో ఉంటుంది. దుష్టుడికి నిలువెల్లా విషం ఉంటుందన్నారు.
– నాలుగేళ్లలో ఇలాంటి పరిపాలన చూశాం. మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. మీకు ఎలాంటి నాయకుడు కావాలి? అబద్ధాలు చెప్పేవారు నాయకుడు కావాలా? మోసాలు చేసేవారు నాయకులు కావాలా? ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ చెడిపోయిన వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం రావాలి. వైయస్‌ జగన్‌కు మీ అందరి తోడు, దీవెనలు కావాలి. అప్పుడే విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం వస్తుంది. 
– పొరపాటున చంద్రబాబు మోసాలను నమ్మి క్షమిస్తే..రేపు పొద్దున ఈ పెద్ద మనిషి ఏం చేస్తారో తెలుసా? ఎన్నికల్లో మీ వద్దకు వచ్చి ఎన్నికల ప్రణాళికలో తాను ఇచ్చిన హామీల్లో 98 శాతం పూర్తి చేశానని చెవ్వుల్లో క్వాలీఫ్లవర్‌ పెడతారు. చిన్నచిన్న అబద్ధాలు నమ్మరని ఆయనకు బాగా తెలుసు. ఈ సారి నాకు ఓటు వేస్తే. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటారు. నమ్ముతారా? కేజీ బంగారం. దానికి బోనస్‌ అంటారు. ప్రతి ఇంటికి బెంజి కారు అంటారు. అయినా మీరు చంద్రబాబును నమ్మరని బాగా తెలుసు..ప్రతి ఇంటికి ఒక మనిషిని పంపిస్తారు. మహిళా సాధికార మిత్రలను పంపిస్తారు. వీరు వచ్చి ప్రతి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతారు. డబ్బులు  ఇస్తే మాత్రం వద్దు అనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లో నుంచి దోచేసిన సొమ్మే. ఓటు వేసేటప్పడు మాత్రం మీ మనసాక్షి ప్రకారం వేయమని కోరుతున్నాను. అబద్ధాలు ఆడేవారిని, మోసాలు చేసేవారిని బంగాళఖాతంలో కలిపే పరిస్థితి తీసుకుండి.
– దేవుడి ఆశీస్సులు, మీ అందరి చల్లని దీవెనలతో మనం ఏం చేస్తామన్నది నవరత్నాలు ప్రకటించాం. పేదవారి ముఖాల్లో చిరునవ్వులు చూడాలన్నదే లక్ష్యంగా నవరత్నాలు ప్రకటించాం. ఇవాళ నవరత్నాల్లో నుంచి పేదవాడి ఆరోగ్యం గురించి ఏం చేస్తామన్నది ఈ మీటింగ్‌లో చెబుతున్నాను.
– ఒక్కసారి మీ గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయండి. ఆరోగ్యం బాగోలేకపోతే వైద్యం అందుతుందా? నాన్నగారి పాలనను గుర్తుకు తెచ్చుకోండి. నాన్నగారు ఎప్పుడు అంటుండేవారు. పేదవాడు అప్పులపాలు అయ్యేది రెండు సందర్భాల్లో అనేవారు. పేదవాడు తన కుటుంబంలో పిల్లలను చదివించుకునేందుకు, ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రికి వెళ్లే సమయంలో అప్పులపాలు అయ్యేవారు. అటువంటి పరిస్థితి ఏ పేదవాడికి రాకుడదని వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారు. ఎంత పెద్ద ఆపరేషన్‌ అయినా ఉచితంగా చేయించి చిరునవ్వుతో ఇంటికి పంపించేవారు. 108కు ఫోన్‌ కొడితే 20 నిమిషాల్లో ఇంటి ముందు వాలిపోయేది. ఇవాళ 108 అంబులెన్స్‌లకు డీజిల్‌ కరువైంది. రేపు పొద్దున దువుడి ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రతి పేదవాడిని నేను భరోసా ఇస్తున్నాను. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే చాలు ఆరోగ్యశ్రీ కిందకు తెస్తాను. మంచి ఆసుపత్రి ఎక్కడైనా ఉండని వైద్యం నేను చేయిస్తాను. నాన్నగారు పేదవాడి కోసం ఒ క్క అడుగు ముందుకు వేస్తే జగన్‌ రెండు అడుగులు ముందుకు వేస్తాను. మీ అందరికి హామీ ఇస్తున్నాను. ఆపరేషన్‌ చేయించుకున్న తరువాత ఏడాది పాటు రెస్టు తీసుకోవాలని డాక్టర్‌ చెబితే ..ఆ సమయంలో ప్రభుత్వమే డబ్బులిచ్చి తోడుగా ఉంటుంది. దీర్ఘకాలిక రోగాలతో  బాధపడుతున్న ప్రతి పేదవాడికి నెల నెల రూ.10 వేల పింఛన్‌ ఇస్తానని మాట ఇస్తున్నాను. ఇందులో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే ఎవరైనా అర్జీలు ఇవ్వవచ్చు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నా..

 
Back to Top