ముఖ్యమంత్రికి ఏమీ ఎక్కడం లేదు: వైఎస్ జగన్


న్యూఢిల్లీ: రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి పచ్చని పంట భూములను బలవంతంగా లాక్కోవడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఏ చర్యకైనా తమ పార్టీ మద్దతు ఉండబ్దోని ఉద్ఘాటించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఆదివరారం ఇక్కడ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను జగన్ కలిశారు. ఆయన వెంట పార్టీ ఎంపీల వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి ఉన్నారు. ఉదయం రాజ్‌నాథ్‌ను ఆయన నివాసంలో కలిసిన అనంతరం జగన్ విలేకరులతో మాట్లాడారు.

రాజధాని ప్రాంతంలో రైతుల భూములు బలవంతంగా లాగేసుకుంటున్నారు. అలాంటి వారిని ఏమైనా కేంద్రం వద్దకు తీసుకువచ్చే ఆలోచన ఉందా? అని విలేకరులు జగన్‌ను అడగ్గా..‘సీఆర్‌డీఏకి సంబంధించి రైతులు ఎలా నష్టపోతున్నారు? రైతులకు ఇష్టం లేకున్నా వారిపై ఎలా ఒత్తిడి తెస్తున్నారన్న అంశాలను కూలకషంగా వివరించాం. రైతు ఒప్పుకుంటే ఫర్వాలేదు.కానీ ఒప్పుకోకున్నా అన్యాయంగా వారి వద్ద నుంచి భూములు తీసుకోవడం సరైన పద్ధతి కాదని ఇంతకు ముందు కూడా రైతులు కేంద్రం వద్దకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే మొన్న రైతులను తీసుకువచ్చి వినతిపత్రం ఇచ్చారు. రైతులు అంతకన్నా చేసేది ఏముంది? ఎన్నిసార్లు ఏం చేసినా మన ఖర్మ ఏందంటే చర్మం మందంగా ఉన్న ముఖ్యమంత్రి మనకు ఉన్నారు. ఆ సీఎంకు ఏమీ ఎక్కడం లేదు. అది మన ఖర్మ’ అని జగన్ మండిపడ్డారు. ‘భూ సేకరణ చట్టం ఆర్డినెన్స్‌పై అన్నా హజారే ఈ నెల 24 నుంచి ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు. మీరు అందుకు మద్దతు ఇస్తారా? అని ప్రశ్నించగా.. ‘ మేం మొదటి నుంచి ఒకటే చెబుతున్నాం.. అంశాల వారీగా మద్దతిస్తామని, భూ సేకరణ చట్టానికి సంబంధించి మల్టీక్రాప్ ఏరియాను తీసుకోవడాన్ని మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సీఆర్‌డీఏలో అదే జరుగుతోంది. రైతుల దగ్గర నుంచి మల్టీక్రాప్ భూములను తీసుకునే కార్యక్రమం దౌర్జన్యంగా చేస్తున్నారు. కచ్చితంగా మేం దాన్ని వ్యతిరేకిస్తాం. ప్రజలకు మంచి జరిగే విషయాల్లో కచ్చితంగా మద్దతిస్తాం. ప్రజలకు ఇబ్బంది కలిగే ఏ అంశానికైనా మా మద్దతు ఉండదు. మిగిలిన ఇన్సూరెన్స్ బిల్లు పలు అంశాలపై పార్లమెంట్‌లో మా పార్టీ మద్దతు ఇస్తుంది.
Back to Top