ఇసుక తవ్వకాలతో గుంతలమయమైన వంశధార నదిని చూసి బాధేసింది

 


15–12–2018, శనివారం 
దేవాది, శ్రీకాకుళం జిల్లా 

తెలుగు ప్రజల స్వరాష్ట్ర సాధకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు, సమగ్ర భారత రూపశిల్పి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌పటేల్‌ల వర్ధంతి సందర్భంగా ఆ మహనీయులను స్మరించుకుంటూ పాదయాత్ర ప్రారంభించాను. 
నైరలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ కళాశాల మీదుగా పాదయాత్ర సాగింది. అక్కడ నాలుగు రోజులుగా ధర్నా చేస్తున్న కళాశాల విద్యార్థులు కలిశారు. ఈ నాలుగున్నరేళ్లలో వందలాది ఖాళీలున్నా ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని చెప్పారు. కోర్సు పూర్తి చేసుకొని ఏటా వేలాది మంది నిరుద్యోగులుగా బయటకొస్తున్నామని వివరించారు. మరోవైపు ఎలాంటి అర్హతలూ లేకున్నా.. ఎటువంటి ప్రమాణాలు పాటించకున్నా కమీషన్ల కోసం ప్రైవేటు కళాశాలలకు ఇష్టారాజ్యంగా అనుమతులిచ్చేస్తోందంట ఈ ప్రభుత్వం. ఆ ప్రైవేటు కళాశాలలన్నీ టీడీపీ నాయకులవేనని.. విద్యార్థుల నుంచి దాదాపు 10 లక్షల రూపాయలకు పైగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. అసలే ఉద్యోగాలు లేక విలవిల్లాడుతుంటే.. ప్రైవేటు కళాశాలల నుంచి పోటీ మరింత పెరిగిపోయిందన్నారు. నిరుద్యోగుల సమస్యను పెంచి పోషిస్తున్న ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళన చేస్తున్నామని చెప్పారు.
 

‘మాకొద్దీ తెల్ల దొరతనం’ అని గళమెత్తిన గరిమెళ్ల సత్యనారాయణ నడయాడిన నేల.. కంచు సామగ్రి తయారీలో పేరెన్నికగన్న ప్రాంతం నరసన్నపేట. మధ్యాహ్నం వంశధార నదిని దాటి మడపాం వద్ద నరసన్నపేట నియోజకవర్గంలో అడుగుపెట్టాను. ఇష్టారాజ్యంగా తవ్వేయడంతో పూర్తిగా గుంతలమయమైన వంశధారను చూసి బాధేసింది. నదిలో భారీ వాహనాల కోసం ఏర్పాటు చేసిన బాటలు చూసి ఆశ్చర్యమేసింది. జిల్లాలోనే అత్యధిక ఇసుక దోపిడీ జరిగే ప్రాంతం ఇదేనని గ్రామస్తులు చెప్పారు. వందలాది వాహనాలు, భారీ యంత్రాలతో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందన్నారు. రాత్రింబవళ్లు తిరిగే వాహనాలతో భీతిల్లిపోతున్నామంటూ వాపోయారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వరద వచ్చినప్పుడు 40కిపైగా భారీ వాహనాలు, జేసీబీలు, వందలాది మంది ఇసుక తవ్వుతున్న కూలీలు రాత్రి పూట నది మధ్యలో చిక్కుకుపోయి హాహాకారాలు చేశారట. అధికారులు పట్టించుకోకున్నా ప్రకృతే ఇసుక దొంగల్ని పట్టించిందని స్థానికులు చెప్పుకొచ్చారు. పాలకుల విచ్చలవిడి ఇసుక దోపిడీకి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది?

ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసినప్పుడు హోదాను సమాధి చేయాలని విశ్వప్రయత్నం చేసిన మీరు.. నేడు కాంగ్రెస్‌తో మీ అనైతిక అవకాశవాద పొత్తును సమర్థించుకోవడానికి హోదా అంశాన్ని సాకుగా చూపడం, అదేదో వాళ్లిప్పుడే కొత్తగా ఇస్తామన్నట్టుగా మాట్లాడటం.. మీ దిగజారుడుతనానికి  పరాకాష్ట కాదా?   
- వైఎస్‌ జగన్‌  


Back to Top