నాన్నగారి ప్రతి స్మృతినీ గుండెల్లో దాచుకున్న ఆ అభిమానం వెలకట్టలేనిది

27–08–2018, సోమవారం
కొండకర్ల జంక్షన్, విశాఖపట్నం జిల్లా

యలమంచిలి నియోజకవర్గంలో నాలుగోరోజు యాత్ర సాగింది. రాంబిల్లి మండలంలోని నేవెల్‌ బేస్‌ నిర్వాసితులు కలిశారు. ఏడేళ్ల కిందట.. అప్పటి కలెక్టర్‌ సమక్షంలో జరిగిన మీటింగ్‌ మినిట్స్‌లో వీరి 13 డిమాండ్లను పొందుపరిచారు. ఇప్పటికీ ఏ ఒక్కటీ అమలైంది లేదు.

సెజ్‌ నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలోనూ పచ్చనేతలు హస్తలాఘవం చూపించారట. దిబ్బపాలెం పునరావాస కాలనీలో జరిగిన కోట్లాది రూపాయల అవినీతి, అక్రమాలను గ్రామస్తులు వివరించారు. అధికార పార్టీ నేతల అవినీతి దాహానికి ఏదీ మినహాయింపు కాదు. అవకాశాలు కల్పించుకుని మరీ అవినీతికి పాల్పడటం బాబుగారు నేర్పిన పాఠమే. 


రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద మంచినీటి సరస్సు కొండకర్ల ఆవ. పదివేల ఎకరాల ఆయకట్టు.. మూడు ఎత్తిపోతల పథకాలు. దాదాపు 300 మత్స్యకార కుటుంబాలు ఆధారపడ్డాయి. అటువంటి సరస్సు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని ఇక్కడి ప్రజలు చెప్పుకొచ్చారు. ఈ సరస్సును సంరక్షించి, అభివృద్ధి పరిచి పర్యాటకంగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. 

2003లో బస్సు యాత్రగా వచ్చిన నాన్నగారు సానికాలవ జంక్షన్‌ వద్ద చెట్టు నీడన అమ్మతో కలిసి భోంచేశారట. పదిహేనేళ్లు గడిచినా ఇక్కడి ప్రజలు మర్చిపోలేదు. నన్ను అక్కడికి తీసుకెళ్లి ఆ జ్ఞాపకాలను పంచుకున్నారు. అదే స్థలంలో నాతో ఓ ఫలం తినిపించారు. అక్కడ నాన్నగారి ఫొటోకు నివాళులర్పించి ఓ మామిడి మొక్క నాటాను. నాన్నగారి ప్రతి స్మృతినీ గుండెల్లో పదిలంగా దాచుకున్న వారి అభిమానం వెలకట్టలేనిది. 

నిస్వార్థ చింతనతో సంఘసేవ చేసేవారు అరుదుగా కనిపిస్తారు. అట్టి వారిని గుర్తించి ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వ ప్రోత్సాహం పూర్తిగా కరువై, సర్కారీ పోకడలే ప్రతిబంధకాలుగా మారితే.. రానురాను సేవ చేసేవారు ముందుకు రావడం కూడా కష్టమే. కొండకర్ల వద్ద కొద్దిమంది శారీరక, మానసిక దివ్యాంగులను చూశాను. చిన్నచిన్న పిల్లలు. అందరూ అనాథలే. ఓ స్వచ్ఛంద సంస్థలో ఆశ్రయం పొందుతున్నారు. వారిని చూసి చాలా బాధేసింది. తల్లీతండ్రీ లేని దివ్యాంగులైన ఆ చిన్నారులకు పింఛన్‌ కూడా రావడం లేదట. రేషన్‌ కార్డు ఉంటేనే పింఛన్‌కు అర్హులు. తల్లీతండ్రీ లేకుంటే రేషన్‌కార్డు ఇవ్వరు.. ఇదేం న్యాయం? ఇటువంటి వారికీ అక్కరకురాని సంక్షేమ పథకాలెందుకు? ప్రభుత్వ సాయానికి వీరికన్నా అర్హులుంటారా? నాలుగేళ్లుగా ఆ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఈ చిన్నారుల పింఛన్‌ల కోసం తిరుగుతూనే ఉన్నారు. అధికారులేమో కుంటి సాకులు చెబుతూ మోకాలడ్డుతున్నారు. మరి బతికున్న వారిని చనిపోయినట్లుగా చూపించి వితంతు పింఛన్‌లు మెక్కేస్తున్న పచ్చనాయకులకు ఏ కుంటి సాకులూ అడ్డురావా? 

వైయ‌స్ఆర్‌సీపీ వారి ఓట్ల తొలగింపు ప్రక్రియ జరుగుతోందని దొప్పెర్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడేమిటీ.. రాష్ట్రవ్యాప్తంగా ఇదే తంతు నడుస్తోంది. అక్రమ మార్గాలు, అడ్డదారులే విజయానికి సోపానాలని భావించే వ్యక్తి పాలనలో ఓట్ల తొలగింపులు, దొంగ ఓట్ల చేర్పింపుల్లో ఆశ్చర్యమేముంది?

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. వెన్నుపోటుతోనో.. అనైతిక అవకాశవాద పొత్తులతోనో.. మోసపు హామీలతోనో అధికారంలోకి వచ్చిన చరిత్ర మీది. ఏ ఒక్కసారైనా ప్రజాభిమానంతో పగ్గాలు చేపట్టారా? పోనీ.. అధికారంలోకి వచ్చాకైనా ప్రజాభిమానం పొందగలిగారా? ఆ రెండూ జరక్కపోవడం వాస్తవం కాదా? 
-వైయ‌స్‌ జగన్‌  
Back to Top